Best Web Hosting Provider In India 2024
దీపావళి పండగ ఈరోజు ముగిసింది. సాధారణంగా పండగా అనగానే ఇంట్లో ఒక హడావుడి వాతావరణం కనిపిస్తుంటుంది. కనీసం ఓ 2-3 రోజుల ముందు నుంచే ఇంట్లో పనులతో మహిళలు, పెద్దవారు బిజీ అయిపోతారు. ఇంటిని పూర్తిగా శుభ్రం చేయడం, పూజకి ఏర్పాట్లు చేసుకోవడం, వంటలు చేయడం లాంటి వాటితో మహిళలకి ఎక్కువగా అలసిపోతారు.
కఠినమైన ఈ పనుల కారణంగా అలసట, కండరాల నొప్పి రావొచ్చు. మరీ ముఖ్యంగా కాళ్ల నొప్పులు అధికంగా కనిపిస్తుంటాయి. పండగ ముగిసిపోయింది కాబట్టి.. కాస్త విరామం తీసుకుని మీ కాళ్ల నొప్పుల నుంచి చిన్న టిప్స్‌తో ఇంట్లోనే ఉపశమనం పొందండిలా.
వేడి నీటిలో పాదాలు
పండగ వేళ మీరు ఎక్కువగా అటు ఇటు తిరుగుతుంటారు. కాబట్టి కాస్త నొప్పి ఉండొచ్చు. ఆ నొప్పి నుంచి తక్షణం ఉపశమనం పొందాలంటే గోరువెచ్చని నీళ్లు తీసుకుని అందులో మీ పాదాల్ని ఓ 10 నిమిషాలు ఉంచాలి. వీలైతే కాస్త ఉప్పు కూడా ఆ నీటిలో వేస్తే నొప్పి నుంచి మరింత వేగంగా ఉపశమనం లభిస్తుంది.
కాళ్లకి మసాజ్
పని ఒత్తిడి కారణంగా ఎక్కువ సేపు నిల్చోవడం లేదా కూర్చోవడం లాంటివి మీ పాదాల్లో రక్తప్రసరణపై ప్రభావం చూపుతుంది. దాంతో తిమ్మిరి లేదా నొప్పి కలగవచ్చు. ఆ నొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే మసాజ్ ఉత్తమం. బాదం, ఆవాలు, నువ్వుల నూనెను మసాజ్ కోసం వాడొచ్చు. ఇలా చేయడం వల్ల మీ పాదాలకు చాలా వరకు ఉపశమనం లభిస్తుంది.
కాలు నొప్పి ఉంటే?
ఒకవేళ మీకు కాలు నొప్పి ఉంటే.. గోరువెచ్చని నీటిలో బట్టని ముంచి ఆ బట్టతో కాపడం పెట్టుకోవాలి. ఈ వెచ్చని కంప్రెస్ మీ శరీరంలో ఏ ప్రదేశంలోనైనా నొప్పి నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. ఒకవేళ వాపు ఉన్నా కూడా ఇది తగ్గిస్తుంది.
గోరు వెచ్చని నీటితో స్నానం
పండగ పనులు పూర్తిగా ముగిసిన తర్వాత నిద్రపోయే ముందు గోరు వెచ్చని నీటితో స్నానం చేయండి. ఇలా చేయడం వల్ల మీ శరీరం రిలాక్స్ అవ్వడమే కాకుండా వెంటనే ఉపశమనం ఫీలింగ్ లభిస్తుంది. కండరాల్లో ఎక్కడైనా నొప్పి ఉంటే.. గోరు వెచ్చని నీటిని ఆ కండరాలపై పోస్తూ చిన్నగా మర్దన చేయండి. దాంతో నిమిషాల వ్యవధిలోనే మీకు ఉపశమనం లభిస్తుంది.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు, ఇబ్బందులు ఉంటే సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించండి.