Best Web Hosting Provider In India 2024
Tatiparru Tragedy: పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాఝవరం మండలం తాటిపర్రు గ్రామంలో జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. గ్రామంలో విగ్రహావిష్కరణ ఏర్పాట్లు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి గ్రామ కూడలిలో సర్దార్ పాపన్న విగ్రహావిష్కరణ ఏర్పాట్లు చేస్తున్న యువకులు విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ ఘటనలో నలుగురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
తాటిపర్రు గ్రామంలో సర్దార్ పాపన్న విగ్రహావిష్కరణపై కొద్ది కాలంగా వివాదం నెలకొంది. వివాదాలు సద్దుమణగడంతో సోమవారం విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు చేశారు. విగ్రహాన్ని అలంకరించి దాని చుట్టూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. ఫ్లెక్సీలకు ఉన్న మెటల్ ఫ్రేమ్ విద్యుత్ తీగలకు తాకడంతో అందులోకి విద్యుత్ ప్రవహించి విద్యుదాఘాతంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. విద్యుదాఘాతానికి గురైన వారిని వెంటనే స్థానికులు తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన మరో యువకుడిని విజయవాడకు తరలించారు.
మృతి చెందిన వారిని దేవరాజు, నాగరాజు, మణికంఠ, కృష్ణలుగా గుర్తించారు. వీరిలో ముగ్గురికి వివాహాలు జరిగినట్టు కుటుంబ సభ్యులు వివరించారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
టాపిక్