Pawan Kalyan : నేను హోంశాఖ తీసుకుంటే పరిస్థితి మరోలా ఉంటుంది: పవన్ కళ్యాణ్

Best Web Hosting Provider In India 2024

ఇష్టమొచ్చినట్లు రౌడిల్లా వైసీపీ వ్యక్తులు వ్యవహరిస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? చర్యలు తీసుకోరా? అని హోంమంత్రి అనితను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఆడబిడ్డలను బెదిరిస్తూ, అవమానిస్తుంటే అరెస్టు చేయరా? అని నిలదీశారు. మీరు బాధ్యతగా వ్యవహరించండి, బలంగా పనిచేసి చట్టపరంగా వ్యవహరించండి అంటూ సూచించారు.

‘క్రిమినల్స్‌కు కులం, మతం ఉండదు. పోలీసులకు ఎన్నిసార్లు చెప్పాలి. అత్యాచార నిందితుల అరెస్ట్‌కు కులం అడ్డువస్తోందా. క్రిమినల్స్‌ను వదిలేయాలని ఏ చట్టం చెబుతోంది. అధికారులకు, ఎస్పీలకు చెబుతున్నా.. శాంతి భద్రతలు కీలకమైనవి. అత్యాచార ఘటనలపై హోంమంత్రి బాధ్యత వహించాలి. నేను హోంశాఖ తీసుకుంటే పరిస్థితి మరోలా ఉంటుంది’ అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

‘నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిని. హోమ్ శాఖ మంత్రిని కాదు. పరిస్థితులు చెయ్యి దాటితే నేను హోమ్ శాఖ తీసుకుంటాను. నేను తీసుకుంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తరహాలో వ్యవరిస్తాను. డీజీపీ గత ప్రభుత్వంలా వ్యవహరించకూడదు. బాధ్యత తీసుకోండి. పాత పద్ధతులు పాటిస్తాం అంటే చూస్తూ ఊరుకోను. ప్రజలు ఇచ్చిన పదవి ఇది, వారికి రక్షణ కల్పించాలి.’ అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

‘అధికారంలోకి వచ్చిన రోజు నుండి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకొమ్మని మాట్లాడుతుంటే, ఎందుకు తీసుకోవడం లేదు? ఎందుకు పోలీసు అధికారులు ఉద్యోగ ధర్మం మరచి మీనా మేషాలు లెక్కపెడుతున్నారు? ఇంకా పాత పద్ధతులు పాటిస్తున్నారు? మీరు ఐపీసీ చడవలేదా? ఒక తప్పు చేసిన వ్యక్తిని అరెస్టు చేయడానికి కులం ఎందుకు అడ్డొస్తుంది? ఎందుకు చేతకావడం లేదు? మీరు మారండి లేదంటే చర్యలు తీసుకుంటాం జాగ్రత్త, ఇదే పోలీస్ అధికారులకు చివరి హెచ్చరిక’ అని పవన్ వార్నింగ్ ఇచ్చారు.

‘రాజకీయంగా వ్యతిరేకంగా మాట్లాడితే మార్ఫింగ్ చేసి చిన్న బిడ్డలను, ఆడవారిని, తల్లులను దూషిస్తారా? రేప్ చేస్తాం అని మాట్లాడుతారా? వారిపై పోలీసులు బాధ్యత లేకుండా వ్యవహరించారు. సాక్ష్యాత్తు నాటి పోలీసు అధికారి నన్ను బెదిరించారు. 5, 3 ఏళ్ల పిల్లలను రేప్ చేసే కామాంధులు, దొంగతనాలకు వచ్చి రేప్ చేసే దుర్మార్గులు ఉండటానికి కారణం వారి నీచ మనస్తత్వం. ప్రస్తుతం జరుగుతున్న దారుణాలు గత ప్రభుత్వ వారసత్వంగా వచ్చిన నేరాలు’ అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

‘అప్పటి ముఖ్యమంత్రి ఆదేశిస్తే నన్ను చంపుతా అని బెదిరించిన రౌడీలు, నా ఇంటి చిన్నబిడ్డలను రేప్ చేస్తామని మాట్లాడే సన్నాసులు, వీళ్లని ఏమి చేయని పోలీసు యంత్రాంగం. నాడు ప్రభుత్వం సరిగ్గా పనిచేసి ఉంటే కనీసం ఇలాంటి వ్యక్తులు ఉండేవారా? మీడియా వారు దీని గురించి మాట్లాడాలి కదా? నాటి డీజీపీ బాధ్యత లేకుండా వ్యవహరించారు. పోలీస్ అధికారులు కనీసం బాధ్యతలు గుర్తు చేసుకున్నారా? మీ బాధ్యత కాదా? మీరు అలా ఉంటే నేరాలు, రేపులు పెరిగిపోవా’ అని డిప్యూటీ సీఎం ప్రశ్నించారు.

‘వైసీపీ నాయకులకు విన్నపం.. నేను ఎప్పుడూ కూడా పాలసీల పరంగా విమర్శించా. వ్యక్తిగతంగా మాట్లాడలేదు. మీరు కూడా అలానే అంటారు అని ఆశిస్తున్నాం. కాదు ఇలానే ఉంటాం, గత ప్రభుత్వంలో ఉన్నటుగా వ్యవహరిస్తామని అంటే జరగబోయే పరిణామాలకు సిద్ధంగా ఉండండి. ఇది స్థిరమైన ప్రభుత్వం. వ్యక్తులు చేసే తప్పులపై చర్యలు ఉంటాయి. కూటమిని ఎవరు చెడగొట్టలేరు. వ్యక్తులు వచ్చి ఎవరికి వారు సొంత పెత్తనం చేసుకుని గేమ్స్ ఆడితే మీరు మమ్మల్ని ఏం చేయలేరు, నేను, చంద్రబాబు చాలా క్లారిటీగా ఉన్నాం. ఈ పొత్తు స్థిరమైంది. కొంతమంది వ్యక్తులు చేసే ప్రయత్నాలు మమ్మల్ని ఏం చేయలేవు. వ్యక్తులు చేసే తప్పులను కులానికి ఆపాదించకండి’ అని ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

Whats_app_banner

టాపిక్

Pawan KalyanPithapuram Assembly ConstituencyAp PoliceAp PoliticsAndhra Pradesh News
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024