Best Web Hosting Provider In India 2024
సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి మళ్లీ జోరందుకుంది. సైజ్ జీరో సినిమా తర్వాత ఈ అమ్మడి కెరీర్ గాడితప్పగా.. గత ఏడాది మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టితో కమ్‌బ్యాక్ ఇచ్చింది. కానీ.. ఆ మూవీ ఆశించిన మేర బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టలేకపోయింది. అయితే అనుష్క శెట్టికి మాత్రం మళ్లీ అవకాశాల్ని తెచ్చి పెట్టింది.
అనుష్క చేతిలో 3 సినిమాలు
అనుష్క శెట్టి ప్రస్తుతం భాగమతి సీక్వెల్లో నటిస్తుండగా.. మలయాళంలోనూ కథనార్ అనే మూవీలో యాక్ట్ చేస్తోంది. ఈ రెండు సినిమాల్లో చేస్తూనే.. క్రిష్ సినిమా ‘ఘాటి’ని కూడా మరో 4 రోజుల్లోనే పూర్తి చేయబోతోంది. ఈ మేరకు యూవీ క్రియేషన్స్ నుంచి సోమవారం అధికారిక ప్రకటన విడుదలైంది.
ఘాటి గురించి అప్డేట్ ఇస్తూ ఒక పోస్టర్ని చిత్ర యూనిట్ విడుదల చేయగా.. అందులో ట్రెక్కర్లు ఘాట్లను నావిగేట్ చేసే సీన్‌తో పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. వాస్తవానికి నాలుగేళ్ల క్రితం ఈ కథని అనుష్కకి క్రిష్ వినిపించగా.. అప్పటి నుంచి మూవీ వాయిదాలు పడుతూ ఇప్పుడు రిలీజ్‌కి సిద్ధమవుతోంది.
కాంబినేషన్ రిపీట్
క్రిష్ దర్శకత్వం వహించిన వేదం సినిమాలో ఇప్పటికే అనుష్క శెట్టి నటించగా.. ఇప్పుడు రెండో సారి ఘాటి రూపంలో ఈ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తవగా.. అనుష్క శెట్టి పుట్టినరోజైన నవంబరు 7న గుమ్మడికాయ కొట్టబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
హిట్ కోసం క్రిష్ నిరీక్షణ
అనుష్క శెట్టితో పాటు క్రిష్‌కి కూడా ఈ ఘాటీ మూవీ చాలా కీలకం. క్రిష్ ఆఖరిగా తీసిన కొండపొలం మూవీ డిజాస్టర్‌గా మిగలగా.. ఈ సినిమా కంటే ముందు కొంత భాగం డైరెక్ట్ చేసిన మణికర్ణిక మూవీ హిట్ అయినా క్రెడిట్ మొత్తం కంగనా రనౌత్‌కే దక్కింది. ఈ రెండు సినిమాలతో పాటు ఎన్టీఆర్ బయోపిక్‌లు కూడా నిరాశపరచడంతో క్రిష్.. ఇప్పుడు మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.
అనుష్క శెట్టి పుట్టినరోజైన నవంబరు 7న ‘ఘాటి’ గ్లింప్స్ విడుదల చేయబోతున్నట్లు మూవీని తెరకెక్కిస్తున్న యూవీ క్రియేషన్స్ బ్యానర్ ప్రకటించింది. లేడీ ఓరియెంటెడ్ మూవీలతో తన మార్క్‌ని క్రియేట్ చేసిన అనుష్క శెట్టి.. ఘాటితో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.