Amaravati Railway Line : అమరావతి రైల్వే లైన్ ప్రాజెక్టు.. 10 ముఖ్యమైన అంశాలు

Best Web Hosting Provider In India 2024

అమరావతి రైల్వే లైన్‌కు సంబంధించి మరో అప్‌డేట్ వచ్చింది. 160 కిలోమీటర్ల వేగ పరిమితితో కొత్త అమరావతి రైల్వే లైన్ రూపకల్పన జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. అలాగే.. అమరావతి రైల్వే స్టేషన్‌లో కోచింగ్ డిపోల వంటి సౌకర్యాలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. మెయింటెనెన్స్ కోసం మొదట్లో.. 2-3 పిట్ లైన్లు నిర్మించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి.

1.ఎర్రుపాలెం, అమరావతి నుంచి నంబూరు వరకు 57 కిలోమీటర్ల కొత్త సింగిల్‌ లైన్‌ వేయనున్నారు.

2.రూ.2,245 కోట్ల అంచనాతో అమరావతి రైలు ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీన్ని నాలుగేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

3.ఈ ప్రాజెక్టులో భాగంగా.. కృష్ణా నదిపై 3.2 కిలోమీటర్ల వంతెన నిర్మించనున్నారు. దాములూరు- వైకుంఠపురం మధ్య వంతెనను నిర్మించనున్నారు.

4.అమరావతి రైల్వే లైన్‌ ప్రాజెక్టు కోసం భూసేకర ప్రక్రియ ప్రారంభం అయ్యింది. తెలంగాణలోని ఖమ్మం, ఏపీలోని ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాల్లో భూసేకరణ చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఈ కొత్త లైన్ ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం వద్ద ప్రారంభమై అమరావతి మీదుగా గుంటూరులోని నంబూరు స్టేషన్‌ వరకు ఉంటుంది.

5.ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని కొన్ని గ్రామాల రైతులు భూసేకరణకు బదులుగా ల్యాండ్ పూలింగ్‌కు మొగ్గుచూపుతున్నారు. రైల్వే లైను కోసం అవసరమైన భూమిని ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఈ ప్రాజెక్టు ద్వారా భూములకు ధరలు పెరుగుతాయని ఆశిస్తున్నారు.

6.ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ఎర్రుపాలెం, కేసిరెడ్డిపల్లె గ్రామాల్లో సుమారు 60 ఎకరాల భూమిని సేకరించాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. రైతులు తమ అభ్యంతరాలను 30 రోజుల్లోగా తెలియజేయాలని భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌కు నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

7.ఈ ప్రాజెక్టుకు అవసరమైన దాదాపు 80 శాతం భూమి రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీఏ) వద్ద అందుబాటులో ఉంది. అలైన్‌మెంట్‌ను ఖరారు చేసిన తర్వాత రైల్వేకు భూమిని ఇచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే సుముఖత వ్యక్తం చేసింది. ఎన్టీఆర్ జిల్లాలో కొద్దిపాటి భూమి మాత్రమే అవసరమని, దానిని కూడా భూసేకరణ చట్టం ద్వారా సేకరించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

8.ఈ ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తి చేయాలని కేంద్రం భావిస్తుండగా.. మూడేళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని కోరారు.

9.ప్రతిపాదిత రైల్వే లైన్‌లో ఎర్రుపాలెం – నంబూరు జంక్షన్‌ల మధ్య తొమ్మిది స్టేషన్లు ఉంటాయి. ఎన్టీఆర్ జిల్లాలోని పరిటాల వద్ద మల్టీ మోడల్ కార్గో స్టేషన్‌ను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. విజయవాడ- హైదరాబాద్ మధ్య ఉన్న రైల్వే లైన్‌లో ఎర్రుపాలెం ఉండగా, కొత్త లైన్ చివరి స్టేషన్ నంబూరు.. విజయవాడ- గుంటూరు మధ్య ఉంది.

10.అమరావతి రైల్వే స్టేషన్‌ను దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్‌గా, మోడల్‌గా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖను కోరింది. అమరావతి స్టేషన్‌ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 1,500 ఎకరాల భూమిని ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది.

Whats_app_banner

టాపిక్

AmaravatiRailwaySouth Central RailwayAndhra Pradesh News
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024