Best Web Hosting Provider In India 2024
సీఎం చంద్రబాబు..మంత్రి వాసంశెట్టి సుభాష్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పార్టీకి ఉపయోగపడకపోతే మీకు రాజకీయాలెందుకయ్యా అంటూ చంద్రబాబు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఏపీలో పట్టభద్రుల ఓట్ల నమోదు ప్రక్రియ జరుగుతోంది. నవంబర్ 6తో ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తవుతుంది. అయితే పట్టభద్రుల ఓట్ల నమోదును సీరియస్‌గా తీసుకోవడం లేదని మంత్రి వాసంశెట్టి సుభాష్‌పై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. తూర్పుగోదావరి నేతలతో టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడిన సీఎం…మంత్రి వాసంశెట్టికి క్లాస్ తీసుకున్నారు.
మంత్రి వాసంశెట్టిపై సీఎం చంద్రబాబు సీరియస్
“మీరు మొదటిసారి గెలిచినా పార్టీ ఎంతో గౌరవించింది. ఎమ్మెల్యే సీటు ఇచ్చి, గెలిచాక మంత్రి పదవి ఇచ్చింది. అయినా పట్టుదల లేకపోతే ఎలా? మీరు సరిగ్గా పనిచేయకపోతే నేను ప్రత్యామ్నాయం చూస్తాను. పార్టీకి ఉపయోగపడకపోతే మీకు రాజకీయాలెందుకు” అని సీఎం చంద్రబాబు మంత్రి వాసంశెట్టి సుభాష్ పై మండిపడ్డారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల నమోదుపై ఆదివారం సాయంత్రం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మంత్రులు, ఇన్‌ఛార్జ్ మంత్రులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
“రామచంద్రపురం నియోజకవర్గంలో 9 వేల ఓట్లకు గాను 2,630 ఓట్లు మాత్రమే నమోదు అయ్యాయి. అంటే 29 శాతం మాత్రమే అయింది. శనివారం కూడా 319 ఓట్లు మాత్రమే నమోదు అయ్యాయి. నువ్వు మొదటిసారి ఎమ్మెల్యేవి, యువకుడివి రాజకీయాలపై సీరియస్ నెస్ లేదు. మీ నియోజకవర్గం ఓట్ల నమోదులో వెనకబడింది. నేను మీపై ఒత్తిడి చేస్తున్నాననుకోవద్దు. నా బాధ్యత నేను నెరవేరుస్తున్నా. మీ బాధ్యత మీరు పూర్తి చేయండి. ఏ ఎన్నిక వచ్చినా ఎమ్మెల్యేలు తమను తాము నిరూపించుకోవాల్సి ఉంటుంది. లేదంటే నేను ప్రత్యామ్నాయం ఆలోచించాల్సి వస్తుంది” అని సీఎం చంద్రబాబు మంత్రి వాసంశెట్టి సుభాష్ ను హెచ్చరించారు. ఓటర్ల నమోదులో ఇన్ ఛార్జ్ మంత్రులు క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్‌పైనా చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు.
చంద్రబాబు క్లాస్ పై స్పందించిన మంత్రి
మంత్రికి సీఎం చంద్రబాబు క్లాస్ అంటూ సోషల్ మీడియాలో ఈ ఆడియో వైరల్ అయ్యింది. ఈ ఘటనపై మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పందించారు. సీఎం చంద్రబాబు మందలించిన ఆడియోతో తనను తెగ ట్రోల్ చేశారని మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆరోపించారు. అయినా తనకు మంచే జరిగిందన్నారు. తాను ప్రైవేట్ గా ప్రమోట్ చేయించుకుంటే ఎంతో ఖర్చు అయ్యేదన్నారు. కానీ వైసీపీ, ఓ వర్గం మీడియా తనకు ఫ్రీగా పబ్లిసిటీ ఇచ్చిందన్నారు. దీంతో పట్టభద్రుల ఓట్ల నమోదు 26 శాతం నుంచి 41 శాతానికి పెరిగిందన్నారు.
అసలు వార్డు మెంబర్ కూడా కానీ తనకు పార్టీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నేరుగా ఎమ్మెల్యే టికెట్, మంత్రి పదవి ఇచ్చి శెట్టిబలిజ సామాజిక వర్గాన్ని ప్రోత్సహించారన్నారు.
41 శాతం పెరిగిన ఓట్ల నమోదు
తన అలసత్వం వల్ల తప్పు జరగడం వల్ల సీఎం చంద్రబాబు ఓ తండ్రిలా వ్యవహరించి తప్పు సరిచేసుకునే ప్రయత్నం చేశారని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. దీనిని ప్రతిపక్షాలు వేరే కోణంలో చూస్తున్నాయన్నారు. కానీ తాను ఆ విధంగా ఆలోచించనన్నారు. ఓ టీచర్ విద్యార్థిని మందలించినా, కొట్టినా అది వారి శ్రేయస్సు కోసమేనన్నారు. ఇది కూడా అలాంటి ఘటనేనన్నారు. సీఎం చంద్రబాబు పార్టీ విషయాల్లో చాలా స్పష్టంగా ఉంటారన్నారు. కింది స్థాయి కార్యకర్తల్ని పట్టించుకుంటున్నారా? లేదో? చూస్తారన్నారు. ఎన్నికల్లో తన గెలుపు కోసం కష్టపడిన వారిని చంద్రబాబు నాయుడు ఎప్పుడూ మర్చిపోరన్నారు. ప్రత్యర్థుల ఏడుపులే తనకు దీవెనలు అవుతాయన్నారు. తప్పు చేసినప్పుడు దాన్ని గుర్తించి చెప్పినప్పుడు తప్పకుండా సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలన్నారు. నిన్నటి నుంచి తన నియోజకవర్గంలో భారీగా ఓట్లు నమోదు చేసుకున్నారన్నారు. ఓట్ల నమోదు శాతం 26 నుంచి 41 శాతానికి పెరిగిందన్నారు.
సంబంధిత కథనం
టాపిక్