Best Web Hosting Provider In India 2024
జుట్టు గురించి చాలా మంది కంగారు పడుతుంటారు. వెంట్రుకలు ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలంటే ఏం చేయాలనే ఆలోచనల్లో ఉంటారు. ఎలాంటి ప్రొడక్టులు వాడాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలనే సందేహాలు ఉంటాయి. అయితే, కొన్ని విధానాలు పాటిస్తే జుట్టు మెరుగ్గా ఉంటుంది. వెంట్రుకల ఆరోగ్యం కోసం ఏం చేయాలో.. ఏం చేయకూడదో కాస్మోటాలజిస్ట్ తాన్యా సింగ్ వెల్లడించారు. హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌తో ఇంటర్వ్యూలో తాన్య చెప్పిన విషయాలు ఇక్కడ చూడండి.
చేయాల్సినవి ఇవే
జుట్టును బట్టి సరైన ప్రొడక్టులు: ముందుగా మీ జుట్టు ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. పోరోసిటీ ఎక్కువగా ఉండే జుట్టు అయితే తేమను త్వరగా పీల్చుకుంటుంది. జుట్టు ఎక్కువగా పొడిగా మారుతుంటుంది. అలాంటి వారు డీప్ కండీషనింగ్, హైడ్రేటింగ్ షాంపూలు, కండీషనర్లు లాంటి ప్రొడక్టులు జుట్టుకు వాడాలి. దీంతో ఇవి వెంట్రుకల్లో మాయిశ్చర్‌ను పోకుండా చేస్తాయి. ఒకవేళ తక్కువ పోరోసిటీ ఉండి.. జుట్టు తేమను నిలుపుకుంటుంటే.. లైట్‌వెయిట్, వాటర్ బేస్డ్ ప్రొడక్టులు వినియోగించాలి.
ప్రతీ రోజు తలస్నానం: సాధారణంగా ప్రతీ రోజూ కాకుండా వారంలో రెండు, మూడుసార్లే తలస్నానం చేయాలనే వాదన ఉంది. అయితే, ఒకవేళ ఆయిలీ స్కాల్ప్ ఉంటే ప్రతీ రోజు తలస్నానం చేయడం చెడు చేయదని తాన్యా సింగ్ చెప్పారు. అయితే, రోజూ హెయిర్ వాష్ చేసుకుంటే.. జుట్టు పొడిగా కాకుండా మంచి కండీషనర్ తప్పక వాడాలని సూచించారు.
చివర్లను ట్రిమ్ చేయడం: మహిళలు జుట్టు చివర్లను కొన్ని నెలలకు ఒకసారి ట్రిమ్ చేయాలి. ఇలా చేయకపోతే జుట్టు చివర్లు చిట్లిపోతాయి. దీనివల్ల హెయిర్ డ్యామేజ్ అవుతుంది. చివర్లు ట్రిమ్ చేస్తే జుట్టు ఫ్రెష్‌గా, ఆరోగ్యంగా కనిపిస్తుంది.
పోషకాలు ఉండే ఆహారం: జుట్టుపై మనం తినే ఆహారం ప్రభావం ఎక్కవగా ఉంటుంది. అందుకే విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఆహారాలను డైట్లో తీసుకుంటే జుట్టు పెరుగుదల, దృఢత్వం అధికమవుతాయి.
ఇవి చేయొద్దు
కఠినంగా ఉండే ట్రీట్మెంట్లు వద్దు: కెరాటిన్, రిబౌండింగ్, స్మూతెనింగ్, బోటాక్స్ లాంటి కఠినమైన హెయిర్ ట్రీమ్మెంట్ల వల్ల జుట్టు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. వీటిలో జుట్టు టెక్స్చర్ మార్చేందుకు చేసే ప్రక్రియ, వాడే కెమికల్స్ వల్ల జుట్టు కుదుళ్ల నుంచి రాలే రిస్క్ ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి కూడా అంత మంచివి కాదు. ఈ కఠినమైన ట్రీట్మెంట్లు జుట్టుకు చేయించుకోకుండా ఉంటేనే మేలు.
హీట్ స్టైలింగ్ తగ్గించాలి: స్టైటర్నర్స్, కర్లర్స్ లాంటి వాటిని వారానికి ఒకసారి కంటే ఎక్కువ ఉపయోగించకూడదు. ఈ హీట్ స్టైలింగ్ ఎక్కువగా చేసుకుంటే జుట్టు బలహీనపడుతుంది. జుట్టు రాలడం, బ్రేక్ అవడం అధికం కావొచ్చు. హెయిర్ డ్రయర్ కూడా మరీ పూర్తి హీట్ సెట్టింగ్‌లో ఉన్నప్పుడు వాడకపోవడమే మంచిది.
కండీషనర్ మర్చిపోవద్దు: తలస్నానం చేసిన తర్వాత జుట్టుకు కండీషనర్ రాయడం అసలు మర్చిపోవద్దు. హెయిర్ వాష్ తర్వాత జట్టు పైపోర కాస్త ఓపెన్ అవుతుంది. అలాగే వదిలేస్తే డ్యామేజ్ అవొచ్చు. అందుకే తప్పనిసరిగా కండీషనర్ రాయాలి. దీన్ని స్కిప్ చేయకూడదు.