Police Suspension: కడపలో ఎస్పీ, సీఐ.. గుంటూరు ఏడుగురు సిబ్బందిపై వేటు, వైసీపీ నేతలతో అంటకాగినందుకు మూల్యం

Best Web Hosting Provider In India 2024


Police Suspension: ఆంధ్రప్రదేశ్‌లో ఒకే రోజులో భారీగా పోలీసులపై వేటు పడింది. సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన నాయకుల్ని, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంను అసభ్యంగా దూషించిన కేసులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న బోరుగడ్డ అనిల్‌కుమార్‌కు రెస్టారెంట్‌లో భోజనం చేయించినందుకు ఎస్కార్ట్‌ పోలీసులపై వేటు పడింది. జైలుకు వెళుతుండగా బోరుగడ్డ అనిల్‌ను హోటల్లో విందు భోజనం చేయడంపై గుర్తించిన స్థానికులు పోలీసుల్ని ప్రశ్నించారు. దీంతో వారి నుంచి బలవంతంగా వీడియోలు డిలీట్ చేయించారు. ఆ తర్వాత సీసీ కెమెరా వీడియోలు వెలుగు చూడటంతో ఏడుగురు పోలీసులపై వేటు పడింది.

వైసీపీ అధికారంలో ఉండగా సీఎం, డిప్యూటీ సీఎంలపై అసభ్యంగా దూషిస్తూ సోషల్ మీడియాలో రెచ్చిపోయిన బోరుగడ్డ అనిల్‌కుమార్‌పై పలు కేసులు నమోదయ్యాయి. జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న బోరుగడ్డ అనిల్‌ను బుధవారం మంగళగిరి న్యాయస్థానంలో హాజరుపరిచారు. తిరిగి జైలుకు తీసుకువెళుతుండగా ఎస్కార్ట్ పోలీ సులు అతనికి రాచ మర్యాదలు చేశారు.

అనిల్‌ మీద తుళ్లూరు పోలీసు స్టేషన్ పరిధిలో నమోదైన రెండు కేసుల్లో విచారణ కోసం బుధవారం రాజమహేంద్ర వరం సెంట్రల్‌ జైలు నుంచి తీసుకొచ్చి మంగ ళగిరి కోర్టుకు తీసుకువచ్చారు. మధ్యాహ్నం 2.30 గంటలకు తిరుగు ప్రయాణం అయ్యారు. దారిలో గన్నవరంలోని రెస్టారెంట్‌లో అనిల్‌తో కలిసి పోలీసులు హోటల్లో భోజనం చేశారు. పోలీసులకు కూడా నిందితుడే బిల్లు చెల్లించాడు. అతనికి ఎస్కార్ట్ బృందంగా గుంటూరు జిల్లా ఏఆర్‌కు చెందిన ఆర్ఎస్సై పి. నారాయణరెడ్డి నేతృత్వంలో ఏఆర్ హెడ్‌ కానిస్టేబుల్ కె.శ్రీనివాస రావు, ఏఆర్ కానిస్టేబుళ్లు టి. శంకరరావు. కె బుచ్చయ్య తుళ్లూరు పోలీసుస్టేషన్ కానిస్టేబుళ్లు బాల శౌరి, నాగరాజు, తాడికొండ పీఎస్ కానిస్టే బుల్ ఎస్.ఏ. సద్దులా ఉన్నారు.

రిమాండ్‌ ఖైదీలకు సాధారణంగా ఎస్కార్ట్‌ వాహనంలోనే భోజనం అందిస్తారు. అనిల్‌ను హోటల్లోకి తీసుకువెళ్లి భోజనం చేస్తుండగా అక్కడ ఉన్న వారు ఫోటోలు, వీడియోలు తీశారు. దీంతో పోలీసులు వారిని బెదిరించి ఆ ఫోటోలు, వీడియోలు డిలీట్ చేయించారు. పోలీసులు అక్కడి నుంచి వెళ్లిన తర్వాత సీసీటీవీ ఫుటేజీ బయటకు వచ్చింది. వెంటనే ఆ దృశ్యాలు వైరల్‌గా మారడంతో గుంటూరు పోలీసులు స్పందించారు. ఏడుగురు సిబ్బందిపై వేటు వేశారు.

నిందితుడిని వదిలేసిన పోలీసులు.. ఎస్పీపై వేటు

సోషల్ మీడియాలో టీడీపీ, కాంగ్రెస్, జనసేన నాయకులపై అసభ్య రాతలు రాస్తున్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తను పోలీసులు వదిలేయడం ఎస్పీ బదిలీకి కారణమైంది. కడపకు చెందిన వర్రా రవీంద ర్రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 41ఏ నోటీసులు ఇచ్చి విడిచిపెట్టడంపై ప్రభుత్వం ఆగ్రహం చేసింది. మరో కేసులో అతడిని అరెస్ట్‌ చేయడానికి రాజంపేట పోలీసులు వచ్చేలోగా పోలీసులు నిందితుడిని వదిలేయడంపై ఐజీ విచారణ జరిపి నివేదిక ఇవ్వడంతో ఎస్పీని బదిలీ చేసింది.

కడప జిల్లా వైసీపీ నేతలతో పోలీసులు కుమ్మక్కయ్యారనే ఆరోపణలతో ఉన్నతాధికారులపై వేటు పడింది. రవీంద్రారెడ్డిని వదిలేయడంతోపై కర్నూలు రేంజీ డీఐజీ కోయ ప్రవీణ్ విచారణ జరిపి డీజీపీ నివేదిక ఇవ్వడంతో ఎస్పీని బదిలీ చేశారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు లోకేశ్, అనిత, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, జగన్ తల్లి, వివేకానందరెడ్డి, విజయమ్మ, మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీతలపై దారుణమైన పోస్టులు పెడుతున్నారనే ఆరోపణలు వర్రా రవీంద్రరెడ్డిపై ఉన్నాయి.

మంగళ వారం కడప పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ తర్వాత వదిలేశారు. మరో కేసులో అరెస్ట్‌ చేయడానికి రాజంపేట పోలీసులు వచ్చేలోగా నిందితుడు జారుకున్నాడు. ఇదంతా పథకం ప్రకారమే జరిగిందని భావించిన పోలీసులు ఎస్పీని బాధ్యుడిని చేశారు. రవీందర్రెడ్డి పారిపోవడం వెనక కడప చిన్నచౌక్ సీఐ తేజమూర్తి పాత్ర ఉన్నట్లు ఆరోపణల నేపథ్యంలో సస్సెండ్ చేస్తూ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.

వర్రా రవీంద్రరెడ్డిపై పులివెందుల, కడప, మంగళగిరి, రాజంపే టతో పాటు హైదరాబాద్లో 30 కేసులు నమోదు అయ్యాయి. అతడిని వదిలేయడంపై ఇంటెలిజిన్స్ నివేదిక అనంతరం ఎస్సీ హర్షవర్ధన్‌ రాజుపై బదిలీ వేటు పడింది. డీజీపీ కార్యాల యంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. కడపకు ఇన్చార్జి ఎస్పీగా అన్నమయ్య ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడిని నియమించారు.

ప్రక్షాళన చేస్తానన్న సీఎం..

పోలీస్ శాఖ పనితీరుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల గొల్లప్రోలు సభలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశం రాజకీయంగా దుమారం రేపింది. బుధవారం జరిగిన క్యాబినెట్‌లో సైతం తన వ్యాఖ్యలపై పవన్ వివరణ ఇచ్చారు. తన పిల్లలు బాధపడేలా సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందని పవన్ క్యాబినెట్‌లో ప్రస్తావించారు. హోంమంత్రి సైతం సోషల్ మీడియా దుష్ప్రచారానికి బాధితురాలు అయ్యారని గుర్తు చేశారు. ఈ అంశంపై స్పందించిన సీఎం చంద్రబాబు పోలీస్ శాఖను ప్రక్షాళన చేస్తానని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. నెలరోజుల్లో పోలీసు శాఖను గాడిన పెడతానని మంత్రులకు భరోసా ఇచ్చారు. మంచితనాన్ని చేతకాని తనంగా భావిస్తే మూల్యం చెల్లిస్తారని వ్యాఖ్యానించారు.

Whats_app_banner

టాపిక్

Ysrcp Vs TdpAp PoliceTelugu NewsLatest Telugu NewsBreaking Telugu NewsChandrababu Naidu
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024