Huzurabad Congress: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కి నిరసన సెగ… జమ్మికుంటలో తిరగబడ్డ కాంగ్రెస్ కార్యకర్తలు

Best Web Hosting Provider In India 2024

Huzurabad Congress: దూకుడుగా వ్యవహరిస్తూ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కి స్వంత గడ్డపై చుక్కెదురైంది. సంచలన కామెంట్లతో నిత్యం మీడియాలో నానే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి జమ్మికుంటలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరసన సెగ తగిలించారు. గో బ్యాక్ ఎమ్మెల్యే అంటూ నినాదాలు చేసి చేప పిల్లల పంపిణీని రసాబసగా మార్చారు.‌

జమ్మికుంట గుండ్ల చెరువులో చేప పిల్లలు విడుదల చేసేందుకు అనుచరులతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వెళ్ళగా అదే స్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి చేరుకొని ఎమ్మెల్యే తో పాటు చేప పిల్లలను చెరువులో విడుదల చేశారు. పోయినసారి భారీ సంఖ్యలో చేప పిల్లలు వదిలితే ఈసారి తక్కువ వదులుతున్నారేంటనీ ఎమ్మెల్యే సంబంధిత అధికారులు అడిగారు. కాంగ్రెస్ కార్యకర్తలు కలగజేసుకొని ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేయగా బిఆర్ఎస్ కార్యకర్తలు జై కేసిఆర్ అంటు ప్రతినినాధాలు చేశారు. పరస్పర నినాదాలతో వాగ్వివాదం చోటుచేసుకుని కాంగ్రెస్ బిఆర్ఎస్ మద్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు.‌ పోలీసుల తీరుపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సీరియస్ అయ్యారు. చివరకు పోలీసుల జోక్యంతో ఆందోళన సద్దుమణిగింది.

ప్రశ్నిస్తే దాడి చేస్తారా?- ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

చేప పిల్లలను ఎందుకు తక్కువ పంపిణీ చేస్తున్నారని ప్రశ్నిస్తే దాడి చేస్తారా? అని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కెసిఆర్ హయాంలో హుజురాబాద్ నియోజకవర్గం లోని 283 చెరువుల్లో 60 లక్షల చేప పిల్లలు పంపిణీ చేశామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 283 చెరువుల్లో కేవలం 26 లక్షల చేప పిల్లల్ని వేస్తుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేప పిల్లలను తక్కువ చేసిందని అడిగితే సీఎం రేవంత్ రెడ్డి గుండాలను పంపించి దాడి చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు.‌

రాష్ట్రవ్యాప్తంగా కెసిఆర్ హయాంలో 110 కోట్ల వ్యయంతో 85 కోట్ల చేప పిల్లలు, పది కోట్ల రొయ్య పిల్లలు పంపిణీ చేయడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం 16 కోట్ల వ్యయంతో కేవలం 17 కోట్ల చేప పిల్లలు పంపిణీ చేస్తుందని తెలిపారు. మత్స్యకారులు వాస్తవాలు గమనించాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కోరారు.

20 లోగా రెండో విడత దళిత బంధు నిధులు ఇవ్వకుంటే రణరంగమే

దళిత బంధు రెండో విడత నిధులు ఈనెల 20 లోగా ఇవ్వాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. లేనిచో రణరంగం సృష్టిస్తామని హెచ్చరించారు. కేసిఆర్ దేశంలో ఎక్కడ లేని విధంగా హుజూరాబాద్ నియోజక వర్గంలో దళిత బంధు పథకం ప్రవేశపెట్టి ప్రతి కుటుంబానికి పది లక్షల రూపాయలు పద్దెనిమిది వేల కుటుంబాలకు అకౌంట్లలో జమ చేశారని తెలిపారు. అకౌంట్లలో వేసిన డబ్బులు ఐదు వేల కుటుంబాలకు రెండో విడత డబ్బులు ఇవ్వకుండా అకౌంట్లు ఫ్రిజ్ చేశారని తెలిపారు.

దళితుల డబ్బులు వారికి ఇవ్వకపోతే నియోజక వర్గంలో ఒక్క కాంగ్రెస్ నాయకుడిని తిరగనివ్వమని స్పష్టం చేశారు. దళిత బంధు రెండో విడత రానివారు తమ కుటుంబాలతో కలిసి ఈనెల 9న దరఖాస్తులు తీసుకొని తమ ఇంటి వద్దకు రావాలని కోరారు. అట్టి దరఖాస్తులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి పంపుతామని 20 తేదీ వరకు రెండో విడత ఇవ్వకపోతే తడాఖా చూపిస్తామన్నారు. ఎవరు అడ్డుకుంటారో చూస్తామని తెలిపారు.‌

దళితులతో కలిసి ఎమ్మెల్యే పోరాటానికి సిద్ధమవుతుండగా ప్రతిగా ఎమ్మెల్యేను ఎక్కడికక్కడ నిలవరించేందుకు కాంగ్రెస్ సన్నద్ధమవుతుంది. అందులో భాగంగానే జమ్మికుంటలో చేప పిల్లల పంపిణీలో కాంగ్రెస్ రుచి చూపించామని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఎమ్మెల్యే హెచ్చరిక కాంగ్రెస్ ప్రతిచర్య రాజకీయంగా దుమారం రేపుతుంది.

(రిపోర్టింగ్ కె.వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner

టాపిక్

KarimnagarKarimnagar Lok Sabha ConstituencyCongressBrsTelugu NewsLatest Telugu NewsBreaking Telugu News
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024