Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య అప్డేట్ – నవంబర్ 13న ప్రత్యేక పర్వదినం..! ఏడాదిలో ఒక్కసారి మాత్రమే..!

Best Web Hosting Provider In India 2024

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక అప్డేట్ ఇచ్చింది. నవంబరు 13వ తేదీన కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో సాలకట్ల కైశిక ద్వాదశి ఆస్థానాన్ని నిర్వహించనుంది. ఈ మేరకు టీటీడీ ప్రకటన విడుదల చేసింది.

వేంకటతురైవార్‌, స్నపనబేరంగా పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు మాడవీధులలో ఊరేగిస్తారు.

చారిత్రక వివరాల్లోకి వెళ్తే…. కైశిక ద్వాదశిని ప్రబోధనోత్సవం అని, ఉత్తానద్వాదశి అని కూడా అంటారు. వివిధ గ్రంధాల్లో పేర్కొన్న విధంగా స్థితికారుడైన శ్రీమహావిష్ణువును మేల్కొల్పే పర్వదినాన్ని కైశికద్వాదశిగా వ్యవహరిస్తారు. శ్రీమహావిష్ణువు ఆషాఢశుక్ల ఏకాదశినాడు గాఢ నిద్రలోకి వెళ్ళారు. కైశికద్వాదశినాడు ఆయనను మేల్కొల్పు చేయడం రివాజు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావించే కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైవున్న శ్రీవారి ఆలయంలో కైశికద్వాదశి మహోత్సవాన్ని ప్రతిఏటా టీటీడీ ఘనంగా నిర్వహిస్తుంది.

పురాణాల ప్ర‌కారం శ్రీ‌ వైష్ణ‌వ క్షేత్రాల్లో నిర్వ‌హించే ముఖ్య‌మైన ప‌ర్వ‌దినాల్లో కైశిక‌ద్వాద‌శి ఒక‌టి. శ్రీ వ‌రాహ స్వామి కైశిక‌పురాణంలోని 82 శ్లోకాల‌తో శ్రీ భూదేవికి క‌థ‌గా చెప్పిన రోజును కైశిక ఏకాద‌శిగా పిలుస్తారు. ఈ క‌థ ఆధారంగా కైశిక ద్వాద‌శి ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంది.

నంబ‌దువాన్ క‌థ‌…

కైశికద్వాదశి పురాణ నేపథ్యం విశేష ఘట్టాలతో కూడుకున్నది. శ్రీనంబదువాన్‌ (సత్యమూర్తి) అనే భక్తుడు స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించడానికి వెలుతుండగా మార్గమధ్యంలో ఒక బ్రహ్మరాక్షసుడు తారసపడి తినేస్తానన్నాడు. అందుకు నంబదువాన్‌ సమాధానంగా తాను ప్రస్తుతం శ్రీవారికి సంకీర్తనార్చన చేయడానికి వెళుతున్నానని తప్పక తిరిగివచ్చి ఆ బ్రహ్మరాక్షసుని క్షుద్బాధను తీరుస్తానని ప్రమాణం చేశాడు. అన్న ప్రకారం స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించి బ్రహ్మరాక్షసుని చెంతకు వచ్చాడు. భక్త నంబదువాన్‌ భక్తికి, సత్యనిరతికి ముగ్ధుడై స్వామివారు మోక్షం ప్రసాదించారు. ఈ విధంగా ఉత్తానద్వాదశికి కైశికద్వాదశి అనే నామకరణం కలిగింది.

సూర్య‌ద‌యానికి ముందే ఎందుకు…?

14వ శ‌తాబ్దంలో ఉగ్రశ్రీ‌నివాస‌మూర్తి ఊరేగింపు జ‌రుగుతూ ఉండ‌గా సూర్య కిర‌ణాలు స్వామివారి విగ్ర‌హం మీద ప‌డ‌గానే భాగీ అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. అప్ప‌టి నుండి సూర్యోద‌యానికి ముందే ఊరేగింపు నిర్వ‌హిస్తున్నారు. ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా సూర్యోదయానికి ముందే తెల్లవారుఝామున ఆలయ అర్చకులు తిరుమాడ వీధులలో ఊరేగిస్తారు. 

అనంతరం ఆలయం లోపల ఉదయం 6 నుండి ఉదయం 7.30 గంట‌ల వరకు కైశిక ద్వాదశి ఆస్థానాన్ని పురాణ పారాయణం ద్వారా ఘనంగా నిర్వహిస్తారు. దీనితో సాలకట్ల కైశికద్వాదశి ఉత్సవం పూర్తవుతుంది.

శ్రీవారి ఆలయంలో పుష్పయాగం :

మరోవైపు తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 9న శనివారం పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరుగనుంది. నవంబరు 8న శుక్రవారం రాత్రి 8 నుంచి 9 గంటల వరకు పుష్పయాగానికి అంకురార్పణ నిర్వహించనున్నారు.

పుష్పయాగం రోజున ఆలయంలో రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపానికి వేంచేపు చేసి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు.

మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.

న‌వంబ‌రు 8న అంకురార్ప‌ణ కార‌ణంగా సాయంత్రం సహస్రదీపాలంకార సేవను టీటీడీ ర‌ద్దు చేసింది న‌వంబ‌రు 9న పుష్ప‌యాగం రోజున కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం ఆర్జితసేవలు ర‌ద్ద‌య్యాయి. తోమాల‌, అర్చ‌న సేవ‌లు ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.

Whats_app_banner

టాపిక్

Andhra Pradesh NewsTirumalaDevotionalDevotional News
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024