Green Card For OSD: మాజీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌కు గ్రీన్‌ కార్డు.. తెలంగాణ పోలీసులకు ప్రభాకర్‌ రావు ఝలక్

Best Web Hosting Provider In India 2024

Green Card For OSD: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన మాజీ నిఘా విభాగాధిపతి ప్రభాకర్‌ రావు దర్యాప్తు బృందానికి షాక్ ఇచ్చారు. ఇన్నాళ్లు పోలీసుల విచారణకు సహకరిస్తానని చెబుతూ వచ్చిన ప్రభాకర్‌ రావు పరిస్థితులు సద్దుమణిగే వరకు దేశానికి తిరిగి రాకూడదని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన అమెరికాలో గ్రీన్‌ కార్డును పొందారు.

రిటైర్డ్‌ పోలీస్ అధికారి ప్రభాకర్‌ రావు గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ బాధ్యతల్ని పర్యవేక్షించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతుందని భావించి కీలక ఆధారాలను ధ్వంసం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ అంశంపై విచారణ మొదలైంది. అప్పటికే ఇంటెలిజెన్స్‌ ఓఎస్డీ ప్రభాకర్‌ రావు దేశం విడిచి వెళ్ళిపోయారు. ఈ కేసులో పలువురు పోలీస్ అధికారులపై కేసులు నమోదయ్యాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించిన ప్రభాకర్‌ రావు మాత్రం విచారణకు కూడా రాలేదు.పోలీసుల విచారణకు సహకరిస్తానని, శస్త్ర చికిత్స చేయించుకున్నానని పలుమార్లు మెయిల్స్ ద్వారా సమాచారం ఇచ్చారు.

ఈ క్రమంలో ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేయించేందుకు ప్రయత్నాలు కూడా చేశారు. మరోవైపు అమెరికాలో స్థిరపడిన ప్రభాకర్‌ రావు కుటుంబ సభ్యులు స్వదేశానికి తిరిగి వెళితే చిక్కుల్లో పడతారని భావించారు. కుటుంబ సభ్యుల సహకారంతో డిపెండెంట్‌ కోటాలో ప్రభాకర్‌ రావుకు గ్రీన్ కార్డు మంజూరైనట్లు ప్రచారం జరుగుతోంది.

తెలంగాణలో రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లను అక్రమంగా ట్యాప్‌ చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమెరికాలోనే ప్రబాకర్‌ రావు ఉంటున్నారు. విచారణకు రావాలని పోలీసులు కోరినా సహకరిస్తానని మాత్రమే చెబుతూ వచ్చారు. తనపై కేసు నమోదవుతోందని ముందే తెలుసుకున్న ప్రభాకర్‌ రావు ఎఫ్‌ఐఆర్‌ నమోదైన మర్నాడే దేశం విడిచి వెళ్లిపోయారు.

ఎస్ఐబీ అదనపు ఎస్పీ రమేష్‌ ఈ ఏడాది మార్చి 10న పంజాగుట్ట పోలీసులకు ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. మార్చి 11న ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయారు. అప్పటి నుంచి అక్కడే ఉన్నారు. కేసులో దర్యాప్తులో భాగంగా నలుగురు పోలీసు అధికారుల్ని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రభాకర్‌ రావును ప్రధాన నిందితుడిగా చేర్చారు. అప్పటి నుంచి ఆయన్ని అమెరికా నుంచి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.

మొదట్లో వైద్యచికిత్స నిమిత్తం అమెరికా వెళ్లిన తాను ఇల్లినాయిస్ అరోరాలో ఉన్నట్లు ఆయన హైదరాబాద్ పోలీసులకు సమాచారమిచ్చారు. జూన్‌లో వీసా గడువు ముగుస్తున్న క్రమంలో వైద్యులు అనుమతిస్తే హైదరాబాద్ వస్తానని చెప్పారు. గడువు దాటినా స్వదేశానికి రాలేదు. మార్చిలో మూడు నెలల కాలపరిమితితో కూడిన వీసాపై అక్కడకు వెళ్లిన ఆయన, గడువును మరో ఆరునెలలకు పొడిగించుకోవడంతో లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు.

ఇంటర్‌పోల్‌ ద్వారా ప్రభాకర్‌ రావుకు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించే ప్రయత్నాలు కూడా చేశారు. పాస్ పోర్టును కూడా ఇప్పటికే రద్దు చేశారు. విదేశాంగ శాఖ ద్వారా ఆమెరికా పోలీసులకు సమాచారం అందించే ప్రయత్నాల్లో ఉండగానే ఆయనకు గ్రీన్‌ కార్డు మంజూరైన విషయం వెల్లడైంది. అమెరికా గ్రీన్‌ కార్డు లభించడంతో ఇప్పట్లో ఆయన్ని భారత్‌కు రప్పించే అవకాశాలు లేవు. గ్రీన్‌ కార్డు ఉన్న ప్రభాకర్‌ రావును అనుమతి లేకుండా అరెస్ట్‌ చేసే అవకాశం కూడాదు. దౌత్యపరమైన రక్షణ కోసమే గ్రీన్‌ కార్డు మార్గాన్ని ఎంచుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ అంశంపై విదేశాంగ శాఖతో తెలంగాణ పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నారు.

Whats_app_banner

టాపిక్

Crime NewsCrime TelanganaIps OfficersTg BureaucratsTs PoliceTelugu NewsLatest Telugu NewsBreaking Telugu News
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024