Best Web Hosting Provider In India 2024
అందుకే అర్ధం లేని విమర్శలు, మాటలు
మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు ఆక్షేపణ
వాలంటీర్ల కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు చేశాం
ఒక మంత్రికి ఆ శాఖ బాధ్యతలు అప్పగించాం
వారి నియామకాలపైనా స్పష్టమైన ఆదేశాలు
వాలంటీర్ల సేవలను చులకన చేసి మాట్లాడొద్దు
వాలంటీర్లు అందించిన సేవలకు వెల కట్టలేం
ఎన్నికల్లో వాలంటీర్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి
తక్షణమే వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలి
వారి గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచాలి
వారిపై చేసిన చౌకబారు వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి
ప్రెస్మీట్లో సుధాకర్‌బాబు స్పష్టీకరణ
తాడేపల్లి: రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ లేకుండా చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైయస్ఆర్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు ఆక్షేపించారు. వాలంటీర్లను కొనసాగిస్తామని, వారికి ఇచ్చే గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు చేయకుండా, తప్పించుకునే కుట్రలో భాగంగానే వైయస్ఆర్సీపీ ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు మీడియాతో మాట్లాడారు.
వాలంటీర్లకు సంబంధించి ఎలాంటి వ్యవస్థ లేదని, అలా గత ప్రభుత్వం వారిని మోసం చేసిందని, దాని వల్ల వాలంటీర్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నామని డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ చెప్పడాన్ని సుధాకర్‌బాబు తీవ్రంగా ఖండించారు. పూర్తి పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ఇంటి గడప వద్దే అందించడం కోసం ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమించిన వైయస్ఆర్సీపీ ప్రభుత్వం అందుకోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయడమే కాకుండా, ఆ శాఖ బాధ్యతను ఒక మంత్రికి అప్పగించిందని వెల్లడించారు. అలాగే వాలంటీర్ల నియామకంపై ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందంటూ.. సంబంధిత ఆదేశాల (జీఓలు) వివరాలు చదివారు. కావాలంటే పవన్, ఆ జీఓలు తెప్పించుకుని చూడాలని హితవు చెప్పారు.
అంత పక్కాగా వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేస్తే, దానిపై పవన్ వెటకారంగా మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే దుయ్యబట్టారు. ఇప్పుడు కూడా మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామికి ఆ శాఖను కేటాయించిన అంశాన్ని ఆయన ప్రస్తావించారు.
రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థపై నాడు విపక్ష టీడీపీకి కానీ, జనసేన పార్టీకి కానీ సదభిప్రాయం లేదన్న సుధాకర్‌బాబు.. అప్పుడు వాలంటీర్లను ఉద్దేశించి చంద్రబాబు, పవన్‌కళ్యాణ చేసిన వ్యాఖ్యలు, విమర్శలు గుర్తు చేశారు. కోవిడ్ బాధితులను వారి కుటుంబసభ్యులే పట్టించుకోకపోతే వాలంటీర్లు ప్రాణాలకు తెగించి, వారికి సేవలందించారని, అలాంటి వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పవన్‌కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని కోరారు. ఎన్నికల్లో వాలంటీర్లకు కూటమి ఇచ్చిన హామీలు గుర్తు చేసిన ఆయన, వెంటనే వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. వాలంటీర్లకు ఏ హామీ ఇవ్వలేదని ఇప్పుడు కూటమి నేతలు అంటే.. తిరుమల శ్రీవారిపై ప్రమాణం చేయాలని సుధాకర్‌బాబు సవాల్ చేశారు.