Best Web Hosting Provider In India 2024
రైతులకు కేంద్ర ప్రభుత్వం బిగ్ అలర్ట్ ఇచ్చింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే పెద్ద షాక్ అని చెప్పొచ్చు. ఈసారి చాలా మంది రైతులకు పీఎం కిసాన్ నగదు అందదనే ప్రచారం జరుగుతోంది. ఆచూకీ లభించనివారి జాబితాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మీ పేరు ఆ జాబితాలో ఉంటే మీకు పీఎం కిసాన్ డబ్బులు రానట్లేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.
దేశంలో రైతులకు అండగా ఉండేందుకు పెట్టుబడి సాయం కింది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకాన్ని అమలు చేస్తోన్నారు. రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రతి ఏటా మూడు విడతలుగా రూ.6 వేలు నేరుగా డీబీటీ ద్వారా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తున్నారు. ప్రతి నాలుగు నెలలకు ఒక సారి రూ.2,000 చొప్పున పీఎం కిసాన్ నగదు జమ చేస్తారు.
దేశంలో ఇప్పటికే చాలా మంది రైతులు ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారు. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి రైతులకు 18 విడతల్లో నగదు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. త్వరలో 19 విడత నగదు విడుదల కానుంది. అయితే ఈసారి చాలా మంది రైతులకు ఈ నగదు అందకపోవచ్చు. చాలా మంది రైతులు అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉంది. పథకం మార్గదర్శకాలు, విధానాలను రైతులు పాటించకపోవడమే దీనికి కారణమని ప్రభుత్వం చెబుతోంది.
ఈ పథకానికి అర్హులు కావాలంటే, రైతులు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డును అనుసంధానం చేయడం తప్పనిసరి. కాబట్టి, మీ సమీపంలోని బ్యాంకును సందర్శించి, ఆధార్ అనుసంధాన ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. ఈ పథకం ప్రయోజనాలను పొందాలంటే, ఈ-కేవైసీ తప్పనిసరిగా చేయాలి. ఈ పథకం నకిలీ లబ్ధిదారులను ఏరివేతకు ఈ ప్రక్రియను తప్పనిసరి చేసింది. మీరు ఇప్పటి వరకు ఈ-కేవైసీ చేయకుంటే, వెంటనే చేసుకోండి. అదనంగా, భూమి హక్కులకు సంబంధించిన పత్రాలను స్థానిక రెవెన్యూ కార్యాలయాల్లో దాఖలు చేయాలి. రైతులు తమ సమచారాన్ని పీఎం కిసాన్ పోర్టల్‌లో అప్‌డేట్ చేసుకోవాలి.
2019 ఫిబ్రవరి 1 వరకు భూమి పేరు మీద ఉన్న వారు మాత్రమే పీఎం కిసాన్ పథకానికి అర్హులు. ఐదేళ్లుగా అమల్లో ఉన్న ఈ నిబంధనల వల్ల అర్హులైన రైతులు నష్టపోతున్నారు. 2019 ఫిబ్రవరి తరువాత ఎవరైనా భూమి కొనుగోలు చేస్తే వారికి కూడా ఈ పథకం వర్తించటం లేదు. భూమి యజమాని చనిపోతే, భూమి ఆయన వారుసులకు చేరుతుంది. వారి పేరు మీద నమోదైతే, పీఎం కిసాన్ వర్తించాలి. కానీ ఈ విధంగా నమోదు చేసుకున్న వారికి ఈ పథకం వర్తించటం లేదు. దీంతో చాలా మంది రైతులు ఈ పథకానికి దూరం అవుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం విధించిన ఐదేళ్ల గడువు ముగిసింది. అయినప్పటికీ పాత నిబంధనలనే కొనసాగించడం వల్ల అర్హులైన రైతులు ఈ పథకానికి దూరంగా ఉన్నారు.
ఏపీ, తెలంగాణల్లో లబ్ధిదారులు తొలగింపు
ఆంధ్రప్రదేశ్‌లో 2020-21లో 49,46,026 మంది లబ్ధిదారులు ఉండగా, 2021-22కి 46,19,470 మందికి తగ్గారు. 2022-23లో 35,81,204 మందికి తగ్గారు. 2023-24లో 31,70,257 మందికి తగ్గారు. 2024-25 (2024 జూలై 22) నాటికి ఏపీలో లబ్ధిదారుల సంఖ్య 30,80,090 మందికి తగ్గారు. అంటే దాదాపు ఇప్పటి వరకు 19 లక్షల మంది రైతులు ఈ పథకం నుంచి తొలగించబడ్డారు. తెలంగాణలో 2020-21లో 36,37,112 మంది లబ్ధిదారులు ఉండగా, 2021-22కి 36,53,195 మందికి పెరిగారు. 2022-23లో 47,83,989 మంది ఉండగా, 2023-24లో 44,88,790 మందికి తగ్గారు. 2024-25 (2024 జూలై 22) నాటికి తెలంగాణలో 41,28,288 మంది ఉన్నారు.
దేశంలో లబ్ధిదారులు తొలగింపు
2021-22లో 10,79,92, 336 మంది రైతులు పీఎం కిసాన్‌లో లబ్ధిదారులుగా ఉండగా, వారికి రూ.67,147.36 కోట్లు ఇచ్చారు. 2022-23లో లబ్ధిదారుల సంఖ్య 10,74,35,548కి తగ్గగా, వారికి ఇచ్చే మొత్తం కూడా రూ.58,303.25 కోట్లు తగ్గింది. అంటే ఏడాదిలో లబ్ధిదారుల సంఖ్య 5,56,788 కట్ చేశారు. అలాగే పీఎం కిసాన్ మొత్తం కూడా రూ.8,844.11 కోట్లు కోత విధించింది. 2023-24లో లబ్ధిదారుల సంఖ్య 9,90,30,164కి తగ్గింది. అంటే ఏడాదిలో లబ్ధిదారుల సంఖ్య 84,05,384 కట్ చేశారు. 2024-25 (2024 జులై 22)లో లబ్ధిదారుల సంఖ్య 9,25,71,834కి తగ్గింది. అంటే ఏడాదిలో 64,58,330 లబ్ధిదారులను తొలగించారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం
టాపిక్