Best Web Hosting Provider In India 2024
రైతుకు దక్కాల్సిన సొమ్ములో 30% తినేస్తున్నారు
తేమ శాతం పేరిట ఆగని దోపిడీ
ఇప్పటికే రైతుల సొమ్ము రూ.1,600 కోట్లు స్వాహా
మిల్లర్లు, అధికారులు కుమ్మక్కు
ఏ ఒక్క రైతుకూ దక్కని మద్దతు ధర
రైతుల పేరిట ధాన్యం సేకరిస్తున్న దళారులు
17% లోపు తేమ ఉన్నా.. 18నుంచి 19%గా నమోదు
బస్తాకు కేజీన్నర నుంచి రెండున్నర కేజీల తరుగు
ముసురు సాకుతో తేమ శాతం పెంచేస్తున్న మిల్లర్లు
అమరావతి: ధాన్యం సేకరణలో రైతుకు తీరని అన్యాయం జరుగుతోంది. అలా అనడం కంటే ప్రభుత్వమే రైతుకు అన్యాయం చేస్తోందని చెప్పడం కరెక్ట్. రైతుకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం.. కల్లాల్లో ధాన్యం పెట్టుకొని విక్రయించడానికి ఎదురుచూస్తున్న రైతు బలహీనతను ఆసరాగా చేసుకొని దళారులు దోపిడీ చేస్తుంటే ప్రభుత్వం అడ్డుకోకపోగా ప్రోత్సహిస్తోంది.
ప్రభుత్వ యంత్రాంగం మిల్లర్లు, దళారులతో కలిసి ధాన్యం రైతులకు దక్కాల్సిన సొమ్ములో నేరుగా 30% తినేస్తోంది. మిల్లర్లు–దళారుల దోపిడీని నిలువరించాల్సిన ప్రభుత్వ పెద్దలు.. ప్రచార ఆర్భాటానికి ధాన్యం సేకరణ అంశాన్ని ఉపయోగించుకుని జబ్బలు చరుచుకుంటున్నారు. దోపిడీ సాగుతున్న తీరు ఇలా..
మద్దతు ధరలోనూ 30–40 శాతానికి పైగా లూటీ
రైతులకు చెల్లించాల్సిన కనీస మద్దతు ధరలో 30–40 శాతానికి పైగా లూటీ అవుతోంది. ఖరీఫ్ సీజన్‌లో 32.75 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించగా.. దాన్ని ఇటీవలే 37 లక్షల టన్నులకు పెంచారు. ఇప్పటివరకు 22 లక్షల టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. మరో 15 లక్షల టన్నులు సేకరించాల్సి ఉంది. అత్యధికంగా ఉత్తరాంధ్రలోనే 5.20 లక్షల టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉంది.
ఆ తర్వాత కృష్ణా జిల్లాలో 2.50 లక్షల టన్నులు, ఎన్టీఆర్ జిల్లాలో లక్ష టన్నులు, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 1.50 లక్షల టన్నులు సేకరించాల్సి ఉంది. ఇప్పటివరకు సేకరించిన ధాన్యంలో 90 శాతానికి పైగా రైతుల పేరిట దళారులే సేకరించారు.
ఇప్పటివరకు తాము సేకరించామని చెబుతున్న ధాన్యానికి కనీస మద్దతు ధర ప్రకారం రైతులకు రూ.5,397 కోట్లు చెల్లించినట్టుగా చెబుతున్నారు. కానీ.. ఇందులో వివిధ రూపాల్లో రూ.1,618 కోట్లకు పైగా.. అంటే 30 శాతానికి పైగా స్వాహా అయినట్టు తెలుస్తోంది.
మిల్లర్లతో కుమ్మక్కు
మిల్లర్లతో కొనుగోలు కేంద్రాల సిబ్బంది కుమ్మక్కయ్యారు. ఆర్‌ఎస్‌కేలలో నిర్ధారించిన తేమ శాతానికి అమ్మించేలా మిల్లర్లను ఒప్పించాల్సింది పోయి, మిల్లర్లు నిర్ధారించిన తేమ శాతానికి అమ్ముకోవాలంటూ రైతులపై ఒత్తిడి తెస్తున్నారు.
ఆర్‌ఎస్‌కేల్లో 17 శాతం ఉందని నిర్ధారించిన ధాన్యాన్ని మిల్లు దగ్గరకు తీసుకెళితే ధాన్యంలో ధూళి, దుమ్ము ఉందనే సాకుతో 18–20 శాతంగా నమోదు చేస్తున్నారు. దోపిడీ కోసమే ఇలా పొంతనలేని లెక్కలు చెబుతున్నారు. పొరుగు జిల్లాల నుంచి వచ్చే మిల్లర్లు సైతం 16–17 తేమ శాతం ఉన్న ధాన్యాన్ని 18–21 శాతం వరకు నిర్ధారించి మీకు నచ్చితే లోడింగ్ చేస్తాం, లేకుంటే పట్టుకెళ్లిపోండని తెగేసి చెబుతున్నారు.
దళారులు పంపిస్తే గంటలోనే అన్‌లోడింగ్
దళారులు ప్రారంభంలో రైతులకు మద్దతు ధర 75 కేజీల బస్తాకు రూ.1,350 నుంచి రూ.1,500 మధ్య చెల్లించేవారు. ప్రస్తుతం కాస్త పెంచి రూ.1,500 నుంచి రూ.1,600 మధ్య చెల్లిస్తున్నారు. అదే ఎంటీయూ 1262, 1318 రకం ధాన్యానికైతే నేటికీ రూ.1,100 నుంచి రూ.1,300 మధ్యే చెల్లిస్తున్నారు.
ఫలితంగా 75 కేజీల బస్తా దగ్గరే 125 నుంచి రూ.400 వరకు నష్టపోతున్నారు. ప్రొక్యూర్‌మెంట్ ఏజెన్సీలు, మిల్లర్ల వేధింపులు తట్టుకోలేక చివరకు దళారులకే ధాన్యాన్ని ఇచ్చి మిల్లులకు పంపిస్తున్నారు. కాగా.. దళారులు తెచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు గంటలోనే అన్లోడ్ చేసుకుంటున్నారు. అదే రైతు నేరుగా తీసుకెళ్తే అన్‌లోడింగ్‌కు 24 నుంచి 48 గంటల సమయం పడుతోంది.
మొహం చాటేస్తున్న మిల్లర్లు
వర్షాలతో ధాన్యంలో తేమ శాతం పెరిగిపోతోంది. ఎంత ఆరబెట్టినా మిల్లు వద్ద 25 శాతం కన్నా తక్కువ తేమ చూపడం లేదు. తేమ శాతం వంకతో మిల్లర్లు కొనేందుకు కూడా మొహం చాటేస్తున్నారు. ధాన్యం వ్యాపారులు 75 కేజీల బస్తాకు రూ.1,100.. మహా అయితే రూ.1,200కు మించి ఇవ్వలేమని తెగేసి చెబుతున్నారు.
ఏం చేయాలో పాలుపోక రైతులు దిక్కులు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. ధాన్యం సొమ్ములు గంటలోనే జమ చేస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నప్పటికీ సాంకేతిక కారణాల సాకుతో 15 నుంచి నెల రోజుల వరకు వేచి చూడాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు.
పక్కదారి పడుతోందిలా..
సాధారణంగా రైతులు కోసిన ధాన్యాన్ని 40 కేజీల చొప్పున బస్తాలలో కాటా వేస్తారు. గోనె సంచి బరువు మరో 500 గ్రాములు కలిపి 40.50 కేజీల చొప్పున కాటా వేయాలి. కానీ.. 41.50 కేజీల వరకు కాటా తూస్తున్నారు. అంటే కేవలం 40 కేజీల కిట్టీ దగ్గరే ఏకంగా కిలో చొప్పున టన్నుకు 25 కేజీలకుపైగా నష్టపోతున్నారు. అంటే కిలోకు రూ.23 చొప్పున 25 కిలోలకు రూ.575 చొప్పున ప్రతి టన్నుకూ రైతులకు నష్టం వాటిల్లుతోంది.
ఇక తేమ శాతం విషయానికి వస్తే 17 శాతం వరకు తేమ ఉంటే పూర్తిస్థాయి మద్దతు ధర (క్వింటాకు రూ.2,300) చొప్పున చెల్లించాలి. కానీ.. బూతద్దం పెట్టి వెతికినా పూర్తిస్థాయి మద్దతు ధర రైతులకు దక్కడం లేదు. నిబంధనల ప్రకారం తేమ 17 శాతం ఉన్నా 75 కేజీల బస్తాకు కేజీన్నర నుంచి రెండున్నర కేజీల చొప్పున తరుగు మినహాయిస్తున్నారు. అంటే ఇక్కడ టన్నుకు 35–40 కేజీలు చొప్పున రూ.920 నష్టపోతున్నాడు.
తేమ శాతం 17 దాటితే ఒక్కో శాతానికి రెండున్నర కేజీల వరకు తరుగు మినహాయిస్తున్నారు. 25 శాతం తేమ ఉంటే బస్తాకు 8–12 కేజీల చొప్పున కోత పడుతోంది. ఈ విధంగా టన్నుకు 140 కేజీల చొప్పున రూ.3,864 మేర రైతులకు నష్టం వాటిల్లుతోంది. నిబంధనల మేరకు తేమ శాతం ఉన్నా సరే టన్నుకు రూ.1,495 నష్టపోతుంటే.. తేమ శాతం గనుక 17–25 మధ్య ఉంటే టన్నుకు రూ.5,355 వరకు నష్టపోతున్నారు.
అంటే టన్నుకు రూ.23 వేలు దక్కాల్సిన రైతులకు కేవలం సుమారు రూ.17 వేలు మాత్రమే దక్కుతోంది. మిగిలిన మొత్తం దళారులు, మిల్లర్లు స్వాహా చేస్తున్నారు. వారినుంచి మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులకు వాటాలు ముడుతున్నాయి.
తేమ శాతంలో పొంతన లేని లెక్కలు
ధాన్యం కొనుగోలులో దోపిడీకి కూటమి ప్రభుత్వమే దగ్గరుండి ద్వారాలు తెరిచింది. దళారులు, మిల్లర్ల ప్రమేయం లేకుండా గడచిన ఐదేళ్లుగా అత్యంత పారదర్శకంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరిగితే.. ప్రస్తుతం మిల్లర్ల కనుసన్నల్లోనే «కొనుగోళ్లు జరిగే పరిస్థితి నెలకొంది. తొలుత 25 శాతం వరకు తరుగు లేకుండానే తీసుకుంటామని తొలుత చెప్పిన ప్రభుత్వం ఆ తర్వాత మాటమార్చి 17 శాతం దాటితే ఐదు కేజీలు తరుగుతో తీసుకుంటామని ప్రకటించింది.
చివరకు నిబంధనల మేరకు 17 శాతం తేమ ఉన్నా సరే పూర్తి మద్దతు ధర చెల్లించే పరిస్థితి కన్పించడం లేదు. గతంలో రైతు భరోసా కేంద్రాల్లో నిర్ధారించిన తేమ శాతమే ఫైనల్. అదే తేమ శాతానికి మద్దతు ధర లెక్కగట్టి రైతులకు జమ చేసేవారు. కానీ.. ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రస్తుతం రైతు సేవా కేంద్రాల (ఆర్‌ఎస్‌కే)తో పాటు మిల్లుల వద్ద కూడా తేమ శాతాన్ని నిర్ధారిస్తున్నారు. ఈ రెండుచోట్ల నిర్ధారిస్తున్న తేమ శాతానికి పొంతన లేకుండా పోతోంది.
కాళ్లా వేళ్లా పడినా కొనడం లేదు
ఈ రైతు పేరు గుడవర్తి వెంకట సుబ్బరాజు. బాపట్ల జిల్లా మంతెనవారిపాలేనికి చెందిన సుబ్బరాజు పదెకరాల్లో ఎంటీయూ–1262 రకం సాగు చేశారు. ఈ నెల 16న కోయగా.. ఎకరాకు 35 బస్తాల చొప్పున 350 బస్తాల దిగుబడి వచ్చింది. 8 రోజులు ఆరబెట్టి.. 24వ తేదీన రైతు సేవా కేంద్రంలో తేమ పరిశీలిస్తే 23 శాతం వచ్చింది. బాపట్ల ఉప్పరపాలెం రైసుమిల్లుకు అదే రోజున 100 బస్తాలను తోలితే 23 శాతం తేమ ఉందని 5 కేజీల తరుగుతో తీసుకున్నారు.
బుధవారం మరో 200 బస్తాలు తీసుకెళ్తే 27 శాతం తేమ ఉంది. మీ ధాన్యం మాకొద్దని తెగేసి చెప్పారు. ‘తరుగు ఎంతైనా తీసుకోండి. మీకు నచ్చిన ధర ఇచ్చి ధాన్యం దింపుకోండ’ని కాళ్లావేళ్లా పడినా మిల్లు యాజమాన్యం పట్టించుకోలేదు. అధికారుల దృష్టికి తీసుకెళ్తే.. మిల్లర్ ఏం చెబితే అదే ఫైనల్ అన్నారు.
వాతావరణం చూస్తే గంటకోలా మారుతోంది. చేసేది లేక టార్పాలిన్లు అద్దెకు తెచ్చి మిల్లు ఎదుటే ట్రాక్టర్‌లో ఉన్న ధాన్యం బస్తాలపై కప్పి అక్కడే పడిగాపులు పడుతున్నాను. ఉదయం నుంచి తిండీ తిప్పల్లేవు. ఏంచేయాలో పాలుపోవడం లేద’ని సుబ్బరాజు కన్నీరుమున్నీరయ్యారు.
బస్తాకు రూ.1,470కు మించి ఇవ్వడం లేదు
ఈ రైతు పేరు కొండవీటి వెంకటసుబ్బారావు. కృష్ణా జిల్లా మంతెనకు చెందిన ఈయన నాలుగు ఎకరాల్లో ఎంటీయూ–2077 వరి సాగు చేసారు. బుడమేరు ముంపు వల్ల ఎకరాకు 30 బస్తాలకు మించి రాలేదు. రైతు సేవా కేంద్రానికి శాంపిల్ తీసుకెళ్లి తేమ శాతం చూడమంటే.. ‘అవసరం లేదు నేరుగా మిల్లుకు తీసుకుపొండి..అక్కడ వాళ్లు చెప్పిన తేమ శాతమే ఫైనల్’ అని కొనుగోలు కేంద్రం సిబ్బంది బదులిచ్చారు. దీంతో దాములూరులోని బాలాజీ రైస్‌మిల్లుకు 213 (ఒక్కొక్కటీ 40 కేజీల) బస్తాలు తీసుకెళితే 24 శాతం తేమ వచ్చింది.
రెండో రోజు మరో 105 బస్తాలు తీసుకెళితే 26 శాతం వచ్చిందని చెప్పారు. దాదాపు 8 కేజీలు తరుగు తీసేశారు. 75 కేజీల బస్తాకు రూ.1,470 చొప్పున ఇస్తామన్నారు. అడ్డగోలుగా దోచుకుంటున్నారు. కనీసం పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి కనిపించడం లేదు’ అని సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు.
పొంతన లేని తేమ లెక్కలు
ఈ రైతు పేరు గుడిపూడి అవినాశ్. ఏలూరు జిల్లా దెందులూరుకు చెందిన ఈయన ఐదెకరాల్లో ఎంటీయూ–1318 రకం సాగు చేశారు. ఎకరాకు 33 బస్తాల దిగుబడివచ్చింది. 18న కోత కోయగా.. 23న రైతు సేవా కేంద్రంలో 17 శాతం తేమ వచ్చింది. అదే రోజున మారుతి మిల్లుకు 154 బస్తాలు తరలిస్తే.. అక్కడ తేమ శాతం 19గా చూపించారు.
75 కేజీల బస్తాకు రూ.1,725 ఇవ్వాల్సి ఉండగా.. రూ.1,650 చొప్పున ఇచ్చారు. రైతు సేవాకేంద్రంలో చెబుతున్న తేమ శాతానికి మిల్లులో చెబుతున్న తేమ శాతానికి పొంతన ఉండడం లేదు. ఇదేమిటని అడిగితే మీకు నచ్చకపోతే తీసుకెళ్లిపోవచ్చని మిల్లర్ చెబుతున్నారు.