Best Web Hosting Provider In India 2024
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ఆందోళన కార్యక్రమం జనవరి 29కి వాయిదా
విద్యార్ధుల పరీక్షల దృష్ట్యా వాయిదా వేస్తున్నాం.
మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడి
విద్యుత్ ఛార్జీల పెంపుపై వైయస్ఆర్‌సీపీ పోరుబాట విజయవంతమైంది.
పోరుబాటలో పార్టీ శ్రేణులతోపాటు ప్రజలు కూడా భాగస్వాములయ్యారు.
ప్రభుత్వం ఇప్పటికైనా పెంచిన ఛార్జీలు తగ్గించాలి.
శాసనమండలి విపక్షనేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్.
వైయస్ఆర్‌సీపీ హయాంలో రూ.14 లక్షల కోట్లు అప్పు అని తప్పుడు ప్రచారం.
వాస్తవానికి రూ.6 లక్షల కోట్లు మాత్రమే వైయస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన అప్పు.
అందులో రూ.2.74 లక్షల కోట్లు వివిధ పథకాల ద్వారా డీబీటీ చేశాం.
కూటమి పాలన ఏడు నెలల్లోనే లక్ష కోట్లు దాటిన అప్పు
ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చని ప్రభుత్వం.
చేసిన అప్పు డబ్బు ఎటుపోయింది? ఏమైంది?
ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసిన బొత్స సత్యనారాయణ
ఇచ్చిన హామీలను కొత్త సంవత్సరంలోనైనా అమలు చేయాలి.
ఎండీఓ పై దాడి జరిగిందని పవన్ పరామర్శించారు.
అదే జిల్లాలో టీడీపీ నేతల దాడిలో వీఆర్వో తల పగిలింది.
ఆయన్ను కూడా పవన్ పరామర్శిస్తే బాగుండేది.
చట్టాన్ని అధికార పార్టీ చుట్టంగా మార్చొద్దు.
ప్రెస్‌మీట్‌లో పవన్‌కళ్యాణ్‌కు బొత్స చురక.
విశాఖపట్నం:విద్యార్ధులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.2800 కోట్లు, వసతి దీవెన బకాయిలు రూ.1100 కోట్లు కలిసి మొత్తం రూ.3900 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. జనవరి 3వ తేదీన కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలకు వైయస్ఆర్‌సీపీ ఇప్పటికే పిలుపునిచ్చిందన్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ… విద్యార్ధుల పరీక్షల కారణంగా ఈ కార్యక్రమాన్ని జనవరి 29 నాటికి వాయిదా వేస్తున్నట్టు వెల్లడించారు. అప్పటిలోగా ప్రభుత్వం విద్యార్ధులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన డబ్బులు విడుదల చేసి, వారిని ఆదుకోవాలని కోరారు. విశాఖపట్నం క్యాంప్ ఆఫీస్‌లోశాసనమండలి విపక్షనేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.
పోరుబాట విజయవంతం:
ప్రభుత్వం ట్రూఅప్ ఛార్జీల పేరుతో యూనిట్ కు రూ.1.20 నుంచి రూ.1.25 పైసలు చొప్పున దాదాపు రూ.15,600 కోట్ల విద్యుత్ ఛార్జీల భారాన్ని వెనక్కి తీసుకోవడంతో పాటు, ప్రభుత్వమే డిస్కమ్‌లకు చెల్లించాలని డిమాండ్ చేస్తూ వినియోగదారులతో కలిసి వైయస్ఆర్‌సీపీ చేపట్టిన ఆందోళన కార్యక్రమం విజయవంతమైందని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని.. విద్యుత్ వినియోగదారులపై ఎలాంటి భారం వేయమన్న హామీ నిలబెట్టుకోవాలని విశాఖలో మీడియాతో మాట్లాడిన బొత్స డిమాండ్ చేశారు.
ప్రభుత్వంలో చలనం లేదు:
పండిన పంటకు గిట్టుబాటు ధర రాక, అకాల వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న రైతుల తరపున కూడా ఆందోళన చేపట్టి వారిని ఆదుకోవాలని జిల్లా కలెక్టర్లు వినతిపత్రాలు సమర్పించినా ప్రభుత్వంలో మాత్రం చలనం లేదని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన మాటలను పెడచెవిన పెట్టి ప్రభుత్వం కళ్లబొల్లి మాటలతో కాలం గడుపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏడు నెలల్లో లక్ష కోట్లు!:
ఎన్నికలకు మందు వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం లక్షల కోట్లు అప్పు చేసిందని తెలుగుదేశం పార్టీ బాకా పట్టుకుని అబద్దాలు ప్రచారం చేసిందని బొత్స ఆక్షేపించారు. వైయస్ఆర్‌సీపీ హయాంలో అన్ని రకాల అప్పులు కలుపుకున్నా రూ.6 లక్షల కోట్లు మించలేదని.. అయినా రూ.14 లక్షల కోట్లు అప్పు అని విపరీతంగా దుష్ప్రచారం చేయడాన్ని తప్పు బట్టారు.
మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు తిరక్క ముందే దాదాపు రూ.74 వేల కోట్లు అప్పు చేసిందన్న బొత్స.. అవీ కాకుండా మార్క్ ఫెడ్, సివిల్ సఫ్లైస్, ఏపీఎండీసి వంటి కార్పొరేషన్ల నుంచి కూడా అప్పులు చేస్తున్నారని వెల్లడించారు. వీటికి అదనంగా ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15 వేల కోట్ల అప్పులు కలుపుకుంటే, ఇప్పటికే కూటమి ప్రభుత్వం లక్ష కోట్ల అప్పు చేసిందని గుర్తు చేశారు.
ఆరోజు వైయస్ఆర్‌సీపీ అప్పులు చేసినా, అందులో కీలక భాగం ప్రజలకు పంచిందని మాజీ మంత్రి గుర్తు చేశారు. వివిధ పథకాల ద్వారా ఆ 5 ఏళ్లలో ఏకంగా రూ.2.74 లక్షల కోట్లు డీబీటీ ద్వారా జమ చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
మరి ఈ అప్పు అంతా ఏమైంది?:
ఇవాళ కూటమి ప్రభుత్వం చేసిన లక్ష కోట్ల అప్పు ఏం చేశారని మాజీ మంత్రి నిలదీశారు. పెన్షన్ రూ.1000 పెంచినా, ఇప్పటికే వాటిలో 3 లక్షలు కోత పెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇంకా ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోగా, యూనిట్ విద్యుత్‌కు పేదవాడి మీద రూ.1.20 అదనపు భారం వేయడంతో పాటు ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు నెలకు ఉచితంగా ఇస్తున్న 200 యూనిట్లు విద్యుత్ కూడా నిలిపేస్తున్నారని మండిపడ్డారు. ఇంకా గతంలో దశల వారీగా ఇచ్చే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల రిజిష్ట్రేషన్లు కూడా నిలిపివేశారని ఆక్షేపించారు. ఈ విధంగా అన్ని రకాలుగా ప్రజలకు అన్యాయం చేస్తూ.. తిరిగి ప్రతిపక్షంపై దుమ్మెత్తి పోయడం అధికార పార్టీకి అలవాటుగా మారిపోయిందని మాజీ మంత్రి బొత్స ఆక్షేపించారు.
ఇప్పటికే లక్ష కోట్ల అప్పు చేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఒక్క మంచి కూడా చేయలేదని చెప్పారు. ఈ ఆరు నెలల్లోనే లక్ష కోట్ల అప్పు చేసిన ఈ ప్రభుత్వం.. ఐదేళ్ల పాలనలో రూ.10 లక్షల కోట్ల అప్పు చేయాడనికి సన్నద్ధమయిందని ఆరోపించారు. సీఎం చంద్రబాబు చెప్పిన సంపద సృష్టి ఎక్కడుందని నిలదీసిన బొత్స సత్యనారాయణ, సంపద సృష్టి అంటే అప్పులు చేయడమా? అని ప్రశ్నించారు.
అన్నింటా కూటమి ప్రభుత్వం విఫలం:
అధికారంలోకి వ్చచిన ఆరునెలల్లోనే ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన కూటమి ప్రభుత్వం కనీసం కొత్త సంవత్సరంలోనైనా ప్రజలను సుభిక్షంగా ఉంచేలా పాలన చేయాలని హితవు పలికారు. ఇచ్చిన హామీల్లో ఉచిత బస్సు లాంటి చిన్న చిన్న హామీలను కూడా అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అవగాహన లేకుండానే అన్ని హామీలను ఎలా ఇచ్చారన్న బొత్స.. కేవలం అధికారం కోసమే అబద్దాలు ఆడి ప్రజలను గాలికొదిలేయడం న్యాయమేనా? అని నిలదీశారు.
కనీసం డిస్కమ్‌లకు ఇవ్వాల్సిన డబ్బులైనా ప్రభుత్వం చెల్లించి ఉంటే.. సామాన్యులకు ట్రూఅప్ ఛార్జీల మోత తగ్గేదని చెప్పారు. కానీ, ప్రభుత్వ నిర్వాకం వల్ల ఒక్కో వినియోగదారుడి మీద రూ.2 వేల నుంచి రూ.3 వేల భారం పడుతుంటే సామాన్యుడు ఎలా బ్రతుకుతాడని నిలదీశారు.
ధాన్యం కొనుగోళ్లులోనూ ప్రభుత్వం రైతులను వంచిస్తోందని బొత్స గుర్తు చేశారు. ఒకవైపు 24 గంటల్లో ధాన్యం డబ్బులు చెల్లిస్తున్నామని ప్రభుత్వం చెపుతుంటే.. తేమ శాతం ఎక్కువగా ఉందని.. 20 శాతం వరకు డబ్బులు మినహాయించుకుంటున్నారని మండిపడ్డారు.
సూపర్ సిక్స్ సహా ఎన్నికల్లో కూటమి పార్టీలు ఇచ్చిన హామీలను కొత్త ఏడాదిలో ఎప్పుడు ఇస్తారో స్పష్టం చేయాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. లేని పక్షంలో బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రజల తరపున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. మీడియా అండదండలున్నాయని కల్లిబొల్లి మాటలతో కాలం వెల్లదీయాలని చూస్తే ఎల్లకాలం సాగదని తేల్చి చెప్పారు.
మీడియా ప్రశ్నలకు సమాధానంగా..
అందులో తప్పేముంది?:
విశాఖ విమానాశ్రయంలో తనను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కలవడంపై మాట్లాడుతూ.. తాను గతంలో లోకేష్‌ను, పవన్‌కళ్యాణ్‌ను కూడా కలిశానన్నారు. అందులో తప్పేముందన్నారు. కేవలం అభద్రతా భావంతో ఉన్న వాళ్లే ఇలాంటి విషయాలకు భయపడి అనవసర రాద్ధాంతం చేస్తారని చెప్పారు
ఈ వివాదాన్ని çసృష్టించిన వారే దీనికి సమాధానం చెప్పాలన్నారు. అధికార పార్టీ అనుకూల ఛానల్‌లో ఈ వార్త వచ్చిందన్న బొత్స.. మంత్రి శ్రీనివాస్ మీద ఆ పార్టీలోనే కుట్ర జరుగుతుందేమోనని అనుమానం వ్యక్తం చేశారు.
ఫోన్ చేస్తే ఎత్తడం లేదు:
డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ హల్చల్ చేయడంపై బొత్స సత్యనారాయణ విస్మయం వ్యక్తం చేశారు. తప్పు జరిగితే తొక్క తీస్తానని తరచూ మాట్లాడే పవన్‌కళ్యాణ్ దీనిపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. దీన్ని కూడా జగన్‌గారి ప్రభుత్వ వైఫల్యం అంటారేమోనని ఎద్దేవా చేశారు.
డీజీపీ అన్నా, ఆ పదవి అన్నా తనకు చాలా గౌరవమన్న మాజీ మంత్రి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తాను డీజీపీ అన్న విషయాన్ని ప్రస్తుత డీజీపీ మర్చిపోయినట్టున్నారని, అందుకే తాము ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడానికి కూడా భయపడుతున్నారని తెలిపారు.
పవన్ ఆ పని చేస్తే బాగుండేది:
ఎంపీడీఓ పై దాడి జరిగిందని పరామర్శకు కడప వెళ్లిన పవన్, అదే జిల్లాలో బీరు బాటిల్ తో టీడీపీ నేతల దాడిలో గాయపడిన చంద్రమౌళి అనే వీఆర్వోనూ కూడా పరామర్శిస్తే బాగుండేదన్నారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని.. అందరికీ ఒకటే అని చెప్పుంటే బాగుండేదని సూచించారు. చట్టాన్ని అధికార పార్టీకి చుట్టంగా మార్చొద్దని బొత్స హితవు పలికారు.
సినీ హీరోలను వైయస్ జగన్‌గారు నాడు అవమానించారనేది అవగాహన రాహిత్యమన్న మాజీ మంత్రి, తనను సీఎం వైయస్ జగన్, ఎంతో గౌరవించారని చిరంజీవి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.