Best Web Hosting Provider In India 2024
ఇవన్నీ త్రీమెన్ కమిటీ నిర్ధారించినవే.. వాస్తవంగా 150 మందికి పైగా బలవన్మరణం
ఆరున్నర నెలల టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనలో రైతన్నల పరిస్థితి దారుణం
వరదలు, భారీ వర్షాలు, వర్షాభావ పరిస్థితులతో దెబ్బతిన్న పంటలు
ఆదుకోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం.. అప్పుల ఊబిలో అన్నదాతలు
పెట్టుబడి సాయం లేదు.. బీమా పరిహారం లేదు.. కరువు సాయం అంతకంటే లేదు
మద్దతు ధర దక్కక, కష్టాలు తీరక అప్పుల ఒత్తిడితో తనువు చాలిస్తున్న వైనం
ఆ కుటుంబాలను ఓదార్చే తీరికలేని స్థితిలో ప్రజాప్రతినిధులు, అధికారులు
బాధిత కుటుంబాలకు పైసా విడుదల చేయని కూటమి ప్రభుత్వం
వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకుంటున్నారని తప్పుడు నివేదికలు
వైఎస్ జగన్ హయాంలో రైతన్నలకు అన్ని విధాలా భరోసా.. ఎక్స్‌గ్రేషియా
రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంపు
గత బాబు ప్రభుత్వ బకాయిలు సహా ఎప్పటికప్పుడు పరిహారం చెల్లింపు
రేటు పతనమై.. బతుకు భారమై..
గుంటూరు జిల్లా ప్రత్తిపాడుకు చెందిన కౌలు రైతు యనగందుల వీరారావు (54) 30 ఏళ్లుగా వ్యవసాయం చేస్తుండేవాడు. గతేడాది అధిక వర్షాల వల్ల పంటలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. పత్తి, మిరపకు మంచి ధరలు రావడంతో ఈ ఏడాది రూ.4 లక్షలు అప్పులు చేసి 2.5 ఎకరాల్లో మిరప సాగు చేశాడు. కోతలు ప్రారంభమయ్యే నాటికి క్వింటా రూ.15 వేలు ఉండడంతో, ధరలు పెరుగుతాయన్న ఆశతో కోల్డ్ స్టోరేజీలో పెట్టాడు. వ్యాపారులు సిండికేట్‌గా మారడంతో క్వింటా రూ.10 వేలకు పడిపోయింది.
మరింత పడిపోతాయన్న ఆందోళనతో అమ్ముకోగా, కోల్డ్ స్టోరేజీ ఖర్చులన్నీ పోనూ రూ.70 వేలు మిగిలింది. గతంలో చేసిన వాటితో కలిపి రూ.10 లక్షల అప్పులు తీర్చే దారిలేక, అప్పులోళ్లకు ముఖం చూపించలేక గత నెల 23న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వీరారావు భార్య కూలీ పనికి వెళ్తోంది. ఉన్న ఇంటిని అమ్మి రేకుల షెడ్‌లో అద్దెకు ఉంటున్నామని, తల్లితో పాటు తన వద్ద ఉన్న బంగారాన్ని కుదవ పెట్టినా అప్పులు తీరలేదని, ఆదుకోవాల్సిన ప్రభుత్వం తమను పట్టించుకోలేదని వీరారావు కుమారుడు సుబ్బారావు కన్నీటి పర్యంతమయ్యాడు.
సాగు నిజం.. వ్యవ‘సాయం’ దుర్లభం
వైయస్ఆర్ జిల్లా రామిరెడ్డిపల్లెకు చెందిన ఎన్.శ్రీనివాసులు రెడ్డి (47) గత నెల 28న, వేంపల్లికి చెందిన ఆశీర్వాదం (63) ఈ నెల 15న ఆత్మహత్యలకు పాల్పడ్డారు. శ్రీనివాసులురెడ్డికి సొంత పొలంతో పాటు 4 ఎకరాల కౌలు భూమి ఉండగా, సొసైటీలో రూ.5 లక్షలు, ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.20 లక్షల అప్పులున్నాయి. ఆశీర్వాదానికి సొంతంగా 2 ఎకరాలుండగా, 4 ఎకరాలు కౌలుకు చేస్తున్నాడు.
ఆయన సొసైటీలో రూ.2 లక్షలు, ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.3 లక్షలు అప్పులు చేసి పెట్టుబడి పెట్టాడు. వర్షాభావ పరిస్థితుల వల్ల ఇద్దరి పంటలు పూర్తిగా దెబ్బ తినడంతో పొలంలో గుళికలు మింగి ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అయితే అధికార పార్టీ పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గి.. వీరిద్దరి ఆత్మహత్యలకు వ్యక్తిగత ఇబ్బందులే కారణమని అధికారులు తేల్చారు. పరిహారం అందక ఈ రెండు కుటుంబాలు రోడ్డునపడ్డాయి.
టీడీపీ నేతల బెదిరింపులు తాళలేక
బాపట్ల జిల్లా బుల్లికురువ మండలం వెలమవారిపాలెంలోని ఎస్సీ సామాజికవర్గానికి చెందిన చింతల శ్రీను(41) 25 ఏళ్లుగా సాగు చేస్తున్నాడు. తనకున్న 20 ఎకరాలను గ్రామానికి చెందిన టీడీపీ నేతలు ఆక్రమించుకొని అక్రమంగా ఆన్‌లైన్‌లో వారి పేరిట మార్చుకున్నారు. రెవెన్యూ, పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. టీడీపీ నేతల వేధింపులు తాళలేకపోతున్నానని, తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ అధికారులకు సమాచారమిచ్చినా స్పందన లేదు.
చనిపోయే ముందు 100కు ఫోన్ చేసినా పట్టించుకోలేదు. చివరికి అద్దంకి సమీపంలోనే పురుగుల మందు తాగి విగతజీవిగా పడి ఉన్న శ్రీనును స్థానిక వైయస్ఆర్‌సీపీ కార్తకర్తలు హుటాహుటిన ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ గత నెల 28న మృతి చెందాడు. తండ్రి చనిపోయిన తర్వాత కూడా టీడీపీ నేతల వేధింపులు కొనసాగుతున్నాయంటూ శ్రీను కుమారులు భూదేశ్వరరావు, వీరయ్యలు కన్నీటి పర్యంతమవుతున్నారు.
ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి ఇల్లు గడిచే దారిలేక, పిల్లల చదువులు సాగక, పెళ్లిళ్లు ఆగిపోయి ఆర్థిక ఇబ్బందులతో ఆ కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ‘మేమున్నాం అని ధైర్యం చెప్పి ఆదుకోవాల్సిన ఆపన్న హస్తం కనిపించకపోవడంతో వారంతా రోడ్డున పడి దిక్కులు చూస్తున్నారు. అందలం ఎక్కింది మొదలు అన్నదాతపై కక్ష కట్టినట్టుగా వ్యవహరిస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వ తీరుతో పుడమి తల్లి బిడ్డలు విసిగివేసారి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
సాగు వేళ తుపానులు, వరదలు, వర్షాభావ పరిస్థితులు ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా వైపరీత్యాలు ముప్పేట దాడి చేయడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతన్నల పాలిట ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు మృత్యు పాశాలుగా మారాయి. సూపర్ సిక్స్ హామీలను అటకెక్కించిన ప్రభుత్వం తమను వంచించడంతో పాటు తమకు న్యాయంగా దక్కాల్సిన పంటల బీమా పరిహారం కూడా అందకుండా చేయడంతో పెట్టుబడికి చేతిలో చిల్లిగవ్వలేక సాగు భారమై అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.
అధికారిక లెక్కల ప్రకారమే ఆరున్నర నెలల కూటమి పాలనలో ఆత్మహత్యలకు పాల్పడిన వారి సంఖ్య సెంచరీకి చేరువయ్యిందంటే రైతులు ఎంతటి దయనీయ స్థితిలో ఉన్నారో అర్థమవుతోంది. వీరంతా త్రీమెన్ కమిటీ నిర్ధారించిన వారే. ఇక వివిధ కారణాలతో కమిటీ వద్ద పెండింగ్‌లో ఉన్న కేసులు, తిరస్కరించిన కేసులు కలుపుకుంటే ఆత్మహత్య చేసుకున్న వారు 150కి పైగానే ఉన్నారు.
ఆరున్నర నెలల్లో ఒక్కరంటే ఒక్కరికి కూడా పైసా పరిహారం ఇవ్వక పోవడంతో బాధిత కుటుంబాలు గుండెలవిసేలా రోదిస్తున్నాయి. తాజాగా వైఎస్సార్ జిల్లాకు చెందిన రైతు తన భార్య, కొడుకు, కుమార్తెలకు ఉరి వేసి.. తనూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రంలో రైతుల దుస్థితికి అద్దం పడుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల దయనీయ పరిస్థితి కంట నీరు తెప్పిస్తోంది.
కూటమి ప్రభుత్వం రాకతో కష్టాలు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు కష్టాలు మొదలయ్యాయి. ఏటా సీజన్‌కు ముందు అందే పెట్టుబడి సాయం లేదు. పంటల బీమా పరిహారం జాడ లేదు. కరువు సాయం ఊసే లేదు. సున్నా వడ్డీ రాయితీ లేదు. పోనీ రూ.3–5 వడ్డీలకు అప్పులు చేసి మరీ సాగు చేస్తుంటే సకాలంలో విత్తనాలు, ఎరువులు దొరక్క పడరాని పాట్లు పడాల్సి వస్తోంది. బహిరంగ మార్కెట్‌లో ఓ పక్క కల్తీలు రాజ్యమేలుతుంటే మరోపక్క బ్లాక్ మార్కెటింగ్ పెచ్చు మీరింది.
ఇంటిల్లిపాది రెక్కలు ముక్కలు చేసుకొని ఆరుగాలం శ్రమించి సాగు చేస్తే ఓ వైపు వైపరీత్యాలు, మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం వారి కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ప్రతికూల పరిస్థితుల్లో సాగు చేసి పండించిన కొద్దిపాటిæ పంట చేతికొచ్చే సమయంలో ధర లేక అయినకాడకి తెగనమ్ముకుంటూ తమ కష్టాన్ని దళారుల పాల్జేయాల్సిన దుస్థితి ఏర్పడింది. వైపరీత్యాలకు తోడు ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతు కుటుంబాలను ఓదార్చే వారు కరువయ్యారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన ప్రజాప్రతినిధులు అటువైపు కన్నెత్తిచూడడం లేదు.
ఆరున్నర నెలల్లోనే సడలిన నమ్మకం
ప్రభుత్వ నిర్వాకం, అస్తవ్యస్త విధానాల వల్ల అన్నదాతల్లో నమ్మకం పోతోంది. వెరసి జూన్ 12వ తేదీ నుంచి ఇప్పటి దాకా.. కేవలం ఆరున్నర నెలల్లో 95 మంది ఆత్మహత్యకు పాల్పడినట్టుగా త్రీమెన్ కమిటీ ధ్రువీకరించింది. తాజాగా వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో శనివారం ఆత్మహత్య చేసుకున్న వారితో కలుపుకుంటే ఈ సంఖ్య 97కు చేరుకుంది. త్రీమెన్ కమిటీ ధ్రువీకరించకుండా పెండింగ్‌లో ఉన్న కేసులు మరో 10–15 వరకు ఉంటాయని, తిరస్కరించిన కేసులు ఇంకో 50 ఉంటాయని అధికార వర్గాల సమాచారం.
ఇప్పటి వరకు ఆత్మహత్య చేసుకున్న వారిలో రాయలసీమ జిల్లాలకు చెందిన వారే అత్యధికంగా ఉన్నారు. కర్నూలు, అనంతపురం, వైఎస్సార్, గుంటూరు జిల్లాల్లోనే 51 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒక్క కర్నూలు జిల్లాలోనే అత్యధికంగా 30 మంది అర్ధాంతరంగా తనువు చాలించారు. దాదాపు ప్రతి జిల్లాలోనూ కనీసం ఇద్దరు ముగ్గురికి తక్కువ కాకుండా ఆత్మహత్యలకు పాల్పడిన రైతులున్నారు. వీరికి ఎంత పరిహారం ఇవ్వాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది.
2014–19 మధ్య ఎన్నో ఆంక్షలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆత్మహత్యకు పాల్పడిన రైతులకు రూ.లక్ష పరిహారం ఇచ్చేవారు. రూ.లక్ష కోసమే రైతులు ఆత్మహత్య చేసుకుంటారంటూ చంద్రబాబు అవహేళనగా మాట్లాడడమే కాదు.. ఆ ఇచ్చే పరిహారాన్ని కూడా 2003లో ఆపేశారు. 2014లో పరిహారం పునరుద్ధరించగా, 2015 ఫిబ్రవరి 18వ తేదీ వరకు రూ.1.50 లక్షల చొప్పున పరిహారం ఇచ్చారు.
ఆ తర్వాత రూ.5 లక్షలకు పెంచారు. దాంట్లో రూ.1.50 లక్షలను వన్ టైం సెటిల్‌మెంట్ కింద ఆత్మహత్యకు పాల్పడిన రైతుల అప్పుల ఖాతాకు జమ చేసేవారు. రూ.3.5 లక్షల పరిహారాన్ని విత్ డ్రా చేసుకునేందుకు వీలు లేకుండా డిపాజిట్ చేసి, దానిపై వచ్చే వడ్డీని మాత్రమే వాడుకునేలా ఆంక్షలు విధించారు. 2014–19 మధ్య ఐదారువేల మంది ఆత్మహత్యలకు పాల్పడితే అధికారికంగా గుర్తించింది కేవలం 1,223 మందిని మాత్రమే. కానీ పరిహారం ఇచ్చింది కేవలం 450 మందికి రూ.20.12 కోట్లే. కౌలు రైతుల ఊసే లేదు.
పరామర్శ లేదు.. సాయం ఊసు లేదు
‘రైతు కుటుంబాల్లో జరగరానిది జరిగితే వెంటనే స్థానిక ఎమ్మెల్యేతో కలిసి కలెక్టర్ వారింటికి వెళ్లి ధైర్యాన్నివ్వాలి. అదేరోజు వీఆర్వో వెళ్లి వివరాలు సేకరించాలి. మండల స్థాయి కమిటీ విచారణ చేపట్టి, 24 గంటల్లో ప్రాథమిక నివేదిక ఇవ్వాలి. డివిజన్ స్థాయి త్రీమెన్ కమిటి సిఫార్సు మేరకు నిర్దేశిత గడువులోగా పరిహారం అందించేలా జిల్లా ఉన్నతాధికారులు వ్యవసాయ శాఖకు నివేదిక సమర్పించాలి’ అనే విధానాన్ని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది.
ఈ మేరకు కూటమి ప్రభుత్వంలో రైతు ఆత్మహత్య తర్వాత బాధితులను కలెక్టర్, ఎమ్మెల్యే పరామర్శించిన పాపాన పోలేదు. తుది నివేదిక రూపకల్పనలో ప్రభుత్వ ఒత్తిళ్లు బలంగా పని చేస్తున్నాయి. సాగు కోసం చేసిన అప్పులు తీర్చలేక పొలంలోనే పురుగుల మందుతాగి ఆత్మహత్యలకు పాల్పడినా సరే, వ్యక్తిగత కారణాలతోనే చనిపోతున్నారంటూ నివేదికలు ప్రభుత్వం వద్దకు వెళ్తున్నాయి. బాధిత కుటుంబాలు స్పందనలో అర్జీలు ఇచ్చినా స్పందించడం లేదు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు లేవనే సాకుతో అన్యాయం చేస్తున్నారు.
2019–24 మధ్య ఆదుకున్న ప్రభుత్వం
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చీ రాగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచింది. కారణాలు ఏమైనా సరే ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలను పార్టీలు, ప్రాంతాలు, కులమతాలకతీతంగా ఆదుకుంది. 2014–19 మధ్య ఆత్మహత్య చేసుకున్న రైతు ఘటనలకు సంబంధించి కూడా రీ వెరిఫికేషన్‌లో 474 మంది అర్హత పొందగా, వారికి పరిహారం అందజేసింది.
ఈ విధంగా ఐదేళ్లలో 1,794 మందికి రూ.116.10 కోట్ల ఎక్స్‌గ్రేషియా జమ చేసింది. ఇందులో 495 మందిక కౌలు రైతులున్నారు. ఊరూరా ఆర్బీకేల ఏర్పాటు ద్వారా విత్తు నుంచి పంట కొనుగోలు వరకు రైతులను చేయి పట్టుకుని నడిపించింది. ఉచిత పంటల బీమా ద్వారా అండగా నిలిచింది. ఏటా వైఎస్సార్ రైతు భరోసా ద్వారా రూ.13,500 చొప్పున సాయం అందించింది.
రూ.12,563 కోట్లు ఎగ్గొట్టిన కూటమి సర్కారు
అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామంటూ సూపర్ సిక్స్‌లో ఇచ్చిన హామీని చంద్రబాబు ప్రభుత్వం అటకెక్కించింది. వైయస్ఆర్ రైతు భరోసా కింద గత ఐదేళ్లలో లబ్ధి పొందిన 53.58 లక్షల మందికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించాలంటే ఏటా రూ.10,718 కోట్లు అవసరం. ఇప్పటికీ దాని ఊసే ఎత్తడం లేదు.
2023–24 సీజన్‌కు రూ.930 కోట్ల రైతుల వాటా ప్రీమియం సొమ్ము చెల్లించక పోవడం వల్ల ఆ సీజన్‌లో కరువు వల్ల పంటలు దెబ్బ తిన్న దాదాపు 11 లక్షల మంది రైతులకు రూ.1,385 కోట్ల బీమా పరిహారం అందకుండా పోయింది. రబీ సీజన్ నుంచి స్వచ్ఛంద నమోదు పద్ధతిలో పంటల బీమా అమలు చేస్తుండడంతో బీమా ప్రీమియం భరించలేక రైతులు పంటల బీమాకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది.
ఖరీఫ్‌తోపాటు రబీ 2023–24 సీజన్‌లో కరువు ప్రభావంతో దెబ్బతిన్న 3.91 లక్షల మంది రైతులకు రూ.328 కోట్ల కరువు సాయం బకాయిలు ఎగ్గొట్టారు. సున్నా వడ్డీ రాయితీ కింద ఖరీఫ్ 2023 సీజన్‌కు సంబంధించి 6.31 లక్షల మందికి రూ.132 కోట్ల వరకు జమ చేయలేదు. ఇలా ఆరున్నర నెలల్లో అన్నదాత సుఖీభవ, పంటల బీమా, కరువు సాయం బకాయిలు, సున్నా వడ్డీ రాయితీలు కలిపి రైతులకు ఈ ప్రభుత్వం రూ.12,563 కోట్లు ఎగ్గొట్టింది.
పెద్దదిక్కు కోల్పోయి రోడ్డున పడ్డారు..
నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం రహిమానుపురానికి చెందిన సలీంద్ర మధు (35) సొంతంగా 1.50 ఎకరాలు, మరో 2 ఎకరాలు కౌలుకు తీసుకొని కంది, పత్తి, టమాటా, మిరప, ఉల్లి పంటలు సాగు చేసేవాడు. వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ ఏడాది కలిసి రాలేదు. సాగు కోసం రూ.5 లక్షల వరకు అప్పులు చేశాడు. వీటిని తీర్చే దారిలేక గత నెల 16న ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మధు మృతితో అతని భార్య సంధ్యాదేవి కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. ప్రభుత్వం నుంచి పైసా పరిహారం కూడా అందలేదని, ఏం చేయాలో పాలుపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది.
పరిహారం కోసం ఎదురు చూపు
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం సిద్ధినాయునిపల్లికి చెందిన రుద్రపాటి చిన్న వెంకట చన్నయ్య (70) 30 ఏళ్లుగా వ్యవసాయం చేసేవాడు. సొంతంగా ఆరెకరాలు, కౌలుకు 2 ఎకరాలు తీసుకొని టమాటా, పొగాకు సాగు చేశాడు. అప్పులు చేసి మూడు బోర్లు వేసినా నీరందక అవస్థలు పడ్డాడు.
సకాలంలో వర్షాలు కురవక పోవడంతో పాటు చీడపీడలు కారణంగా పంటలు దెబ్బతినగా, పెట్టుబడులు కూడా దక్కలేదు. రూ.9 లక్షలకుపైగా చేసిన అప్పులు తీర్చే దారిలేక గత నెల 8న సొంత పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. త్రీమెన్ కమిటీ విచారణలో కూడా ఇదే విషయం నిర్ధారణ అయింది. అయినా పరిహారం ఇవ్వ లేదంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
అప్పులోళ్ల ఒత్తిళ్లు భరించలేక..
పల్నాడు జిల్లా వెల్దురికి చెందిన పల్లపోలు వేణుగోపాల రెడ్డి (68) 1.50 ఎకరాలు కౌలుకు తీసుకొని పదేళ్లుగా వ్యవసాయం చేస్తున్నాడు. ఈ ఏడాది అధిక వర్షాల కారణంగా పంటలు దెబ్బ తిన్నాయి. సాగు కోసం చేసిన అప్పులు రూ.20 లక్షల వరకు చేరుకున్నాయి. వాటిని తీర్చే దారిలేక, అప్పులోళ్ల ఒత్తిళ్లు భరించలేక గత నెల 22న ఇంట్లోనే ఉరి పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భర్త చనిపోవడంతో తామంతా రోడ్డున పడ్డామని, తమకు ఆసరా లేకుండాపోయిందని, పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కూలి పనికి వెళ్తోన్న భార్య లక్ష్మి వేడుకుంటోంది.
స్వాతంత్య్రం వచ్చిన రోజే..
కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం పందిర్లపల్లెకు చెందిన మహిళా రైతు మాదిగ సువర్ణ (39) తన 7 ఎకరాల భూమిలో ఆముదం, మిరప పంటలు సాగు చేసింది. వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు దెబ్బతిన్నాయి. చేసిన అప్పులు రూ.8 లక్షలకు పైగా ఉన్నాయి. వాటిని తీర్చే దారిలేక స్వాతంత్య్ర దినోత్సవం రోజైన ఆగస్టు 15న పొలంలోనే బావి వద్ద పురుగుల మందు తాగి తనువు చాలించింది. కుటుంబానికి జీవనాధారమైన సువర్ణ అర్ధాంతరంగా చనిపోవడంతో తనకున్న ముగ్గురు కుమార్తెలు, కుమారుడ్ని పోషించుకునే దారిలేక అనారోగ్యంతో బాధ పడుతున్న భర్త పాండు కన్నీటి పర్యంతమవుతున్నాడు.
30 ఏళ్లకే తనువు చాలించి..
అనంతపురం జిల్లా కాలువపల్లికి చెందిన యువ రైతు ఎర్రిస్వామి(30) అప్పుల బాధతో జూన్ 17న ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న ఐదెకరాల్లో సాగు కోసం అప్పులు చేసి మరీ బోరుబావులు తవ్వించాడు. నీరు పడలేదు. మరో ఐదెకరాలు కౌలుకు తీసుకొని కర్బుజా, టమాటా పంటలు సాగు చేశాడు. వర్షాభావ పరిస్థితులతో కలిసి రాలేదు. అప్పులు రూ.25 లక్షలు తీర్చే దారిలేక పొలం వద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు ఇలా 30 ఏళ్లకే మృత్యువాత పడడంతో తల్లి లక్ష్మిదేవి, భార్య ప్రియాంకలు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే తమ గతేమిటని ప్రశ్నిస్తున్నారు.