Best Web Hosting Provider In India 2024
మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఫైర్
6 నెలల్లోనే రూ.1,12,750 కోట్ల అప్పులు
రాష్ట్ర చరిత్రలో కూటమి ప్రభుత్వం రికార్డ్
రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిన విజనరీ చంద్రబాబు
విజన్–2047 డాక్యుమెంట్ పేరుతో నానా హంగామా
మరోసారి మ్యానిఫెస్టో అమలుకు మంగళం
మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆక్షేపణ
‘సూపర్ సిక్స్’ ఊసే ఎత్తని సీఎం చంద్రబాబు
కానీ అట్టహాసంగా 23 ఏళ్ల విజన్ డాక్యుమెంట్
మళ్లీ మోసపూరిత హామీలు. వంచిస్తున్న చంద్రబాబు
అడ్డగోల హామీలతో ప్రజలను నమ్మించడం
అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కటీ విస్మరించడం
అదే చంద్రబాబు అలవాటు. నిరంతర ప్రక్రియ
మ్యానిఫెస్టోను చిత్తశుద్ధితో అమలు చేసిన ఘనత మాది
మాజీ మంత్రి బుగ్గన స్పష్టీకరణ
2014లో ఆంధ్రప్రదేశ్ అప్పులు రూ.1,32,079 కోట్లు
2019 నాటికి రూ.3,13,018 కోట్లకు చేరుకున్న అప్పులు
చంద్రబాబు హయాంలో 19.54 శాతం పెరిగిన అప్పు
అదే 2024 నాటికి రాష్ట్ర అప్పులు రూ.6,46,531 కోట్లు
అంటే మా హయాంలో 15.61 శాతమే పెరుగుదల
మరి ఎవరిది విజనరీ పాలన? ఎవరిది విధ్వంస పాలన?
ప్రెస్‌మీట్‌లో గణాంకాలతో సహా ఎండగట్టిన బుగ్గన
హైదరాబాద్: విజన్ అంటే అప్పులు చేయడమేనా అని వైయస్ఆర్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. అప్పుల్లో కూటమి ప్రభుత్వం దూసుకుపోతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర చరిత్రలోనే ఇప్పటి వరకు ఎవరూ చేయని విధంగా కేవలం ఆరు నెలల కాలంలోనే ఏకంగా రూ.1,12,750 కోట్ల అప్పులతో టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక సరికొత్త రికార్డ్ సృష్టించిందని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి చురకలంటించారు. ఆర్థిక సంవత్సరం ముగింపునకు ఇంకా 3 నెలలున్నప్పటికీ ఇన్ని కోట్ల అప్పులు చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని ఆయన గుర్తు చేశారు. గత వైయస్సార్‌సీపీ పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని, వినాశనం చూశామంటున్న కూటమి పాలకులు, ఇప్పుడు తాము చేస్తున్న నిజమైన విధ్వంసాన్ని ఎలా సమర్థించుకుంటారని నిలదీశారు. ఆదివారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
అర్థం కాని పరిస్థితి:
అలవి కాని హమీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారం దక్కించుకున్న కూటమి ప్రభుత్వం, వైయస్సార్‌సీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిందని పదే పదే ఆరోపణలు చేస్తోంది. తమ అనుకూల ఎల్లో మీడియా గత మా ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తోంది. మా హయాంలో రూ.14 లక్షల కోట్ల అప్పులు చేశామని పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారు. కానీ, ఈ ఆరునెలల పాలనలో కూటమి ప్రభుత్వం చేసిన అప్పులు, రుణాల కోసం కుదుర్చుకున్న ఒప్పందాలు, కమిట్‌మెంట్స్ చూస్తే రాష్ట్రాన్ని ఎటు తీసుకుపోతున్నారో అర్థం కాని పరిస్థితి.
ప్రతి నెలా అప్పులే. అయినా ఎల్లో మీడియా పలకదు:
కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రతి నెలా అప్పులే. అధికారం చేపట్టిన రెండు వారాల్లోనే జూన్ 24న రూ.6 వేల కోట్లు, జూలై 24న రూ.10 వేల కోట్లు, ఆగస్టులో రూ.3 వేల కోట్లు, సెప్టెంబరులో రూ.4 వేల కోట్లు, అక్టోబరులో రూ.6 వేల కోట్లు, నవంబరులో రూ.4 వేల కోట్లు, డిసెంబరులో రూ.9,237 కోట్ల అప్ప చేశారు. మా హయాంలో ప్రతిరోజూ రాష్ట్రం దివాలా తీస్తోందంటూ ఎల్లో మీడియా పెద్ద ఎత్తున కథనాలు రాసింది. మరి ఇప్పుడ కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పులు వారికి కనిపించడం లేదా? ఆనాడు రాష్ట్రం శ్రీలంక అయిపోతోందంటూ రాశారు. మరి ఈ అప్పులపై ఎలా స్పందిస్తారు?.
ప్రభుత్వ గ్యారెంటీ రుణాలు:
అదే కాకుండా ప్రభుత్వ గ్యారెంటీతో ఈనెల 20న ఏపీ మార్క్‌ఫెడ్, ఎన్సీడీసీ ద్వారా రూ.1000 కోట్లు, అదే మార్క్‌ఫెడ్ అదే ఎన్సీడీసీ ద్వారా ఈనెల 26న మరో రూ.1800 కోట్లు, జూలై 19న రూ.3200 కోట్లతో పాటు, వివిధ బ్యాంక్‌ల నుంచి పౌర సరఫరాల సంస్థ పేరుతో జూన్ 28న రూ.2 వేల కోట్ల అప్పు చేయగా, ఇప్పుడు ఏపీ ఎండీసీ ద్వారా మరో రూ.5 వేల కోట్లు.. అన్నీ కలిపి రూ.13 వేల కోట్ల అప్పు చేశారు.
రాజధాని కోసం రూ.31 వేల కోట్ల అప్పు:
వాటితో పాటు, రాజధాని అమరావతి నిర్మాణం కోసం వరల్డ్ బ్యాంక్ ద్వారా రూ.15 వేల కోట్లు అప్పు తీసుకుంటున్నారు. ఇంకా హడ్కో ద్వారా రూ.11 వేల కోట్లు, జర్మన్ బ్యాంక్ ద్వారా మరో రూ.5 వేల కోట్లు తీసుకునేందుకు సిద్దంగా ఉన్నారు. అంటే అన్నీ కలిపి రాజధాని కోసం రూ.31 వేల కోట్ల అప్పు చేస్తున్నారు.
ఈ మూడు కేటగిరిల్లో కలిపి రాష్ట్ర మొత్తం అప్పు రూ.1,12,750 కోట్లు. అంత తక్కువ వ్యవధిలో ఇంత ఎక్కువ అప్పు చేసిన ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కుతుంది. ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా మూడు నెలలు సమయం ఉంది. బడ్జెట్ పక్కన పెడితే గ్యారెంటీలు, నాన్ గ్యారెంటీల ద్వారా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ ఎంత ఉంటుందో ఏప్రిల్‌లో తేలుతుంది. కాగా, బడ్జెట్‌లో ద్రవ్యలోటును రూ.68,742 కోట్లుగా చూపింది.
మా హయాంలోనే తక్కువ:
మా ప్రభుత్వం దిగిపోయేనాటికి రాష్ట్ర అప్పు రూ.7,21,918 కోట్లు అని కూటమి ప్రభుత్వం తేల్చింది. అందులో రూ.3,90,247 కోట్లు అంతకు ముందు టీడీపీ ప్రభుత్వం 2014–19 మధ్య చేసిన అప్పు. అంటే మా ప్రభుత్వం చేసిన అప్పు 3 లక్షల కోట్ల చిల్లర మాత్రమే. చంద్రబాబు హయాంలో సగటు అప్పుల శాతం 22.6 కాగా, కోవిడ్ సమయాన్ని కూడా కలుపుకున్నా, మా హయాంలో సగటు అప్పుల శాతం 13.5 మాత్రమే. మరి ఎవరిది వి«ధ్వంస పాలన?.
విజన్ డాక్యుమెంట్లతో చంద్రబాబు గారడీ:
తాను సీఎంగా ఉన్న ప్రతిసారి విజన్ డాక్యుమెంట్ల ఆవిష్కరణ ద్వారా తానో పెద్ద విజనరీ అని చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. గతంలో 1998, 2014లో.. ఇప్పుడు 2024లో. ప్రతిసారీ ఆ డాక్యుమెంట్లకు ఘనమైన పేర్లను, పెద్ద ఎత్తున తన అనుకూల మీడియాతో ప్రచారం చేయించుకోవడం చంద్రబాబుకు అలవాటు. తాజాగా విడుదల చేసిన విజన్–2047 డాక్యుమెంట్లో వెల్తీ, హెల్తీ, అండ్ హ్యాపీ ఆంధ్రా అని పేరు పెట్టుకున్నారు. ఈ లక్ష్యాల సాధనకు పది సూత్రాలు, పన్నెండు మార్గాలను అనుసరిస్తామని ప్రకటించుకున్నారు.
అంతకు ముందు 1998లో ప్రకటించిన విజన్–2020 డాక్యుమెంట్‌లోనూ 19 గ్రోత్ ఇంజన్లను ప్రస్తావించారు. అలాగే 2014లో ప్రకటించిన సన్ రైజ్ ఆంధ్రా రోలింగ్ ప్లాన్‌లో ఏడు మిషన్లు, అయిదు గ్రిడ్‌లు, అయిదు క్యాంపెయిన్ల ద్వారా లక్ష్యాలను సాధిస్తానని ప్రకటించారు. ఈ మూడు విజన్లకు ముందు ‘మనసులో మాట’ అనే పుస్తకంలో ఆయన ఆలోచనలను వెల్లడించారు. ఈ ఆలోచనల నుంచే ఈ విజన్లు వచ్చాయి. మరి ఆ విజన్లలో ఏ ఒక్క లక్ష్యాన్ని అయినా సాధించారా? కేవలం తనను తాను గొప్పగా చూపించుకోవడానికే ఈ ప్రచార హంగామా తప్ప, ఇందులో అమలులోకి వచ్చిన అంశాలు ఒక్కటైనా ఉన్నాయా?.
మ్యానిఫెస్టో బాబుకు చిత్తు కాగితం:
వాస్తవానికి ఎన్నికల సమయంలో ప్రజల ముందు పెట్టే మేనిఫేస్టోనే ఏ పార్టీకైనా వారి విజన్ అవుతుంది. ప్రజలు కూడా మేనిఫేస్టోను చూసి, విశ్వసనీతయను చూసి ఓటేస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం తన మేనిఫేస్టోను విజన్‌గా భావించడం లేదు. అందుకే ప్రతిసారీ ఇరవై ఏళ్ళ లక్ష్యాలతో డాక్యుమెంట్లను ప్రకటిస్తున్నారు.
చంద్రబాబు తాజా మ్యానిఫెస్టోలో సూపర్ సిక్స్ హామీలు. దానిలో బాబు ష్యూరిటీ.. భవిష్యత్త్ గ్యారెంటీ అని ప్రకటించారు. కూటమి పార్టీలు దీనితో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజలకు హామీలు ఇచ్చి వారిని నమ్మించారు. ఇంట్లో కూర్చున్నా కూడా ఈ గ్యారెంటీలు వస్తాయని నమ్మి ప్రజలు ఓట్లు వేశారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయింది. మరి ఈ మేనిఫేస్టో అమలును ఏం చేస్తున్నారు?.
ఆ హామీలన్నీ ఏమయ్యాయి?:
మేనిఫేస్టోలో ప్రకటించినట్లు యువతకు యువగళం– ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అని ప్రకటించారు. రాష్ట్రంలో ఎవరికైనా ఇది అమలు చేశారా? తల్లికి వందనం పేరుతో స్కూల్‌కు వెళ్ళే ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామన్నారు. దీన్నే ’నీకు పదిహేను.. నీకు పదిహేను’ అని ప్రచారం చేసుకున్నారు. అన్నదాత– సుఖీభవ అన్నారు. రైతులకు ఇరవై వేలు ఇస్తామన్నారు. ఎవరికైనా ఇచ్చారా? దీపం కింద ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలెండర్లు ఇస్తామన్నారు. కానీ వారు అమలు చేసింది పావుదీపం, అంటే ఒక్క సిలెండర్ మాత్రమే ఇచ్చారు. ఆడబిడ్డకు నిధి పేరుతో ఏడాదికి రూ.18 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు దీనిపై మాట్లాడే పరిస్థితే లేదు. ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. ఎవరికైనా ఇది వచ్చిందా? కనీసం ఈ హామీల అమలుకు బడ్జెట్ ఏమైనా కేటాయింపులు చేశారా అంటే అదీ లేదు.
‘సూపర్ సిక్స్’ కు ఏదీ కేటాయింపు?:
తల్లికి వందనం కింద 83 లక్షల మంది పిల్లలకు రూ.15 వేల చొప్పున మొత్తం రూ.12,450 కోట్లు కావాల్సి ఉంది. కానీ ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించింది మాత్రం రూ.5386 కోట్లు మాత్రమే. అంటే తల్లికి వందనం ఈ ఏడాది లేనట్టే. ఇంతకు ముందు మా ప్రభుత్వంలో అమ్మ ఒడి కింద బడికి వెళ్ళే పిల్లలు ఉన్న తల్లికి రూ.15 వేలు ఇచ్చాం. దీపం పథకం కింద 1.49 కోట్ల మంది అర్హులైన వారు ఉన్నారు. దీనికి గానూ రూ.3,955 కోట్లు అవసరం కాగా రూ.895 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే ఒక సిలెండర్‌కే పరిమితం చేశారు. ఆడబిడ్డ నిధి కింద 2,07,29,444 మంది మహిళలకు లబ్ధి చేయాల్సి ఉంది. దీనికి గానూ రూ.37,313 కోట్లు అవసరం కాగా, ఈ ఏడాది ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. అన్నదాత సుఖీభవ కింద 53.53 లక్షల రైతులు ఉండగా వీరికి రూ.10,706 కోట్లు అవసరం. కానీ బడ్జెట్‌లో కేవలం రూ.1000 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే ఈ పథకం కూడా ఈ ఏడాది లేనట్లే. ఉచిత బస్సు ప్రయాణం కింద సుమారుగా రూ.2500 కోట్లు అవసరం ఉంటుంది. దీనికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. యువగళం కింద ప్రతి నిరుద్యోగికి రూ.3 వేల చొప్పున సుమారు రూ.7,200 కోట్లు అవసరం ఉంటుంది. కానీ ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. సంక్షేమ పెన్షన్ల పథకాల వయస్సును 60 నుంచి 58 ఏళ్ళకు తగ్గిస్తానన్నారు. దీనికి గానూ రూ.12,900 కోట్లు అవసరం ఉంటుంది. 26,00,087 మందికి ఇది వర్తింప చేయాల్సి ఉంటుంది. దీనిపైనా ఎటువంటి స్పందన లేదు.
ప్రశ్నిస్తానన్నారు. నోరు మెదపడం లేదు:
రైతులకు సంబంధించి గతంలో దాదాపు రూ.1200 కోట్లు ఉచితంగా పంటల భీమాకు ప్రభుత్వం చెల్లించేది. దానికి కూటమి ప్రభుత్వం మంగళం పాడింది. ఈ వాగ్ధానాలు కూటమి పార్టీలు ఇచ్చాయి. ఇదే కూటమిలోని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను అని చెప్పారు. మరి సూపర్ సిక్స్ హామీలపై ఎందుకు ఆయన నోరు మెదపడం లేదు? ఇదే కూటమిలోని బిజెని ఈ హామీలపై ఏం మాట్లాడటం లేదు. ఈ హామీల ప్రకటన సమయంలోనూ వారు పక్కకు వెళ్లిపోయారు. ఇప్పుడు వారు దీనిపై పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
ఆనాడూ హామీలు విస్మరించిన టీడీపీ:
ఇంతకు ముందు సన్ రైజ్ విజన్ సమయంలోనూ టీడీపీ మేనిఫేస్టో రిలీజ్ చేసింది. అప్పుడు అన్ని వ్యవసాయ రుణాల మాఫీ అని హామీ ఇచ్చారు. రుణమాఫీకి రూ.87,612 కోట్లు కావాల్సి ఉండగా, కేవలం రూ.15 వేల కోట్లు మాత్రమే విడుదల చేశారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పేరుతో రైతులకు రుణమాఫీని ఎగ్గొట్టే ప్రయత్నం చేశారు. అలాగే రైతుల రుణ పరపతిని తగ్గించేశారు. పైగా రుణమాఫీ చేసేశామని చెప్పుకున్నారు. రైతులకు సున్నా వడ్డీ రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు. రూ.11,500 కోట్లు రైతులకు అవసరం ఉండగా, కేవలం రూ.630 కోట్లు మాత్రమే ఇచ్చారు. అంటే ఈ పథకాన్ని నిర్వీర్యం చేశారు. స్వామినాథన్ వ్యవసాయ నివేదికను అమలు చేస్తామని, అలాగే రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ కేవలం రూ.500 కోట్లు మాత్రం అధికారం నుంచి దిగిపోయేప్పుడు నామమాత్రంగా కేటాయించారు.
బ్యాంకుల్లో కుదువ పెట్టిన మహిళల బంగారాన్ని ఇంటికి తెప్పిస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో ఒక్కరిదైనా కుదవ పెట్టిన బంగారం ఇంటికి వచ్చిందా? డ్వాక్రా రుణాల మాఫీ అని హామీ ఇచ్చారు. ఆనాటికి రూ.21,500 కోట్లు ఉంటే ఒక్క రూపాయి ఇవ్వలేదు. బెల్ట్ షాప్‌లు రద్దు అన్నారు. విచ్చలవిడిగా బెల్ట్ షాప్‌లు నడిపించారు. ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు. కళాశాల విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు అన్నారు. గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్ అన్నారు. ఎన్ని ఇళ్లు కట్టారు?
ఇంకా ప్రతి నియోజకవర్గంలో వృధ్ధాశ్రమాలు అన్నారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా రక్షిత మంచినీటి సరఫరా. రెండు రూపాయలకే ఇరవై లీటర్ల మంచినీరు ఇంటింటికి ఇస్తామని అన్నారు. కాపులకు అయిదేళ్ళలో అయిదు వేల కోట్లు ఇస్తామన్నారు. కానీ ఇచ్చింది రూ.1340 కోట్లు మాత్రమే. చేనేత రుణాలు, పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నారు. ఎన్నికల సమయంలో రూ.111 కోట్లు ఇచ్చారు. నిరుద్యోగ యువతకు రూ.వెయ్యి నుంచి రెండు వేలు నిరుద్యోగ భృతి అన్నారు. పుట్టిన ప్రతి ఆడబిడ్డకు మహాలక్ష్మి అంటూ రూ.25 వేలు ఇస్తామని అన్నారు. ఒక్కరికి కూడా అమలు చేయలేదు.
ఈరోజు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులకు రూ.3 వేల కోట్లు బకాయి పడ్డారు. దీంతో ఆ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ చికిత్సలు చేయడం లేదు. ఫీజు రీయింబర్స్ మెంట్ ఏడాది నుంచి రూ.2800 కోట్లు పెండింగ్ ఉంది.
మ్యానిఫెస్టోను పవిత్ర గ్రంథంగా చూశాం:
వైయస్సార్‌సీపీ ఏనాడు పెద్ద పెద్ద వాగ్ధానాలు చేయలేదు. 5ఏళ్ల పాలనలో మేనిఫేస్టోనే మాకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని చెప్పాం. అలాగే అమలు చేశాం. మా హయాంలో జగనన్న అమ్మ ఒడి కింద 45 లక్షల మంది తల్లులకు ప్రతి ఏటా రూ.15 వేల చొప్పున ఇచ్చాం. జగనన్న విద్యాదీవెన కింద 27 లక్షల మంది విద్యార్ధులకు, వైయస్‌ఆర్ రైతు భరోసా కింద 53.53 లక్షల మంది రైతులకు, 66 లక్షల మందికి పెన్షన్ కానుక, చేయూత కింద 46.50 లక్షల మంది మహిళలకు ప్రతి ఏటా రూ.75 వేలు, వైయస్‌ఆర్ ఆసరా కింద 79 వేల మంది అక్కచెల్లెమ్మలకు రూ.27 వేల కోట్ల లబ్ధి చేకూర్చాం. 21 లక్షల మంది ఇళ్ళు లేని వారికి పక్కా ఇళ్లు నిర్మించే పనులు ప్రారంభించాం.
జగనన్న వసతి దీవెన, వైయస్‌ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు, ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లింపు, ఉచిత పంటల బీమా, మత్స్యకార భరోసా, వైయస్‌ఆర్ బీమా, కాపునేస్తం, నేతన్న నేస్తం, జగనన్న చేదోడు, వాహనమిత్ర, అగ్రిగోల్డ్, అర్చకులు, మౌసమ్‌లకు గౌరవ భృతి, కళ్యాణమస్తు ఇలా అనేక పథకాలను సకాలంలో అమలు చేశాం. డీబీటీ ద్వారా రూ.2,73 లక్షల కోట్లు పేదల ఖాతాల్లో నేరుగా జమ చేశాం. ఇంకా జగనన్న తోడు, గోరుముద్ద, విద్యాకానుక, వైయస్సార్ కంటివెలుగు తదితర పథకాలకు రూ.1.70 లక్షల కోట్లు నాన్ డీబీటీ కింద ఇచ్చాం. మొత్తం కలిపి దాదాపు రూ.4.2 లక్షల కోట్లు ప్రజలకు ఇచ్చాం.
నా ఇంటి పేరున్నంత మాత్రాన బంధువులవుతారా?
రేషన్ బియ్యం అక్రమ రవాణాలో తన బంధువులున్నారంటూ, ఎల్లో మీడియాలో వచ్చిన కథనంపై మీడియా ప్రశ్నించగా, బుగ్గన ఘాటుగా స్పందించారు?
‘కేవలం నా ఇంటి పేరున్నంత మాత్రాన, వారు నా బంధువులవుతారా? ఆ ఇంటి పేరుతో మూడు, నాలుగు జిల్లాల్లో కుటుంబాలు ఉన్నాయి. వారెవరూ నాకు బంధువులు కారు. కేవలం నాపై బురద చల్లడానికి మాత్రమే ఎల్లో మీడియా మరోసారి గతి తప్పి, విషపు రాతలు రాస్తోంది. నేను కానీ, నా బంధువులెవరూ కానీ, రేషన్ బియ్యం అమ్ముకోలేదు. మేము ఆ తప్పుడు పని చేయబోము’.. అని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు.