ఆరోగ్యశ్రీకి సుస్తీ!

Best Web Hosting Provider In India 2024

జనవరి 6 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్‌!
 
రూ.3 వేల కోట్ల బిల్లులను ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది 

ఎన్నిసార్లు అడిగినా పరిష్కరించట్లేదు 

ఆస్పత్రుల నిర్వహణ కష్టంగా మారింది.. తక్షణమే రూ.2 వేల కోట్ల బిల్లులు చెల్లించండి 

మిగిలిన మొత్తాన్ని నిర్దిష్ట కాలపరిమితిలోపు చెల్లిస్తామని హామీ ఇవ్వాలి.. లేకపోతే ఉచిత వైద్య సేవలు నిలిపివేస్తాం 

వైద్య సేవా ట్రస్ట్‌ సీఈవోకు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ హెచ్చరిక

అమరావతి: అనారోగ్యం బారిన పడ్డవారికి చికిత్స అందించాల్సిన ఆరోగ్యశ్రీ పథకానికే ఆంధ్రప్రదేశ్‌లో సుస్తీ చేసింది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు బకాయిలను విడుదల చేయకపోవడంతో నెట్‌వర్క్‌ ఆస్పత్రులు పలుమార్లు చికిత్సలను ఆపేస్తున్నాయి. డబ్బులు చెల్లిస్తేనే సేవలు అందించగలమని స్పష్టంచేస్తున్నాయి. నిత్యం ఈ తతంగంతో ఆస్పత్రులు రోగుల నుంచే ఖర్చును లాగేస్తున్నాయి. ఫలితంగా పథకం ఉండీ ఉపయోగం లేకుండా పోతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

పెండింగ్‌లో రూ.3 వేల కోట్లు

 ‘ఆరోగ్య శ్రీ(ఎన్టీఆర్‌ వైద్య సేవ) పథకం కింద ప్రజలకు అందించిన వైద్య సేవలకు గాను చెల్లించాల్సిన రూ.3 వేల కోట్ల బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. దీనివల్ల ఆస్పత్రుల నిర్వహణ కష్టంగా మారింది. ప్రభుత్వం తక్షణమే కనీసం రూ.2 వేల కోట్ల బిల్లులైనా చెల్లించకపోతే జనవరి ఆరో తేదీ నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తాం’ అని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ సోమవారం ఎన్టీఆర్‌ వైద్య సేవా ట్రస్ట్‌ సీఈవోకు లేఖ రాసింది. పెద్ద ఎత్తున బిల్లులు నిలిచిపోవడం వల్ల ఆస్పత్రులకు మందులు, ఇతర పరికరాలు సరఫరా చేసిన వారికి చెల్లింపులు జరపలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో విక్రేతలు నోటీసులు జారీ చేసి.. సరఫరాలను నిలిపివేశారని తెలిపింది.

సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేని దుస్థితి

ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉన్నామని వాపోయింది. ఈ సమస్యలను గత మూడు నెలల్లో ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇటీవల వైద్య శాఖపై సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో సైతం పెండింగ్‌ బిల్లులకు నిధులు మంజూరుతో పాటు సకాలంలో బిల్లుల చెల్లింపునకు ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో తామెంతో నిరుత్సాహానికి గురయ్యామని పేర్కొంది. పెండింగ్‌ బిల్లులను పరిష్కరిస్తే తప్ప.. ఆస్పత్రులు కోలుకోలేవని స్పష్టం చేసింది.

రూ.2 వేల కోట్ల బిల్లులను తక్షణమే విడుదల చేయాలి
 ప్రస్తుత ప్యాకేజీ ధరలను శాస్త్రీయంగా పునఃమూల్యాంకనం చేయాలని కోరింది. రూ.2 వేల కోట్ల బిల్లులను తక్షణమే విడుదల చేసి.. మిగిలిన బిల్లులను నిర్దిష్ట కాలపరిమితిలోపు ఇస్తామని హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. గ్రీన్‌చానల్‌లో ప్రతి నెలా పెన్షన్‌లు, జీతాలతో పాటు ఆరోగ్య శ్రీ బిల్లులను కూడా క్రమబద్ధంగా చెల్లించాలని.. ఇందుకోసం చట్టబద్ధమైన చెల్లింపుల షెడ్యూల్‌లోకి చేర్చాలని కోరింది.

Best Web Hosting Provider In India 2024