Best Web Hosting Provider In India 2024
విజయవాడ: ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి పేర్నినానికి ఊరట దక్కింది. పేర్నినాని దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా సోమవారం వరకు పేర్నినానిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి పేర్నినాని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. పౌరసరఫరాల సంస్థకు సంబంధించిన కేసులో పేర్ని నానిని ఏ6గా మచిలీపట్నం పోలీసులు చేర్చారు.
పేర్ని నాని పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. పేర్ని నాని కుటుంబమే లక్ష్యంగా అక్రమ కేసులు పెడుతోంది. రికవరీ మొత్తం చెల్లించినా వదలకుండా వేధింపుల పర్వానికి తెరతీసింది. పేర్ని నాని సతీమణి జయసుధకు ముందస్తు బెయిల్ రాగానే మరోసారి నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే కోటి 68 లక్షలు పేర్ని నాని కుటుంబం చెల్లించింది. మరో కోటి 67 లక్షలు రికవరీ చెల్లించాలంటూ జయసుధకు కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ నోటీసులు పంపించారు. జయసుధకు ముందస్తు బెయిల్ రాగానే పేర్ని నానిని ఏ6గా కేసులో పోలీసులు చేర్చారు.
కాగా, ఈ కేసులో మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) సతీమణి జయసుధకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ మచిలీపట్నంలోని 9వ అదనపు జిల్లా కోర్టు జడ్జి ఎస్.సుజాత సోమవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా పేర్ని జయసుధ కేసులో మచిలీపట్నం రూరల్ పోలీసులు సోమవారం రాత్రి నలుగురి ని అరెస్టు చేశారు. గోడౌన్ మేనేజర్ మానస తేజ, సివిల్ సప్లయీస్ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, లారీ డ్రైవర్ మంగారావు, లారీ డ్రైవర్ స్నేహితుడు ఆంజనేయులును అరెస్టు చేశారు. వీరికి జడ్జీ 12 రోజులు రిమాండ్ విధించారు.