గోదావరి–బనకచర్ల అనుసంధానం వైయస్‌ జగన్‌ ఆలోచన

Best Web Hosting Provider In India 2024

 రూ.80 వేల కోట్లతో దీనిపై 2022లోనే ప్రతిపాదనలు సిద్దం

అనుమతి కోసం సీడబ్ల్యూసీకి డీపీఆర్‌ సమర్పించిన వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం

వైయ‌స్ జగన్ కృషిని నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకుంటున్న చంద్రబాబు

మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టీకరణ

తన ఆలోచనల నుంచి ఈ ప్రాజెక్ట్‌ రూపుదాల్చినట్లు చంద్రబాబు అబద్దపు ప్రచారం

గోదావరి జలహారతి అనే కొత్త పేరుతో ఇది తన ఘనతగా చాటుకునే ప్రయత్నం

 మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆక్షేపణ

సీఎం కాగానే జలయజ్ఞం ప్రాజెక్ట్‌లపై దృష్టి పెట్టిన శ్రీ వైయస్‌ జగన్‌

గోదావరి నుంచి వృథాగా పోతున్న 280 టీఎంసీలను కృష్ణాకు మళ్ళించేలా ప్రణాళిక

పల్నాడు, రాయలసీమ ప్రాంతాలకు సాగునీటిని అందించే గొప్ప పథకానికి నాంది

గోదావరి నుంచి బనకచర్ల వరకు మూడు దశల్లో నీరు తరలించేలా ప్రతిపాదనలు

దీనిపై కేంద్రంతో పలుసార్లు సంప్రదింపులు జరిపిన వైయస్సార్‌సీపీ ప్రభుత్వం

అన్ని అనుమతులతో ముందుకు రావాలని సూచించిన కేంద్రం 

అనుమతుల కోసం సీడబ్లు్యసీకి డీపీఆర్‌ సమర్పించి జగన్‌ ప్రభుత్వం

ఇప్పుడు ఆ ప్రతిపాదనలు తన ఆలోచనలే అంటూ చంద్రబాబు పచ్చి అబద్దాలు

రాష్ట్రంలో కరువును రూపుమాపే నాయకుడు అంటూ చంద్రబాబును ఆకాశానికి ఎత్తేసిన ఎల్లో మీడియా

చివరికి ఈ ప్రాజెక్ట్‌ను కూడా ప్రైవేటుపరం చేస్తున్న చంద్రబాబు

ప్రపంచంలోనే సాగునీటి ప్రాజెక్ట్‌లు ప్రైవేటుపరం చేసిన దాఖలా లేదు

రైతుల ఆశలను, కష్టాన్ని కూడా ప్రైవేటుపరం చేస్తున్న చంద్రబాబు

ప్రెస్‌మీట్‌లో చంద్రబాబు తీరు ఎండగట్టిన అంబటి రాంబాబు

తాడేపల్లి: వైయస్‌ జగన్‌ హయాంలో జరిగిన గోదావరి–బనకచర్ల ప్రాజెక్ట్‌ ప్రతిపాదనలను నిసిగ్గుగా తన ఆలోచనల నుంచి ఆవిష్కరించినట్లు సీఎం చంద్రబాబు చెప్పుకోవడం దారుణమని మాజీ మంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం 2022లోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రతిపాదనలను సీడబ్ల్యూసీకి సమర్పించిన విషయం సీఎం హోదాలో ఉన్న చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు. సీఎంగా వైయస్‌ జగన్‌ పల్నాడు, రాయలసీమ, వెలిగొండ, ప్రకాశం జిల్లాల సాగునీటి కష్టాల గురించి ఆలోచించి రూపొందించిన గోదావరి జిలాల మళ్లింపు ప్రతిపాదనలను నిస్సిగ్గుగా చంద్రబాబు తన ఖాతాలో వేసుకోవడం దుర్మార్గమని అంబటి అన్నారు.

‘జలయజ్ఞం’కు ఆద్యుడు స్వర్గీయ వైయస్‌ రాజశేఖరరెడ్డి:
    రైతుల కష్టాలు తెలిసిన నాయకుడుగా స్వర్గీయ వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఆనాడు లక్ష కోట్ల వ్యయంతో 86 ప్రాజెక్ట్‌ లను తీసుకువచ్చారు. కోటి ఎకరాలను కొత్తగా సాగులో తీసుకురావాలని 2004లో జలయజ్ఞంను ప్రారంభించారు. గాలేరీ–నగరీ, తోటపల్లి, హంద్రీనీవా, వెలుగొండ, వంశధార, పోలవరం తదితర ప్రాజెక్ట్‌ లను రైతుల కోసం, వ్యవసాయం, సాగునీటి కోసం పూర్తి చేయాలని ఆలోచనలు చేసిన మహనీయుడు డాక్టర్‌ వైయస్‌ఆర్‌. ఆయన హయాంలోనే దాదాపు 23 ప్రాజెక్ట్‌ లను పూర్తి చేశారు. సీఎంగా అధికారంలో ఉన్నప్పుడు ఏరోజు రైతుల గురించి, సాగునీటి ప్రాజెక్ట్‌ ల గురించి మాట్లాడని చంద్రబాబు, ఇప్పుడు జలయజ్ఞం ఆలోచన కూడా నాదే అంటున్నాడు. పోలవరం ప్రాజెక్ట్‌ ప్రధాతను కూడా తానే అని చెప్పుకోవడానికి వెనుకాడటం లేదు. 

అబద్దాల చంద్రబాబును ఆకాశానికెత్తిన ఎల్లో మీడియా:
    తాజాగా గత రెండు రోజుల నుంచి చంద్రబాబు గేమ్‌ ఛేంజర్‌ లాంటి ప్రాజెక్ట్‌ ను ఆవిష్కరించాడు అని ఆయనకు వంతపాడే ఎల్లో మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. రాష్ట్రానికి జలహారతి, గోదావరి–బనకచర్ల అద్భుతమైన ప్రాజెక్ట్, ఇది పూర్తయితే గేమ్‌ చేంజర్‌ గా మారి రాష్ట్రంలో కరువు కాటకాలు ఉండవూ అని చంద్రబాబు చెప్పిన విషయాలను విస్తృతంగా ప్రచారం చేస్తూ కథనాలు రాస్తున్నాయి. ఇక చంద్రబాబు గోదావరి–బనకచర్లను తానే కనిపెట్టినట్లు, ఇప్పుడు దానిని కార్యరూపంలోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించుకున్నాడు. ఎల్లో మీడియా కూడా ఇదే నిజం అని చంద్రబాబును ఆకాశానికి ఎత్తేస్తోంది. జలయజ్ఞం తన సొంతం అని ఎలా ప్రచారం చేసుకుంటున్నాడో, ఈరోజు గోదావరి–బనకచర్ల అనుసంధాన పథకం కూడా తన ఆలోచనల నుంచే వచ్చిందనే విషయాన్ని చంద్రబాబు ఎటువంటి మొహమాటం లేకుండా ప్రచారం చేసుకుంటున్నాడు. 

నాడు జలయజ్ఞానికి వైయ‌స్ జగన్‌ అధిక ప్రాధాన్యం:
    ఇటువంటి పచ్చి అబద్దాలతో కూడిన ప్రచారం చూసిన తరువాత రాష్ట్ర ప్రజలకు వాస్తవాలను తెలియచేయాలనే ఈరోజు మీడియా ముందుకు వచ్చాం. ఏ ప్రాజెక్ట్‌ అయినా ఈ రాష్ట్రంలో డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి, ఆ తరువాత ఆయన తనయుడు వైయస్‌ జగన్‌ ఆధికారంలోకి వచ్చిన తరువాతే కార్యరూపంలోకి వచ్చాయి. వారిరువురూ జలయజ్ఞాన్ని పూర్తి చేయాలని తాపత్రయపడ్డారు. వైయస్‌ జగన్‌ సీఎం అవ్వగానే గోదావరి ప్రాజెక్ట్‌లను పూర్తి చేయాలని, కృష్ణాజలాల పైనే పూర్తిగా ఆధారపడకూడదని భావించారు. దానిలో భాగంగా గోదావరి జలాల వినియోగంపై పోలవరంను సత్వరం పూర్తి చేసి, గోదావరి నీటిని కృష్ణాకు అనుసంధానం చేయాలన్న డాక్టర్‌ వైయస్‌ఆర్‌ ఆలోచనలను ముందుకు తీసుకువెళ్ళారు. ఇదే క్రమంలో వైయస్‌ జగన్, గోదావరిలో వృధాగా పోతున్న దాదాపు 2 వేల టీఎంసీల నీటి నుంచి కొంతమేర కృష్ణా డెల్టాకు, రాయలసీమకు వాడుకోవాలని భావించారు. ఇంకా గోదావరి – బనకచర్ల లింక్‌ను మూడు దశల్లో పూర్తి చేయాలని ఆలోచన చేసిన మొదటి వ్యక్తి వైయస్‌ జగన్‌. ఇది చంద్రబాబు ఘనత కాదు. ఇలాంటి ఆలోచనలు ఎవరికైనా వస్తే, దానిని తను సొంతం చేసుకోవాలనుకునే వ్యక్తి చంద్రబాబు.

280 టీఎంసీలు మళ్ళించేందుకు ప్రణాళిక:
    వైయస్‌ జగన్‌ సీఎంగా అధికారులతో సమీక్షలు చేసి గోదావరి నుంచి 280 టీఎంసీలను గోదావరి నుంచి కృష్ణా నదిలోకి మళ్ళించాలని ప్రతిపాదించారు. 17 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో కూడిన కాలువలు వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే దాదాపు 90 శాతం పూర్తి చేశారు. వాటిని నేడు ఎత్తిపోతల పథకం కింద వినియోగిస్తున్నారు. వీటిని మరింతగా పెంచి, అవసరమైతే సమాంతరంగా కాలువలను నిర్మించడం ద్వారా దాదాపు 40 వేల క్యూసెక్యుల నీటిని కృష్ణానదికి తీసుకురావాలని వైయస్‌ జగన్‌ ఆలోచన చేశారు. వైయస్‌ఆర్‌ ఈ కాలువల కోసం, భవిష్యత్తులో ఇంకా వెడల్పు చేయడం కోసం ఎక్కువగానే భూసేకరణను ముందుచూపుతో చేశారు. రోజుకు రెండు టీఎంసీల చొప్పున 280 టీఎంసీలను కృష్ణానదికి మళ్ళించి, వైకుంఠపురం వద్ద కృష్ణానది నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్‌లో కలపాలని ప్రతిపాదనలు చేశారు. మధ్యలో సుమారు 166 మీటర్ల ఎత్తుకు తీసుకువెళ్ళేందుకు అయిదు చోట్ల ఎత్తిపోతలు చేపట్టాల్సి ఉంది. అందువల్ల కృష్ణానదిలో వైకుంఠపురం వద్ద నుంచి దశలవారీగా అయిదు లిఫ్ట్‌లతో సత్తెనపల్లి నియోజకవర్గంలోని నర్సింగపాడు వద్ద 80 కిలోమీటరు నాగార్జునసాగర్‌ కెనాల్‌లో గోదావరి జలాలను కలపాలని భావించారు. అక్కడి నుంచి నాగార్జునసాగర్‌ 91వ కిలోమీటరు వరకు కాలువలను వెడల్పు చేసి ఈ నీటిని ప్రవహింప చేయాలని అనుకున్నారు. అక్కడి నుంచి లిఫ్ట్‌ ద్వారా బొల్లాపల్లిలో 150 టీఎంసీల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్‌ లో ఈ నీటిని నిల్వ చేయాలని ప్రతిపాదించారు. 

కేంద్రంతో పలుసార్లు సంప్రదింపులు 
    ఈ ప్రాజెక్ట్‌ సాకారం మొత్తం మూడు దశల్లో జరుగుతుంది. మొదటిదశ గోదావరి నుంచి కృష్ణకు. రెండో దశ కింద కృష్ణా నది నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్‌కు. మూడోదశ బొల్లాపల్లి నుంచి బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ వరకు నీటిని తీసుకువెళ్లడం. రెండో దశ కింద బొల్లాపల్లికి 150 టీఎంసీలతో నీరు వెడితే అక్కడి నుంచి నల్లమలసాగర్‌కు నీటిని తీసుకువెళ్లాలి. అక్కడి నుంచి బనకచర్ల వరకు నీటిని తీసుకువెళ్లాలి. అందుకు మధ్యలో చాలా సంక్లిష్టమైన మార్గంలో 23 కిలోమీటర్లు టన్నెల్స్‌ నిర్మించాల్సి ఉంది. అప్పుడే గోదావరిలోని వృధా జలాలను కరువు ప్రాంతాలుగా ఉన్న పల్నాడు, రాయలసీమ, వెలుగొండ, ప్రకాశం జిల్లా లకు నీరు అందుతాయి. కృష్ణాలో సమృద్దిగా నీరు లేకపోయినా కూడా గోదావరి జలాలు అందుతాయి. ఇలాంటి తొలి ఆలోచన జగన్‌ గారికి వచ్చింది. ఆయన ఈ ప్రాజెక్ట్‌ కు  ప్రతిపాదనలు పూర్తి చేసి, కేంద్ర ప్రభుత్వంతో కూడా చాలాసార్లు సంప్రదింపులు చేశారు. ఈ ప్రాజెక్ట్‌కు అన్ని అనుమతులు తీసుకురావాలని కేంద్రం చెప్పింది. 2022 మే 4వ తేదీన సీడబ్లు్యసీకి వైయస్‌ఆర్సీపీ ప్రభుత్వం డీపీఆర్‌ ను సమర్పించింది. 

తెలుగుతల్లి జలహారతి కాదు.. టీడీపీ అవినీతి హారతి:
    కానీ, చంద్రబాబు మాత్రం తానే ఈ ప్రతిపాదనలు చేసినట్లు సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారు. పదేపదే ఇలా చెప్పుకుంటూ పోతే జనం నమ్ముతారని ఆయన భావం. సీఎం వైయస్‌ జగన్‌ డీపీఆర్‌ సమర్పించి, సీడబ్లు్యసీ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నికలు రావడంతో అందుకు జాప్యం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు అన్ని అనుమతులు వచ్చేశాయంటూ, ఎల్లో మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ, ఈ ప్రాజెక్ట్‌ గేమ్‌ చేంజర్‌ అవుతుందంటూ ఊదరగొడుతున్నాయి. చంద్రబాబు మెడికల్‌ కాలేజీలు, పోర్ట్‌ లు, చివరికి రోడ్లు కూడా ప్రైవేటుపరం చేయడమే తన పాలన అని అంటున్నారు. కమీషన్లు తీసుకోవడం, ప్రైవేటు వారికి అన్నింటినీ దారాదత్తం చేయడం ఆయనకు అలవాటు. నేడు నేషనల్‌ హైవేతో పాటు రాష్ట్ర హైవేలు, జిల్లా పరిషత్‌ రోడ్లమీద కూడా టోల్‌ వసూలు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా రైతులకు మేలు చేసే ఈ ప్రాజెక్ట్‌ లను కూడా ప్రైవేటుపరం చేస్తున్నాడు. దీనికి తెలుగుతల్లి జలహారతి అని పేరు పెట్టాడు. ఇది ఆయన సొంత మనుషులకు ఇస్తున్న అవినీతి హారతి. ప్రైవేటువారికి దారాదత్తం చేసే ఆలోచన చేస్తున్నాడు, దీనికి కేంద్రం కూడా సుముఖత వ్యక్తం చేసిందని చెప్పుకుంటున్నాడు. ఒక అద్భుతమైన కలను ప్రజలకు చూపిస్తున్నాడు. అన్నీ ప్రైవేటుపరం చేయడమే ఆయన లక్ష్యం. రైతులను కూడా కాంట్రాక్టర్లకు తాకట్టు పెడుతున్నాడు. 

సాగునీటి ప్రాజెక్ట్‌లను కూడా ప్రైవేటుపరం చేస్తున్న ఘనుడు:
    గోదావరి–బనకచర్ల అనుసంధానం జగన్‌ గారి హాయంలో వచ్చిన ఆలోచన. కానీ ఆఖరి దశలో కార్యరూపం దాల్చలేదు. దానిని తన ఘనత అని చంద్రబాబు చెప్పుకుంటున్నాడు. ప్రైవేటువారికి కాలువను, నీటి ప్రాజెక్ట్‌ లను కట్టబెట్టడం ప్రపంచంలో ఎక్కడా వినలేదు. అదృష్టవశాత్తు నాగార్జునసాగర్‌ నిర్మాణం జరిగేప్పుడు చంద్రబాబు లేకపోవడం వల్లే వాటిని మెగా, నవయుగ వంటి తనకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు అప్పగించలేదు. దేశంలో ధనవంతుడైన సీఎంగా చంద్రబాబు గుర్తింపు పొందాడు. రెండు ఎకరాల నుంచి రెండువేల కోట్లకు ఎదిగాడు. ఈ ఆదాయ మార్గం ఏమిటో ఎవరికీ తెలియదు. 
    ఈ ప్రభుత్వానికి మూణ్ణాళ్ల ముచ్చటే. ప్రభుత్వంపై ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. రాబోయే రోజుల్లో ఉద్యమాలు కూడా వస్తాయి. మేం ప్రజల్లోకి వెళ్తాం. ఇంకా చంద్రబాబు విధానాలను ఎండగడతామని మాజీ మంత్రి అంబటి రాంబాబు వివరించారు.

Best Web Hosting Provider In India 2024