ఏడు నెలల కూటమి పాలన అట్టర్ ఫ్లాప్

Best Web Hosting Provider In India 2024

వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఫైర్‌

ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో పూర్తి వైఫల్యం

గాలిలో దీపంలా మారిన మహిళా భద్రత

సూపర్ సిక్స్ మోసాలపై బహిరంగ చర్చకు సిద్దం

వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ధ్వజం

గత మేనిఫేస్టోను టీడీపీ వెబ్ సైట్ నుంచి తీసేస్తే…

నేడు మేనిఫేస్టోను చంద్రబాబు తన మెమరీ నుంచి తీసేశాడు

వైయ‌స్ జగన్ గారి హయాంలో విద్యాంధ్రప్రదేశ్…

నేడు కూటమి హయాంలో మద్యాంధ్రప్రదేశ్ గా మారింది

77 రోజుల్లో రూ.66,000 కోట్ల మధ్యం విక్రయాలు జరిగాయి

గత ప్రభుత్వంలో కంటే 18 శాతం మద్యం, 40 శాతం బీర్ల విక్రయాలు పెరిగాయి

ప్రతి పల్లెలోలనూ ఎనీ టైం మద్యం దొరుకుతోంది

రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు

సీఎం సొంత నియోజకవర్గం కుప్పంలోనూ గంజాయి సాగు

రోజుకు 50-60 మంది మహిళలపై దాడులు జరుగుతున్నాయి

ప్రజల పక్షాల హమీల అమలుపై రాజీలేని పోరాటం

వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి

విశాఖపట్నం: కూటమి ప్రభుత్వ ఏడు నెలల పాలన అట్టర్ ఫ్లాప్ అని వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విమర్శించారు.  అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని ధ్వజమెత్తారు. ముఖ్యంగా మహిళల భద్రత గాలిలో దీపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సూపర్ సిక్స్ హామీల అమలులో కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసంపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు.  గురువారం విశాఖపట్నంలో వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మీడియాతో మాట్లాడారు.

గత ఏడాది వెన్నుపోటు నామ సంవత్సరం

ఎపిలోని ప్రజలు కొత్త సంవత్సరంలో కొత్త ఆశలకు బదులు బాబు మోసాలకు గురవుతున్నారు. ఏడు నెలల కూటమి ప్రభుత్వ పాలనలో ముఖ్యంగా మహిళలను నమ్మించి నట్టేట ముంచారు. చంద్రబాబు ఈ రాష్ట్రంలో ఏ వర్గాన్ని మోసం చేయకుండా వదలలేదు. ప్రతి తెలుగు సంవత్సరానికి సంప్రదాయకగా ఒక పేరు పెడతారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దీనిని వెన్నుపోటు నామ సంవత్సరం అని ప్రజలు భావిస్తున్నారు.   చంద్రబాబు ఎన్నికలకు ముందు హామీల వరద, అధికారం వచ్చిన తరువాత ప్రజలకు బురద చూపిస్తున్నారు. ఆకాశాన్ని, భూమిని కలిపేస్తామనే రీతిలో హామీలు ఇచ్చి, ప్రజల ఆశలను పాతాళంలోకి తొక్కేశారు. చంద్రబాబు విజనరీ గా పాలన ఇస్తామని చెప్పారు. కానీ ఇచ్చిన హామీలు మరిచిపోయే గజనీ పాలనను ప్రజలకు చవిచూపిస్తున్నారు. 

బాబు ఈ ఏడు నెలల పాలన… ప్రజలను ఏడిపించే పాలన

ప్రజలకు పథకాలు ఇస్తామని కూటమి పార్టీల హామీలు కోటలు దాటాయి… కానీ వాటి అమలు మాత్రం గడప దాటడం లేదు. బాబు ష్యూరీటీ – పథకాలు గ్యారెంటీ అన్నారు. కానీ నేడు ఆయన మాటలకు ఎటువంటి వారెంటీ లేదని అర్థమవుతోంది. ప్రతి వర్గానికి కూడా చంద్రబాబు సీఎంగా చేసిన మోసంకు ఈ ఏడు నెలల పాలన ఏడిపించే పాలనగా ఉందని ప్రజలు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో పవన్, చంద్రబాబు, కూటమి నేతలు ఎన్నెన్నో హామీలు ఇచ్చారు. సూపర్ సిక్స్ కాస్తా… సూపర్ షాక్ గా మారిపోయింది. మహాశక్తి పథకం… మహామోసంగా, తల్లికి వందనం కాస్తా పిల్లల పాలిట శాపంగా, యువగళం కాస్తా హామీలకు మంగళంగా మారిపోయింది.   ఉచిత బస్సు కాస్తా ఉత్తుత్తి బస్సుగా మారిపోయింది. 

నారా వారి నరక పాలనలో ప్రజలు విలవిల

ఎన్నికల సమయంలో ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారు. ఈ రోజు చూస్తే ఏడు నెలల్లో నారావారి నరకమైన పాలనను చూపించారు. చంద్రబాబు ఏడిఆర్ రిపోర్ట్ లో రిచెస్ట్ సీఎంగా గుర్తింపు పొందారు. కానీ ఆయన పాలన మాత్రం చాలా వరెస్ట్ గా గుర్తింపు పొందింది. ప్రజలకు ఇచ్చిన హామీలను చక్కాగా అమలు చేశాం, మా పాలన సూపర్ సక్సెస్ అని చంద్రబాబు చాటింపు వేస్తున్నాడు. పెన్షన్లు చాలా అద్భుతంగా అమలు చేశాం. ఇలా రూ.నాలుగు వేలు ఇచ్చి అమలు చేసినవారు ఎవరైనా ఉన్నారా అని సవాల్ చేశాడు. మీ సూపర్ సిక్స్ హామీల అమలు పై, మీ మోసాలపై బహిరంగ చర్చకు సిద్దం. అసలు పెన్షన్ల పెంపుదల సూపర్ సిక్స్ హామీలోనే లేదు. గత మేనిఫేస్టోను టిడిపి వెబ్ సైట్ నుంచి తీసేస్తే… ఇప్పుడు మేనిఫేస్టోను ఆయన తన మెమరీ నుంచే తీసేశాడు. సూపర్ సిక్స్ లో ఏమున్నాయో కూడా తెలుసు కోకుండా ఇటువంటి సవాళ్ళు విసురుతుండటం సిగ్గుచేటు. చంద్రబాబు హామీలు ఇవ్వడంలో హిట్టయ్యారు. వాటిని అమలు చేయడంలో సూపర్ ఫ్లాప్ అయ్యారు. 

సూపర్ సిక్స్ లోని హామీలపైనే చంద్రబాబుకు అవగాహన లేదు 

మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు. ఏ ఒక్క మహిళకైనా తల్లికి వందనం, ఫ్రీబస్సు ఇచ్చారా? చదువుకునే బిడ్డకు అయినా ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చారా? ఒకవైపు చంద్రబాబు, మరోవైపు పవన్, అన్ని చోట్లా కూటమి అభ్యర్ధులు హామీలు కోటలు దాటాయి. సైకిల్ కు ఓటేస్తే, ఫ్రీబస్సు అని, గ్లాస్ కు ఓటేస్తే ఏ క్లాస్ ఉద్యోగాలు అని, పువ్వుకు ఓటేస్తే పువ్వులో పెట్టి మహిళలకు నెలకు రూ.1500 ప్రతినెలా ఇస్తామని ఊదరగొట్టారు. ఎవరికి ఈ పథకాలు అందాయి? పెద్ద ఎత్తున ప్రచారంతో ఊదరగొట్టారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖం చాటేశారు. రామానాయుడు వంటి వారు మాట్లాడితే ప్రచారానికి వెళ్ళి ‘నీకు పదిహేను వేలు… నీరు పద్దెనిమిది వేలు.. రైతులతో నీకు ఇరవై వేలు’ అంటూ మభ్యపెట్టారు. ఈ రోజు అధికారంలోకి వచ్చిన తరువాత నిట్టనిలువుగా మోసం చేశారు. ఎపిలో మహిళా వ్యతిరేక ప్రభుత్వం ఉంది. ఒక సంక్షేమం, సంతోషం, రక్షణ లేని పరిస్థితి నెలకొంది. చంద్రబాబు, లోకేష్ లు ట్వీట్ చేస్తూ నారా దేవాన్ష్ చెస్ లో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లో నమోదు చేశారని చెప్పారు. కానీ ఏడు నెలల్లో అబద్దాల్లో వారు వరల్డ్ రికార్డ్ సాధించారు. ఉచిత బస్సు అన్నారు. ఎన్నికల సమయంలో ఈ పథకంపై పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. తిరుపతి, కాణిపాకం, శ్రీశైలం, విజయవాడ, అన్నవరం ఇలా ప్రతి పుణ్యక్షేత్రాలు మహిళలను ఉచితంగా తిప్పేస్తారు. జూన్ నాలుగో తేదీ నుంచే అమలు చేస్తామన్నారు. ఏడు నెలలు అయిపోయింది. ఎక్కడా అమలు లేదు. వినాయకచవితి, దసరా, దీపావళి, క్రిస్మస్ పండుగలు అయిపోయాయి. ఫ్రీబస్సు లేదు. ఈ పథకాన్ని అమలు చేస్తున్న తెలంగాణా, కర్ణాటకల్లో వారు అధికారంలోకి వచ్చిన పదిరోజుల్లో ఈ పథకాన్ని అమలు చేశారు. కానీ మీరేం చేస్తున్నారు?

మహాశక్తి పథకంపై పచ్చి అబద్దాలు

మహాశక్తి పథకం కింద 19-59 సంవత్సరాల లోపు ఉన్న మహిళలకు నెలకు రూ.1500 చొప్పున వారి ఖాతాల్లో వేస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఈ పథకం కింద 1.80 కోట్ల మంది అర్హులు వున్నారు. ఇందుకు గానూ నెలకు 2,800 కోట్లు అవసరం అవుతుంది. ఈ పథకంపై కౌన్సిల్ లో మేం ప్రశ్నిస్తే… రాష్ట్ర హోమంత్రి మాట్లాడుతూ ఈ పథకం పై అడ్డగోలుగా అబద్దం చెప్పారు. నిధులు కేటాయించామని అన్నారు. ఎవరి ఖాతాలో ఈ పథకం కింద డబ్బులు జమ చేశారో స్పష్టం చేయాలి. 

తల్లికి వందనం కాదు.. తల్లులను వంచిస్తున్నారు.  

వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో డ్రాప్ అవుట్స్ ను తగ్గించాలనే ఒక మంచి ఉద్దేశంతో స్కూల్ కు వెళ్ళే పిల్లల తల్లులకు ప్రతిఏటా రూ.15000 అమ్మ ఒడి కింద వారి ఖాతాలకు జమ చేశారు. దానిని చూసి కాపీ కొట్టి తల్లికి వందనంను కూటమి పార్టీలు ప్రకటించాయి. స్కూల్స్ జూన్ లో ప్రారంభమయ్యాయి. ఇప్పటికే జనవరి నెల వచ్చేసింది. ఎప్పుడు దీనిని తల్లులకు ఇస్తారు? ఆనాడు వైయస్ జగన్ ప్రతిఏటా రూ.44 లక్షల మంది తల్లుల ఖాతాలకు అయిదేళ్ళలో రూ. 25,000 కోట్లు జమ చేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు మాట్లాడుతూ స్కూల్ కు వెళ్ళే ప్రతి బిడ్డకు తల్లికి వందనం రూ.15వేలు ఇస్తామన్నారు. రాష్ట్రంలో 80 లక్షలమంది విద్యార్ధులు వున్నారు. వారి తల్లుల ఖాతాలకు ఈ సొమ్మును జమ చేశారో లేదో చెప్పాలి. అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పథకం గురించి కనీసం మాట్లాడటం లేదు. పైగా దీనిని అమలు చేసేశాము అంటూ అబద్దాలు చెబుతున్నారు. 

నిరుద్యోగ భృతి…ఒక మిధ్య

కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, లేకపోతే మూడు వేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించింది. జగన్ గారు డిఎస్సీ ప్రకటించి, టీచర్ పోస్ట్ లను భర్తీ చేయాలని భావిస్తే, దానిని రద్దు చేశారు. 16వేల మందికి డీఎస్సీ అంటూ, నవంబర్ 5వ తేదీన నోటిఫికేషన్ అని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు జనవరి వచ్చింది, డీఎస్సీ నోటిఫికేషన్ ఏదీ? మీరు చెప్పిన 20 లక్షల ఉద్యోగాల్లో ఏడాదికి నాలుగు లక్షల చొప్పున అయినా భర్తీ చేయాల్సి ఉంది. ఈ ఉద్యోగాలు ఏమయ్యాయి? వాటిని ఇవ్వలేకపోతే నిరుద్యోగభృతిని ఎందుకు ఇవ్వడం లేదు? జగన్ గారు అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే 1.25 లక్షల గ్రామ, వార్డు సచివాలయాల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారు. అలాగే 2.60 లక్షల మంది వాలంటీర్లకు నెలకు రూ.5వేలు గౌరవవేతనం ఇచ్చేవారు. కానీ ఎన్నికల ముందు చంద్రబాబు వాలంటీర్లకు ఇచ్చే గౌరవవేతనంను రూ.10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. తీరా అధికారంలో వచ్చిన తరువాత వారికి ఉన్న ఆ కాస్త ఉపాధిని కూడా దూరం చేశారు. నేటి మంత్రి రామానాయుడు ఆనాడు వాలంటీర్ల వద్దకు వెళ్లి మీకు జీతం పదివేలు చేస్తాం, మీకు జీతం పెంచిన వెంటనే జున్ను పట్టుకుని నా వద్దకు వచ్చి థ్యాంక్స్ చెప్పాలని కోరారు. రామానాయుడు గారిని సూటిగా అడుగుతున్నాము ఈ జున్ను పట్టుకుని వాలంటీర్లు సిద్దంగా ఉన్నారు… వారి ఉద్యోగాలు తీసేసినందుకు మీకు జున్ను ఇవ్వమంటారా అని ప్రశ్నిస్తున్నాము. కూటమి ప్రభుత్వం ఉద్యోగస్తులను నిలువునా ముంచేసింది. వారికి డీఎ, ఐఆర్, పీఆర్సీ కమిషన్ ఇచ్చే ప్రయత్నం చేయడం లేదు. జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు 27 శాతం ఐఆర్ ఇచ్చారు. మరి కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఏం చేసింది? వారి పరిస్థితి దారుణంగా ఉంది. టిడిపి నాయకులు ఉద్యోగులపై దాడులు చేస్తున్నారు. 

మూడు ఉచిత గ్యాస్ సిలెండర్ల హమీ ఉత్తి గ్యాస్

అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలకు ఉచితంగా మూడు గ్యాసె సిలండర్లు ఇస్తామని ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు హామీ ఇచ్చాయి. కౌన్సిల్ లో దీనిపై ప్రశ్నించిన సందర్భంలో మంత్రి నాదెండ్ల మనోహర్ దీనిపై వివరణ ఇచ్చారు. కేవలం రూ.895 కోట్లు మాత్రమే ఈ బడ్జెట్ లో కేటాయించారు. అంటే ఒక్క సిలెండర్ కు మాత్రమే, అదికూడా అరకొర లబ్ధిదారులకు మాత్రమే ఇవ్వాలనేదే వీళ్ళ ఉద్దేశం. రాష్ట్రంలో గ్యాస్ సిలెండర్లు ఉన్న కుటుంబాలు 1.55 కోట్లు ఉండగా, దానిలో తెల్లరేషన్ కార్డు ఉన్న కుటుంబాలు 1.48 కోట్లు. ఒక్క సిలెండర్ అయినా ఈ కుటుంబాలకు ఇవ్వాలన్నా కూడా ఈ రూ.895 కోట్లు సరిపోవు. మీ లెక్కల్లోనే మీ చిత్తశుద్ది ఏమిటో కనిపిస్తోంది.

రాష్ట్రంలో ఏరులై పారుతున్న మద్యం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ రాష్ట్రంలో మద్యం, గంజాయి విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. వీధికి ఒక బెల్ట్ షాప్ నడుస్తున్నాయి. కూటమి పార్టీలకు చెందిన నాయకులకు చెందిన మధ్యం దుకాణాలకు  అనుబంధంగా పెద్ద సంఖ్యలో బెల్ట్ షాప్ లను నడిపిస్తున్నారు. చివరికి హోమంత్రి సొంత నియోజకవర్గంలో బెల్ట్ షాప్ ల నిర్వహణకు వేలం నిర్వహించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరో వైపు ప్రభుత్వం బెల్ట్ షాప్ నిర్వహిస్తే గరిష్టంగా రూ.5 లక్షల వరకు జరిమానా విధిస్తామని ప్రకటించింది. కూటమి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎంతమంది పైన ఈ రకంగా జరిమానాలు విధించారు? ఎన్ని బెల్ట్ షాప్ లపై చర్యలు తీసుకున్నారు? జగన్ గారి హయాంలో నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేశారు. నేడు కూటమి ప్రభుత్వం ఈ ఏడు నెలల్లో మద్యం షాప్ లను సర్వాంగ సుందరంగా వాటి రూపురేఖలను తీర్చిదిద్దారు. జగన్ గారి హయాంలో ఈ రాష్ట్రం విద్యాంధ్రప్రదేశ్ గా గుర్తింపు పొందితే… నేడు కూటమి ప్రభుత్వంలో మద్యాంద్రప్రదేశ్ గా మారింది. కొత్త మద్యం విధానం వచ్చిన ఈ 77 రోజుల్లో రూ.66,000 కోట్ల మధ్యాన్ని తాగించారు. ఈ మద్యం తాగి మహిళలపై దాడులు, అఘాయిత్యాలు జరగుతున్నాయని మహిళలు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో 28.40 లక్షల కేసుల బీర్లు, 87.82 లక్షల కేసుల మద్యం అమ్మకాలు జరిగాయి. మద్యం ఏరులై పారుతోంది. ప్రతి పలెల్లె ఎనీటైం మద్యం దొరికే పరిస్థితి కల్పించింది. జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు 2023 డిసెంబర్ లో 25.83 లక్షల కేసుల మద్యం అమ్మకాలు జరిగాయి. అలాగే 6.40 లక్షల కేసుల బీర్లు అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది డిసెంబర్ లో ఏకంగా 30.46 లక్షల కేసుల మద్యం అమ్మకాలు జరిగాయి. అంటే కూటమి ప్రభుత్వంలో లిక్కర్ లో 4.62 లక్షల కేసులు ఎక్కువగా విక్రయించారు. 9.11 లక్షల కేసుల బీర్లు ఈ డిసెంబర్ లో జరిగితే గత ఏడాది డిసెంబర్ లో 6.40 లక్షల కేసుల బీర్లు విక్రయించారు. అంటే గత ప్రభుత్వంలో మద్యం విక్రయాలు ఎలా ఉన్నాయి, ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత ఎంతలా పెరిగాయి అనేది ప్రజలు గుర్తించాలి. వైయస్ జగన్ గారి పాలన కంటే నేడు కూటమి ప్రభుత్వంలో 18 శాతం మద్యం విక్రయాలు, 40 శాతం బీర్ల అమ్మకాలు పెరిగాయి. మద్యం ఇంత ఎక్కువగా అందుబాటులో ఉంటే, మద్యం మత్తులో మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు జరగవా? పాలకొండలో మద్యం మత్తులో ఓ వ్యక్తి ఏకంగా విద్యుత్ స్థంభంపైకి ఎక్కి, విద్యుత్ తీగలపై నిద్రించిన ఘటనను చూస్తే, ఈ రాష్ట్రంలో మద్యం పరిస్థితి ఎలా ఉందనేది అర్థమవుతుంది. మద్యం మత్తులో కుటుంబకలహాలు, రోజుకో హత్య జరుగుతోంది.

– గంజాయి అదుపునకు చర్యలు ఏవీ?

ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయి. గంజాయి సాగు విస్తృతంగా జరుగుతోంది. ఈ ప్రభుత్వం వంద రోజుల్లో గంజాయిని నిర్మూలిస్తుందని హోంమంత్రి ప్రకటించింది. ఏడు నెలలు అవుతోంది, ఎక్కడ మీరు గంజాయిని అరికట్టారు? కేజీహెచ్ వెనక గంజాయి పెంపకం బయటపడింది. చివరికి జైలులో కూడా గంజాయి దొరుకుతోంది. రాఫ్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోందని చివరికి స్పీకర్ గారే అన్నారు. సీఎం సొంత నియోజకవర్గం కుప్పంలోనూ గంజాయిని సాగు చేస్తున్నారు. మద్యం, గంజాయి వల్ల నేరాల రేటు పెరిగిపోయింది.

– మహిళలకు ఎక్కడా భద్రత లేదు 

మహిళల భద్రత గురించి చెప్పాలంటే ఆడపిల్లల తల్లిదండ్రులు వణికిపోతున్నారు. ఇంట్లోనూ, బయట, స్కూళ్ళకు, ఉద్యోగాలకు పంపాలన్నా భయపడుతున్నారు. ఈ రోజు మహిళల భద్రత దైవాదీనంగా మారింది. మహిళా భద్రతపై ఈ ప్రభుత్వం నిర్లక్ష్య దోరణితో ఉంది. డీజీపీ చెప్పిన వివరాల ప్రకారం గతం కంటే ఈ ఏడాది నేరాల రేటు పెరిగింది. రోజుకు 50-60 మంది మహిళలపై దాడుల కేసులు నమోదవుతున్నాయి. ఏడు నెలలుగా మహిళలు ప్రశాంతంగా నిద్రపోవడం లేదు. హిందూపురంలో ఇంట్లో ఉన్న అత్తాకోడళ్ళపై అత్యాచారాలు జరిగాయి. స్కూల్ కు వెళ్ళిన విద్యార్ధినిని ఏకంగా పెట్రోల్ పోసి హతమార్చిన ఘటనలు ఉన్నాయి. ఇటీవలే మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రాతినిధ్యం వహిస్తున్న పాడేరు సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన హాస్టల్ లో ఉంటున్న విద్యార్థిని అత్యాచారం చేశారు. ఒక మహిళా మంత్రి ఆ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్ర హోంమంత్రి కూడా ఉమ్మడి విశాఖజిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడే హాస్టల్ విద్యార్థినికి రక్షణ లేకపోతే, ఇక రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. సీఎం, డిప్యూటీ సీఎం సొంత జిల్లాల్లో కూడా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. వాటిని అరికట్టడంలో అధికార యంత్రాంగం విఫలమయ్యింది. గతంలో జగన్ గారు ప్రవేశపెట్టిన దిశా చట్టం, దిశా పోలీస్ స్టేషన్, యాప్ లను పక్కకు పెట్టేశారు. దిశాచట్టం కేంద్రం వద్ద పెండింగ్ లో ఉంది. మీరు ఎన్డీఏలో భాగంగా ఉన్నారు. ఈ చట్టంకు ఆమోదం తీసుకురాకుండా ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారు? దిశాయాప్ కు ప్రత్యామ్నాయంగా మరో యాప్ ను అయినా ఎందుకు తీసుకు రాలేక పోయారు? ఒక మంచి వ్యవస్థను మహిళల భద్రత కోసం తీసుకు రాలేదు? అంటే మహిళల రక్షణపై ఈ ప్రభుత్వంకు ఉన్న చిన్నచూపు అర్థమవుతోంది. ఈ ప్రభుత్వ వైఫల్యాలపై వైయస్ఆర్ సిపి ప్రజల పక్షాన ప్రశ్నిస్తుంది. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమిస్తుంది. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై రాజీలేని పోరాటం చేస్తాం.

Best Web Hosting Provider In India 2024