Best Web Hosting Provider In India 2024
Bellam Gavvalu: పిల్లలకు ఇలా బెల్లం గవ్వలు చేసి పెట్టండి ఇష్టంగా తింటారు
Bellam Gavvalu: బెల్లం గవ్వలు ఎప్పటినుంచో తెలుగిళ్లల్లోనే తినే స్వీట్లు. కానీ ఇప్పటి పిల్లలు వీటిని మర్చిపోయారు. బెల్లం గవ్వలు రెసిపీ ఇదిగో.
బెల్లం గవ్వలు పేరు చెప్తే ఒకప్పటికి ఒకప్పటి తరానికి ఎంతో ఇష్టమైన తినుబండారాలు గుర్తుకు వస్తాయి కానీ ఇప్పటి పిల్లలు బెల్లం గవ్వలను మర్చిపోయారు పిజ్జాలు బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ తోనే పొట్ట నింపుకుంటున్నారు బెల్లం గవ్వలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి వీటిని బెల్లం గోధుమపిండితో చేస్తారు కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిదే ఇక్కడ మేము బెల్లం గవ్వల రెసిపీ ఇచ్చాము క్రిస్పీగా క్రంచీగా బెల్లం గవ్వలు ఎలా చేయాలో తెలుసుకోండి
బెల్లం గవ్వలు రెసిపీకి కావలసిన పదార్థాలు
గోధుమపిండి – ఒకటిన్నర కప్పు
నెయ్యి – రెండు స్పూన్లు
ఉప్పు – అర స్పూను
వంట సోడా – పావు స్పూను
నూనె – డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
బెల్లం – ముప్పావు కప్పు
బెల్లం గవ్వలు రెసిపీ
1. ఒక గిన్నెలో గోధుమపిండి, నెయ్యి, ఉప్పు, బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకోవాలి.
2. తగినంత నీళ్లు కలిపి చపాతీ పిండిని గట్టిగా ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. పైన మూత పెట్టి పది నిమిషాలు వదిలేయాలి.
3. ఆ తర్వాత ఈ పిండిని చిన్నచిన్న లడ్డూల్లా చుట్టుకోవాలి.
4. ఇప్పుడు ఈ లడ్డూలను గవ్వల ఆకారంలో చేత్తోనే మెదిపి తయారు చేసుకోవాలి.
5. ఇలా గవ్వల ఆకారం రావడానికి ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిని వినియోగిస్తారు. కొంతమంది గవ్వల పీటను అందుకు వినియోగిస్తారు.
6. అన్నింటినీ అలా గవ్వల్లా ఆకారంలో చేసుకున్నాక స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేయాలి.
7. నూనె వేడెక్కాక ఈ గవ్వలను అందులో వేసి రంగు మారేవరకు వేయించుకోవాలి.
8. అన్నింటిని వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి.
9. ఇప్పుడు స్టవ్ మీద మరొక కళాయి పెట్టి బెల్లం వేయాలి.
10. ఆ బెల్లంలోనే అరకప్పు నీళ్లు వేసి తీగపాకం వచ్చే వరకు మరిగించుకోవాలి.
11. అది తీగపాకం వచ్చాక ముందుగా వేయించి పెట్టుకున్న గవ్వలను అందులో వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.
12. ఈ గవ్వలను బాగా కలపాలి. అన్ని గవ్వలకు బెల్లం పాకం అతికేలా చేసుకోవాలి. ఇప్పుడు వీటిని చల్లారనివ్వాలి.
13. చల్లారాక ఒకదానికి ఒకటి అతుక్కున గవ్వలు విడదీసి ఒక గిన్నెలో కంటైనర్ లో భద్రపరుచుకోవాలి.
14. ఇవి మూడు వారాలు వరకు తాజాగా ఉంటాయి. కొన్నిసార్లు నెలరోజులు కూడా తాజాగా ఉండే అవకాశం ఉంది.
పూర్వం పండగలు వస్తే ఖచ్చితంగా బెల్లంగా గవ్వలను చేసుకునేవారు. ఇవి ఎక్కువ కాలం పాటు తాజాగా ఉంటాయి కాబట్టి ఫ్రిజ్లో పెట్టాల్సిన అవసరం లేదు. అందుకే వీటిని చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉండేది. ఎప్పుడైతే ఆధునిక కాలంలో కొత్త కొత్త తినబండారాలు వచ్చాయో… ఈ బెల్లం గవ్వలకు ఆదరణ లేకుండా పోయింది. నిజానికి ఇవే ఆరోగ్యకరమైనవి. ఇందులో బెల్లం ఉపయోగించాము. కాబట్టి పిల్లలకు రక్తహీనత సమస్య రాకుండా ఉంటుంది. ఎన్నో పోషకాలు కూడా శరీరానికి అందుతాయి. కొంతమంది వీటిని మైదా పిండితో తయారుచేస్తారు. మైదా పిండితో తయారుచేసిన బెల్లం కావాలని తినడం వల్ల ఆరోగ్యానికి హానికరం. కాబట్టి గోధుమ పిండిని వినియోగించితే మంచిది.