Best Web Hosting Provider In India 2024
Methi Pachadi: మెంతాకులతో ఇలా స్పైసీ చట్నీ చేశారంటే వేడి వేడి అన్నంలో అదిరిపోతుంది, రెసిపీ ఇదిగో
Methi Pachadi: మెంతాకులతో చట్నీ చేసి చూడండి. ఇది అన్నంలోకి, దోశల్లోకి, ఇడ్లీలోకి కూడా అదిరిపోతుంది. పైగా ఎంతో ఆరోగ్యం కూడా. మెంతాకు పచ్చడి రెసిపీ ఇదిగో.
మెంతాకులు చలికాలంలో అధికంగా దొరుకుతాయి. మెంతాకులతో చేసిన ఆహారాలు తినమని వైద్యులు కూడా సూచిస్తారు. మన శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలను మెంతికూర తనలో దాచుకుంటుంది. కాబట్టి మెంతి ఆకులను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇక్కడ మేము మెంతాకు పచ్చడి ఇచ్చాము. ఈ మెంతికూర పచ్చడి రెసిపీ అదిరిపోతుంది. దీన్ని అన్నంలో, ఇడ్లీలో, దోశల్లో దేనితో తిన్నా రుచిగా ఉంటుంది. పైగా ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. మెంతికూర పచ్చడి ఎలా చేయాలో తెలుసుకోండి.
మెంతికూర పచ్చడి రెసిపీకి కావలసిన పదార్థాలు
మెంతికూర ఆకులు – ఒక కప్పు
ఎండుమిర్చి – నాలుగు
పచ్చిమిర్చి – పది
ధనియాలు – ఒక స్పూను
జీలకర్ర – ఒక స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – తగినంత
నువ్వులు – ఒక స్పూను
టమోటోలు – రెండు
చింతపండు – ఉసిరికాయ సైజులో
పసుపు – చిటికెడు
మెంతికూర పచ్చడి రెసిపీ
1. మెంతి ఆకులను ఏరి శుభ్రంగా కడిగి ఒక పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ఒక స్పూను నూనె వేయాలి.
3. ఆ నూనెలో ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చి మిర్చి, నువ్వులు వేసి వేయించుకోవాలి.
4. ఇవి వేగాక మెంతి ఆకులు కూడా వేసి వేయించుకోవాలి.
5. ఈ మొత్తం మిశ్రమంలో రుచికి సరిపడా ఉప్పును వేసి కలుపుకోవాలి.
6. స్టవ్ ఆఫ్ చేసి ఈ మొత్తం మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి.
7. ఇప్పుడు అదే కళాయిలో మరొక స్పూను నూనె వేసి టమోటో ముక్కలను వేయాలి.
8. అవి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. పసుపు వేసి బాగా ఉడికించుకోవాలి.
9. ఈ టమోటాలను వేడి చల్లారాక మెంతికూర వేసినా మిక్సీ జార్ లోనే వీటిని వేయాలి.
10. ఇప్పుడు రెండింటినీ కలిపి మెత్తగా రుబ్బుకోవాలి.
11. ఈ మొత్తం మిశ్రమాన్ని తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి.
12. ఇప్పుడు దానికి తాళింపు వేసేందుకు చిన్న కళాయిని స్టవ్ మీద పెట్టాలి.
13. రెండు స్పూన్ల నూనె వేసి మినప్పప్పు, శనగపప్పు వేసి వేయించుకోవాలి.
14. ఒక ఎండుమిర్చి, మూడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేయించాలి.
15. గుప్పెడు కరివేపాకులను కూడా వేయాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని పచ్చడిపై తాలింపులా వేసుకోవాలి. అంతే టేస్టీ మెంతికూర పచ్చడి రెడీ అయినట్టే.
మెంతి ఆకుల్లో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉంటాయి. మెంతికూరను ప్రతిరోజూ తింటే పక్షవాతం, మలబద్ధకం, పొత్తికడుపు నొప్పి, నాడీ వ్యవస్థ దెబ్బ తినడం రాకుండా ఉంటాయి. రక్త స్థాయిలు కూడా మెరుగుపడతాయి. హిమోగ్లోబిన్ లోపం రాకుండా ఉంటుంది. ఎవరైతే ఊబకాయం, బ్రాంకైటిస్, ఆస్తమా, విపరీతమైన దగ్గు వంటి సమస్యలతో బాధపడతారో వారు ప్రతిరోజు మెంతికూరను తినడం అలవాటు చేసుకోవాలి. అలాగే మహిళల్లో అధిక రక్తస్రావంతో బాధపడే వారి సంఖ్య కూడా ఎక్కువే. వారు కూడా మెంతికూరను తినడం వల్ల మంచి ప్రయోజనాలు ఉన్నాయి.