Best Web Hosting Provider In India 2024
Malayalam Movie: మోస్ట్ వయోలెంట్ మలయాళం మూవీ.. తెలుగులో బాక్సాఫీస్ రికార్డు బ్రేక్
Malayalam Movie: మోస్ట్ వయోలెంట్ మలయాళం మూవీగా పేరుగాంచిన మార్కో తెలుగు వెర్షన్ తొలి రోజు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. జనవరి 1న రిలీజైన ఈ మూవీ.. తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ డబ్బింగ్ సినిమాగా నిలిచింది.
Malayalam Movie: మలయాళంలోనే కాదు.. ఇండియాలోనే మోస్ట్ వయోలెంట్ సినిమాల్లో ఒకటిగా చెబుతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ మార్కో. ఈ సినిమా ఇప్పటికే మలయాళంలో సూపర్ హిట్ అయింది. తెలుగు వెర్షన్ బుధవారం (జనవరి 1) న్యూ ఇయర్ డే సందర్భంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ డబ్బింగ్ సినిమా తొలి రోజే బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం విశేషం. ఉన్ని ముకుందన్ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమా.. మన దగ్గర అత్యధిక తొలి రోజు వసూళ్లు సాధించిన మలయాళ డబ్బింగ్ మూవీగా నిలిచింది.
మార్కో బాక్సాఫీస్ కలెక్షన్లు
మార్కో మూవీ తొలి రోజే తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.1.75 కోట్లు వసూలు చేయడం విశేషం. తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ మూవీ ఇదే అంటూ మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వరకు పెద్దగా సినిమాలేవీ లేకపోవడంతో ఈ మార్కో జోరు మరింత కొనసాగే అవకాశం ఉంది. ఈ సినిమాలో ఉన్ని ముకుందన్ తోపాటు సిద్ధిఖీ, జగదీశ్, అభిమన్యు ఎస్. తిలకన్, కబీర్ దుహాన్ సింగ్ లాంటి వాళ్లు నటించారు. హనీఫ్ అదేని డైరెక్ట్ చేశాడు.
మార్కో మూవీ ఎలా ఉందంటే?
మార్కో అత్యంత హింసాత్మక సినిమాల్లో ఒకటిగా నిలుస్తోంది. మలయాళంలో హిట్ అయిన తర్వాత తెలుగులోనూ డబ్ చేసి రిలీజ్ చేశారు. మార్కో సాదాసీదా రివేంజ్ డ్రామా మూవీ. తన సోదరుడి మరణంపై ప్రతీకారం తీర్చుకునే ఓ యువకుడి కథతో దర్శకుడు హనీఫ్ అదేని మార్కో మూవీని తెరకెక్కించాడు.
చెప్పుకుంటే రెండు నిమిషాల్లోనే ముగిసిపోయే కథతో రెండు గంటలు సిల్వర్ స్క్రీన్‌పై భీభత్సమే సృష్టించాడు. సినిమాలోని ఒక్కో యాక్షన్ ఎపిసోడ్ ఒక్కో క్లైమాక్స్‌లా ఉంటుంది. రక్తం ఏరులై పారుతుంది. యాక్షన్ లవర్స్ సైతం ఈ రేంజ్ రక్తపాతాన్ని భరించలేమని అనుకునేలా చేశాడు డైరెక్టర్.
క్లైమాక్స్‌లో విలన్ గుండెను చీల్చి హీరో చంపేసే సీన్.. గన్‌తో విలన్ గ్యాంగ్ మెంబర్స్‌ను పీస్‌లు చేయడం, చైన్‌సా మిషన్‌తో కోసుకుంటూ వెళ్లిపోవడం.. ఇలాంటి సన్నివేశాలు సినిమా నిండా కనిపిస్తాయి. హీరో ఫ్యామిలీపై విలన్ గ్యాంగ్ ఎటాక్ చేసే సీన్‌ను చూస్తూ థియేటర్‌లో కూర్చోవడం కష్టమే. వయోలెన్స్ పరంగా సినిమాల్లో ఉన్న హద్దులన్నింటిని బద్దలు కొట్టేశాడు.