నాడు సురక్ష.. నేడు శిక్ష 

Best Web Hosting Provider In India 2024

దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పట్ల కనికరం చూపని కూటమి ప్రభుత్వం 

గత ప్రభుత్వంలో ‘ఆరోగ్య సురక్ష’ ద్వారా మందుల డోర్‌ డెలివరీ  

ప్రతి నెలా సీహెచ్‌వో/ఏఎన్‌ఎంలతో రోగుల ఇళ్ల వద్ద అందజేత 

కూటమి ప్రభుత్వం రాగానే ఆ కార్యక్రమానికి మంగళం

ఖరీదైన మందుల కొనుగోలుకు రోగులు తీవ్ర అగచాట్లు 

కిడ్నీ, గుండె, మెదడు సంబంధిత దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు సతమతం 

రాష్ట్ర వ్యాప్తంగా మండిపడుతున్న లక్షలాది మంది బాధితులు  

అమరావతి: శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలానికి చెందిన జె.అప్పలనాయుడు గుండె జబ్బుతో బాధ పడుతున్నాడు. ఈ నేపథ్యంలో రక్తనాళాల్లో కొవ్వు స్థాయిలను తగ్గించడానికి, గుండె పోటు, కార్డియాక్‌ అరెస్ట్‌లను నివారించడంతో పాటు.. అధిక రక్తపోటు సమస్యకు సంబంధించిన మందులను రోజూ వాడాల్సి ఉంటుంది. ఖరీదైన ఈ మందులను బయట కొనుగోలు చేయడం ఆ కుటుంబానికి స్తోమతకు మించిన వ్యవహారం. ఈ పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా అమలులోకి తెచ్చిన మందుల డోర్‌ డెలివరీ ఈ కుటుంబానికి వరంగా మారింది. విలేజ్‌ క్లినిక్‌లోని సీహెచ్‌వో నెలనెలా ఆన్‌లైన్‌లో ఇండెంట్‌ పెడితే మందులు పోస్టల్‌లో గ్రామానికి వచ్చేవి.

ఆ మందులను సీహెచ్‌వో/ఏఎన్‌ఎం ఇంటి వరకూ తీసుకెళ్లి అందజేసేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉన్నట్టుండి మందుల డోర్‌ డెలివరీ కార్యక్రమాన్ని ఆపేసింది. దీంతో మందుల కోసం అప్పలనాయుడు తీవ్ర ఇక్కట్లు పడాల్సి వస్తోంది. ఇలాఅప్పలనాయుడు తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది గుండె, కిడ్నీ, క్యాన్సర్, న్యూరో సంబంధిత దీర్ఘకాలిక జబ్బులతో బాధ పడుతున్న వారి పట్ల చంద్రబాబు ప్రభుత్వం నిర్దయగా వ్యవహరిస్తోంది.

 ఎన్నికల ముందు వరకు క్రమం తప్పకుండా ఇంటి గుమ్మం వద్దకే సజావుగా సాగిన మందుల డోర్‌ డెలివరీ.. ఇప్పుడు నిలిచి పోవడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లేచి నడిచే సత్తా ఉన్న వారు ప్రయాణ చార్జీలు పెట్టుకుని, ఆపసోపాలు పడి పెద్దాస్పత్రులకు వెళుతుంటే అక్కడ కూడా కొన్ని రకాల మందులు అందుబాటులో ఉండటం లేదని, బయట కొనుక్కోమని చీటీలు రాసిస్తున్నారని పేదలు లబోదిబోమంటున్నారు. పక్షవాతం బారినపడి.. కాళ్లు, చేతులు పని చేయని, కదల్లేని స్థితిలో ఉండే వికలాంగులు, వృద్ధుల పరిస్థితి దయనీయంగా ఉంది. చేసేదేమీ లేక స్థానికంగా ప్రైవేట్‌ మెడికల్‌ స్టోర్స్‌లో ఖరీదైన మందులు కొనుగోలు చేయడానికి బాధిత కుటుంబాలు తీవ్ర అగచాట్లు పడుతున్నాయి.

బాధితులకు భరోసా కరువు
⇒ గత ప్రభుత్వంలో ఆరోగ్య సురక్ష కార్య­క్రమంలో భాగంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల వివ­రాలను సచివాలయాల వారీగా వైద్య శాఖ ఆన్‌లైన్‌లో పొందు పరిచింది. ఈ సమాచా­రం ఆధారంగా విలేజ్‌ క్లినిక్‌లోని కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌(సీహెచ్‌వో)లు ప్రతి నెలా మందు­లను ఆన్‌లైన్‌లో ఇండెంట్‌ పెట్టేవారు. ఆ మందులను సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్స్‌ నుంచి ఏపీఎంఎస్‌ఐడీసీ పోస్టల్‌ ద్వారా గ్రామాలకు చేరవేసేది. అనంతరం సీహెచ్‌వో/ఏఎన్‌ఎంలు ఆ మందుల పార్సిల్‌ను బాధితుల ఇంటి వద్దకు చేరవేసి, వాటిని ఎలా వాడాలో వివరించే వా­రు. 

⇒ అయితే జూన్‌లో కూటమి ప్రభుత్వం కొలు­వు­­దీరిన నాటి నుంచి ఆన్‌లైన్‌లో ఇండెంట్‌ పెడు­తున్నప్పటికీ, ఏపీఎంఎస్‌ఐడీసీ మందులను గ్రామాలకు పంపడం లేదు. మందులు రావ­డం లేదని జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులను ప్రశ్నిస్తున్నా ఎవరూ స్పందించక  పోవడంతో సీహెచ్‌వోలు ఇండెంట్‌ పెట్ట­డం కూడా మానేశారు. దీంతో వ్యాధిగ్రస్తులకు ప్రభు­త్వం నుంచి భరోసా కరువైంది. 

⇒ బ్రెయిన్, హార్ట్‌ స్ట్రోక్, దీర్ఘకాలిక కిడ్నీ, క్యాన్సర్‌ జబ్బుల బాధితులు జీవిత కాలం మందులు వాడాల్సి ఉంటుంది. ఖరీదైన మందులు కొనుగోలు చేయడానికి నెలకు రూ.­వేలల్లో కూడా ఖర్చు అవుతుంది. వ్యవ­సాయ, రోజు వారీ కూలి పనులపై ఆధార­పడే పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు చెందిన బాధి­తులు ఖరీదైన మందులు నెలనెలా కొనుగోలు చేయడానికి ఆర్థిక స్తోమత సహకరించదు. దీంతో చాలా మంది మందుల వాడకాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇలా చేయడం ద్వారా జబ్బులు ముదిరి ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తుతుంటాయి.

⇒ ఈ పరిస్థితిని నివారించి బాధితులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం మందుల డోర్‌ డెలివరీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి­ంది. ఇంతటి ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని దయలేని చంద్రబాబు ప్రభుత్వం ఆపేయడం పట్ల బాధిత కుటుంబాలు మండి పడుతున్నాయి.

ఆత్మస్థైర్యం కోల్పోయినట్లైంది
గతంలో ప్రభుత్వమే నేరుగా ఇంటి దగ్గరకు మందులు పంపేది. నర్సమ్మ ఇంటి వద్దకే వచ్చి మందులు అందజేసి, నా ఆరోగ్యం గురించి వాకబు చేసి, మందులు ఎలా వాడాలో వివరించేది.  నాకు ఎంతో ఆత్మస్థైర్యం నింపింది. ఇప్పుడు ఆ ఆత్మస్థైర్యం కోల్పోయాను. పై నుంచి వచ్చే మందులు కొద్ది నెలలుగా రావడం లేదని ఏఎన్‌ఎం, నర్సమ్మ చెప్పారు. – అప్పలకొండ, అనకాపల్లి జిల్లా

రోగాలు ముదిరిపోతాయి
దీర్ఘకాలిక జబ్బులతో బాధప­డుతూ, కదల్లేని పరిస్థితుల్లో గ్రా­మాల్లో చాలా మంది ఉంటారు. క్రమం తప్పకుండా మందుల వాడకంతో బాధితుల్లో జబ్బు­లు నియంత్రణలో ఉంటాయి. మందులు ఆపేస్తే జబ్బులు ముది­రి, మరిన్ని అనా­రోగ్య సమ­స్య­లతో పాటు ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తుతా­యి.  – డాక్టర్‌ అంబటి నాగరాధాకృష్ణ యాదవ్, విజయవాడ

Best Web Hosting Provider In India 2024