Best Web Hosting Provider In India 2024
JC Prabhakar Buses: జేసీ బస్సుల దగ్ధం, జగన్ పాలనే నయమంటున్న జేసీ ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నేతలపై ఆగ్రహం
JC Prabhakar Buses: అనంతపురం జిల్లాలో జేసీ బస్సుల దగ్ధం కావడం, అంతకు ముందు బీజేపీ నేతలు సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్ రెడ్డి భగ్గుమన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలన నయమని, తన బస్సుల్ని ఆపాడే తప్ప వాటిని తగులబెట్టలేదని మండిపడ్డారు.
JC Prabhakar Buses: అనంతపురం జిల్లాలో జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన రెండు బస్సులు దగ్ధం కావడం కలకలం రేపింది. న్యూఇయర్ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి నిర్వహించిన కార్యక్రమంపై బీజేపీ నాయకురాలు, సినీ నటి మాధవిలత సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత బస్సులు దగ్ధం కావడంతో ప్రభాకర్ రెడ్డి భగ్గుమన్నారు.
“జగన్ పాలన మేలని, బస్సులు నిలబెట్టించాడు.. మీరు తగలబెట్టించారు” అని బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి పాలన మేలు అని, బస్సులు నడవకుండా నిలబెట్టించాడు తప్ప వాటిని ఏమి చేయలేదని, బీజేపీ వాళ్లు తన బస్సులు తగులబెట్టించారని అయినా తానేమి భయపడనన్నారు. మహిళల్ని హిజాబ్‌లను తీయమని అడగడంపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోవిడ్‌లో మాస్క్‌లు ఎందుకు పెట్టుకున్నారని, వాళ్ల ముఖాలకు ముసుగులు తీయమని అడగడానికి మీరెవరని, తనను భయపెట్టడానికి బస్సులు తగులబెడితే తానేమి బెదిరిపోనన్నారు. తన వద్ద పనిచేసే డ్రైవర్లకు పాత బస్సులు తక్కువ ధరకు ఇచ్చేశానని, తనను నమ్ముకుని ఉన్న వాళ్ల కోసం ఏదొకటి చేయాలని అనుకున్నానని ఆ బస్సుల్ని తగులబెట్టారని ఆరోపించారు.
తనపై విమర్శలు చేస్తున్న వారు మతం కోసం ఏం చేశారో చెప్పాలన్నారు తాను ఆలయాలను పునర్నిర్మిస్తున్నాని, 650ఏళ్ల నాటి శివాలయాన్ని 20కోట్లతో తిరిగి కట్టిస్తున్నానని, మతం కారణంగా మహిళల్ని కించపరిచే హక్కు బీజేపీ వారికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. పార్టీ పేరు చెప్పుకుని బెదిరింపు రాజకీయాలు చేస్తానంటే సహించనన్నారు.
అనంతపురంలో న్యూఇయర్ వేడుకలు చేయోద్దనడానికి వారెవరని ప్రశ్నించారు. మహిళలతో మాత్రమే ఈ కార్యక్రమం నిర్వహించానని చెప్పారు. బస్సుల దగ్ధం విషయంలో సుమోటోగా కేసు పెట్టుకోవాలని, పోలీసులతో న్యాయం జరుగుతుందనే నమ్మకం తనకు లేదన్నారు. ఆరేళ్లుగా బస్సులు నిలిచిపోయి ఉన్నాయని, చేతనమైతే పోలీసులు నిందితుల్ని పట్టుకోవాలని సూచించారు. బస్సుల వ్యాపారంలో రూ.450కోట్ల కోల్పోయానని, బస్సులు దగ్ధమైతే నేనేమి భయపడిపోనని అన్నారు.
షార్ట్ సర్క్యూట్ జరిగిందని రాసుకున్నా తనకు నష్టం లేదన్నారు. ఎస్పీ, ఇంటెలిజెన్స్ వాళ్లు నివేదికల్లో ఏమి రాస్తారో తనకు తెలుసన్నారు. 31వ తేదీ రాత్రి తమ ఊరి మహిళలు జేసీ పార్క్‌కు తరలి వచ్చారని, ఆ కార్యక్రమంపై సారా, గంజాయి అమ్ముతారంటూ బీజేపీ నేతలు ప్రచారం చేశారని మండిపడ్డారు. బీజేపీ అనుబంధ సంఘాలు ఆ కార్యక్రమాలపై దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. మహిళల్ని కించపరిచేలా దుష్ప్రచారం చేస్తే సహించనన్నారు. మహిళలు ముసుగులు వేసుకుంటే మీకెందుకని ప్రశ్నించారు. దమ్ముంటే శివరాత్రి, సంక్రాంతి పండుగులను నిర్వహించి చూపాలని జేసీ సవాలు చేశారు.
జేసీ వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేపీ
జేసీ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్దేశపూర్వకంగానే జేసీ బీజేపీ నేతలపై విమర్శలు చేస్తున్నారని, కూటమి ప్రభుత్వంలో విభేదాలు సృష్టించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. తాము ఎవరిని కించపరచలేదని బీజేపీ అనంతపురం నేతలు చెబుతున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఫ్రస్ట్రేషన్‌తోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.
టాపిక్