Best Web Hosting Provider In India 2024
RGV on Janhvi: జాన్వీతో సినిమా తీసే ఉద్దేశమే లేదు.. నాకు తల్లి ఇష్టం.. కూతురు కాదు: ఆర్జీవీ కామెంట్స్
RGV on Janhvi: రామ్‌గోపాల్ వర్మ మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. జాన్వీ కపూర్ తో తనకు సినిమా తీసే ఉద్దేశమే లేదని అన్నాడు. తనకు తల్లి శ్రీదేవి ఇష్టం తప్ప కూతురు కాదని నిర్మొహమాటంగా చెప్పడం విశేషం.
RGV on Janhvi: దివంగత నటి శ్రీదేవి అంటే దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమెను ఓ నటిగా కాకుండా దేవతగా అతడు చూస్తాడు. ఆమెతో పలు సినిమాలు కూడా చేశాడు. శ్రీదేవిపై తనకున్న ఇష్టాన్ని కూడా ఆర్జీవీ ఎప్పుడూ దాచుకోలేదు. అయితే ఆ ఇష్టం ఆమెపైనా తప్ప ఆమె కూతురు జాన్వీపై లేదని, ఆమెతో తాను సినిమా తీయనని అతడు స్పష్టం చేశాడు.
జాన్వీలో శ్రీదేవి కనిపించడం లేదు
రామ్ గోపాల్ వర్మ తన యూట్యూబ్ ఛానెల్లో ఈ మధ్య శ్రీదేవి గురించి మరోసారి మాట్లాడాడు. ఈ సందర్భంగా ఆమె కూతురు జాన్వీ కపూర్ గురించీ స్పందించాడు. ఈ మధ్యే జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీ చేసి టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఆమె.. బాలీవుడ్ లో మాత్రం టాప్ నటీమణుల్లో ఒకరిగా ఎదిగింది. అయితే ఇప్పటికీ జాన్వీలో తనకు శ్రీదేవి కనిపించడం లేదని ఆర్జీవీ అన్నాడు. ఆ మధ్య దేవర షూటింగ్ సందర్భంగా ఓ షాట్ లో అయితే తనకు అచ్చూ శ్రీదేవిని చూసినట్లే ఉందని జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడు.
కానీ వర్మ మాత్రం తనకు అలాంటి ఫీలింగే కలగలేదని అనడం గమనార్హం. ఒకప్పుడు తాను శ్రీదేవికి తాను ఎంతటి వీరాభిమానినో కూడా చెప్పుకొచ్చాడు. “పదహారేళ్ల వయసు కావచ్చు.. వసంత కోకిల కావచ్చు.. ఆమె ఎన్నో భిన్నమైన పాత్రలు పోషించింది. ఆమె నటన చూస్తుంటే నన్ను నేను ఓ దర్శకుడి అని మరచిపోయి ఓ సాధారణ ప్రేక్షకుడిగా చూస్తాను. అదీ ఆమె స్థాయి” అని రామ్ గోపాల్ వర్మ అన్నాడు.
తల్లి ఇష్టం.. కూతురు కాదు..
ఈ సందర్భంగా జాన్వీ కపూర్ తో కలిసి సినిమా చేస్తారా అని ప్రశ్నించగా.. ఆర్జీవీ తనదైన స్టైల్లో స్పందించాడు. “నేను తల్లిని ఇష్టపడ్డాను తప్ప కూతురిని కాదు కదా” అని నిర్మొహమాటంగా చెప్పేశాడు. “నిజాయతీగా చెప్పాలంటే నా కెరీర్లో కొందరు పెద్ద పెద్ద నటులతో నేను ఎలాంటి కనెక్షన్ పెట్టుకోలేదు. అందువల్ల జాన్వీతోనూ సినిమా తీసే ఉద్దేశం నాకు లేదు” అని ఆర్జీవీ స్పష్టం చేశాడు.
ప్రస్తుతం ఆర్జీవీ తాను సత్య మూవీలో కలిసి పని చేసిన మనోజ్ బాజ్‌పాయీతో ఓ మూవీ తీస్తున్నాడు. అటు జాన్వీ కపూర్ తెలుగులో రామ్ చరణ్ తో కలిసి ఆర్సీ16లో నటించనుంది. ఇది కాకుండా సన్నీ సంస్కారీ కీ తులసి కుమారి, పరమ్ సుందరిలాంటి సినిమాలు కూడా చేస్తోంది.