Best Web Hosting Provider In India 2024
AP Cabinet Reshuffle : ఏపీ కేబినెట్ లో మార్పులు తప్పవా…! అప్పుడే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది..?
Andhrapradesh Cabinet: ఏపీ కేబినెట్ లో మార్పులు ఉండే అవకాశం ఉందన్న చర్చ జోరందుకుంటుంది. కూటమి పార్టీలతోనే పాటు ప్రజల్లో కూడా విస్తృతంగా చర్చ జరుగుతోంది. కేబినెట్ విస్తరణతో పాటే మార్పులు కూడా ఉండే అవకాశం ఉంది. అయితే ఇందుకు కొన్ని కారణాలు బలం చేకూరుస్తున్నాయి.
రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలల పాలనను పూర్తి చేసుకుంది. ఇంకా ఏడాది కూడా కాలేదు. అయితే అప్పుడే రాష్ట్రంలోని మంత్రులను మార్చుతారా? కొంతమందికి ఉద్వాసనం పలికి, కొత్తవారికి అవకాశం ఇస్తారని చర్చ రాష్ట్రంలో ఊపందుకుంది.
ఇదే విషయంపై ఇటు కూటమి పార్టీల్లోనూ, అటు ప్రజల్లోనూ విస్తృత చర్చ జరుగుతోంది. దీంతో కూటమి ప్రభుత్వంలోని ప్రధానంగా టీడీపీ మంత్రుల్లో కొంతమందికి గుండెల్లో భయం మొదలైంది. తమ పోస్టు ఉంటుందో, ఊడుతోందని అభద్రతా భావంలో ఉన్నారు. అయితే రాష్ట్రంలో మంత్రులను మార్చుతారనే చర్చ మంత్రి పదువుల ఆశావహులకు మాత్రం సంతోషాన్ని కలిగిస్తోంది.
చర్చ ఎందుకు జరుగుతోంది..?
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి పట్టుమని పది నెలలు కాకుండానే ఈ చర్చ తెరపైకి వచ్చింది. అయితే దీనికి కొన్ని కారణాలు లేకపోలేదు. రాష్ట్రంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జలవనరుల శాఖ మంత్రి నిమ్మలరామానాయుడు, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తదితరులు పనితీరు బాగానే ఉన్నప్పటికీ… కొంత మంది మంత్రులు పనితీరు సరిగ్గా లేదని చర్చ జరుగుతోంది.
అలాగే కొంత మంది మంత్రులను వివాదాలు కూడా వెంటాడుతున్నాయి. విజయనగరం జిల్లాకు చెందిన గజపతినగరం ఎమ్మెల్యే, పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కోనసీమ జిల్లాకు చెందిన రామచంద్రాపురం ఎమ్మెల్యే, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, కృష్ణా జిల్లాకు చెందిన నూజివీడు ఎమ్మెల్యే, రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వంటి వారిని ఇటీవలే వివాదాల చుట్టుముట్టాయి. అన్నమయ్య జిల్లాకు చెందిన రాయచోటి ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వంటి వారు కూడా గతంలో వివాదాలకు కేంద్రం అయ్యారు. దీంతో రాష్ట్రంలో మంత్రుల మార్పు జరుగుతోందని చర్చ జరుగుతోంది.
నాగబాబుతో ఎంట్రీతో సీన్ మారుతుందా..?
రాష్ట్ర మంత్రివర్గం 26 మందితో ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా 25 మందితో మంత్రి వర్గం ఉంది. ఒక స్థానం ఖాళీగా ఉంది. అది జనసేన స్థానం. దాన్ని జనసేన నేత నాగబాబుతో భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. దీంతో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరుగుతోందని చర్చ జరుగుతోంది.
ఈ మంత్రి వర్గ విస్తరణలోనే కొంత మందికి మంత్రి పదవి ఉద్వాసన పలికే అవకాశముందని…. కొత్త వారికి మంత్రివర్గంలో చోటు కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఏ సామాజిక వర్గం నుంచి మంత్రిని తొలగిస్తే, ఆ సామాజిక వర్గం నుంచే మరొకరికి మంత్రి పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ మంత్రులను మార్చాల్సి వస్తే ఇప్పుడున్నవారిని తొలగించి… టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మాజీ మంత్రులు కళా వెంకట్రావు, పితాని సత్యనారాయణ వచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.
కొంత మంది మంత్రులపై అసంతృప్తి
రాష్ట్రంలో కొంతమంది మంత్రుల పని తీరుపై అసంతృప్తి వ్యక్తం అవుతుంది. ఇటు కార్యకర్తలు, అటు ప్రజలు మంత్రుల పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంత్రుల పనితీరుపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే సందర్భంలో కొంత మంది మంత్రుల పనితీరు ఆశించినంతగా లేదని స్పష్టం అయింది. అందువల్లనే పట్టుమని పది నెలలు కూడా గడవక ముందే కొంత మంది మంత్రుల పట్ల వ్యతిరేకత మొదలైంది. ఇది ప్రభుత్వానికి, టీడీపీ పార్టీకి నష్టంగా ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వాటిని సరిచేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతనిశ్చయంతో ఉన్నారు.
ఇప్పటికే మంత్రుల పనితీరుపై కూడా ఆయన దృష్టి పెట్టినట్లు సమాచారం. ఎందుకంటే మంత్రి సుభాష్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు క్లాస్ పీకినట్లు ఆడియో రికార్డు సోషల్ మీడియాలో కూడా కొద్దిరోజుల కిందట వైరల్ అయింది. ఇలా మంత్రివర్గ సమావేశాల్లోనూ, ఇతర సమయాల్లో పనితీరు బాగోలేని మంత్రులకు, వివాదాలకు కేంద్ర బిందువు అయిన మంత్రులకు క్లాస్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.
ఏ మంత్రితీరు పని ఎలా ఉంది? పని చేయని మంత్రులెవరని సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు రిపోర్టు తెప్పించుకున్నట్లు సమాచారం. ఆ నివేదిక ఆధారంగానే ఇద్దరు మంత్రులను తొలగించే అవకాశం ఉందని టీడీపీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం
టాపిక్