రౌడీ సర్కార్‌!

Best Web Hosting Provider In India 2024

బలవంతంగా కృష్ణా జిల్లా మల్లవల్లిలో భూముల స్వాధీనం 

ప్రభుత్వ ముఖ్య నేత కనుసైగతో కొనసాగిన దౌర్జన్యకాండ  

తెల్లారక ముందే పోలీసుల మోహరింపు  

ఒక్క నిర్వాసితుడూ బయటకు రాకుండా గృహ నిర్బంధం 

పారిశ్రామికవాడ భూముల్లో యుద్ధ ప్రాతిపదికన పనులు 

పరిహారం చెల్లించకుండానే లాక్కోవటంపై రైతుల ఆగ్రహం

విజయవాడ : శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటలకే ఇళ్ల చుట్టూ పోలీసులు.. అక్రమంగా గృహ నిర్భంధం.. అసలేం జరుగుతుందో తెలియని పరిస్థితి.. ఎందుకిలా చేస్తున్నారని అడిగితే సమాధానం చెప్పేవారే లేరు.. అక్కడందరూ తీవ్రవాదులు, దొంగలున్నట్లు ఈ పోలీసులేంటి.. వారి హడావుడి ఎందుకో తెలియక కృష్ణాజిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి వాసులు తల్లడిల్లిపోయారు. తాము దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వమే ఇలా దౌర్జన్యం చేస్తోందని తెలుసుకుని మండిపడ్డారు. 

పరిహారం కూడా ఇవ్వకుండా ఇలా బలవంతంగా లాక్కోవడమే­మిటని నిలదీస్తున్నారు. మల్లవల్లిలోని రీ సర్వే నంబర్‌ 11లో 1,460 ఎకరాల ప్రభుత్వ భూమిని 2016లో నాటి టీడీపీ ప్రభుత్వం పారిశ్రామిక అవసరాల నిమిత్తం ఏపీఐఐసీకి కేటాయించింది. అప్పటికే ఆ భూమిని దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న నిరుపేదలకు ఎకరాకు రూ.7.50 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. ఇలా సేకరించిన భూమిలోంచి గ్రామ సామాజిక అవసరాలు, ఇళ్ల స్థలాల పంపిణీ నిమిత్తం 100 ఎకరాలు కేటాయిస్తామని జీవో 456 కూడా జారీ చేసింది. 

రైతు కూలి పనులు చేసుకుని బతికే భూమి లేని తెల్లరేషన్‌ కార్డుదారులకు రూ.50 వేలు సాయం అందిస్తామని కూడా హామీ ఇచ్చింది. అంతా బాగానే ఉందనుకున్న తరుణంలో రీ సర్వే నంబర్‌ 11లోని సాగుదారుల ఎంపిక ప్రహసనంగా మారింది. రాజకీయ కక్ష సాధింపులకు వేదికైంది. టీడీపీ నేతల ప్రోద్బలంతో రెవిన్యూ అధికారులు పలువురు సాగుదారులకు పరిహారం దక్కకుండా చేశారు. దీంతో దాదాపు 150 మంది రైతులు నాటి నుంచి పరిహారం కోసం దఫదఫాలుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. 

ఈ నేపథ్యంలో 2024 సార్వత్రిక ఎన్నికల ముందు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌.. స్వయంగా మల్లవల్లి వచ్చి ఏపీఐఐసీ భూ నిర్వాసితుల అందోళనకు మద్దతు తెలిపారు. త్వరలో ప్రభుత్వం తప్పక మారుతుందని, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే నిర్వాసితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక సీన్‌ రివర్స్‌ అయింది. 

పరిహారం ఇవ్వకుండానే భూములు లాక్కోవాలని చూస్తోంది. సామాజిక అవసరాలకు కేటాయించిన 100 ఎకరాల భూమిని కూడా తిరిగి వెనక్కు తీసుకునేందుకు తెర వెనుక మంత్రాంగం మొదలుపెట్టింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు కొద్ది రోజులుగా ఆందోళన బాట పట్టారు.

పోలీసుల బలగాలతో భూముల స్వాధీనం 
మల్లవల్లిలో ఏపీఐఐసీ పారిశ్రామికవాడకు ప్రభుత్వం కేటాయించిన భూమిలో దాదాపు 300–400 ఎకరాలకు నష్టపరిహారం చెల్లించక పోవటంతో ఇంకా ఆ భూమి సాగుదారుల చేతిలోనే ఉంది. ఈ భూమితో పాటు సామాజిక అవసరాలు, ఇళ్ల స్థలాల పంపిణీకి కేటాయించిన 100 ఎకరాల భూమిని కూడా తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు కార్యాచరణ చేపట్టింది. దీని కోసం 15 మంది తహసీల్దార్లు, రెవెన్యూ యంత్రాంగంతో గుడివాడ, ఉయ్యూరు ఆర్డీవోలు సుబ్రహ్మణ్యం, బీఎస్‌ హేలా షారోన్‌ రంగంలోకి దిగారు. 

హనుమాన్‌ జంక్షన్‌ సీఐ కేవీవీఎన్‌ సత్యనారాయణ నేతృత్వంలో శుక్రవారం తెల్లవారుజామున సుమారు వెయ్యి మంది పోలీసులు గ్రామంలో, పారిశ్రామికవాడలో మోహరించారు. భూ నిర్వాసితుల పోరాటానికి నాయకత్వం వహిస్తున్న చిన్నాల వర ప్రసాద్, పంతం కామరాజు, బొకినాల సాంబశివరావులతో పాటుగా మరో ఎనిమిది మందిని శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటలకే పోలీసులు గృహ నిర్బంధం చేశారు. వారి సెల్‌ ఫోన్లు లాక్కున్నారు. 

వీరి ఇళ్ల వద్ద ఒక ఎస్‌ఐ, ఏఎస్‌ఐ, తహసీల్దార్‌ స్థాయి అధికారులు సహా పది మంది కానిస్టేబుళ్లను బందోబస్తులో ఉంచారు. ప్రతి సాగుదారుని ఇంటి వద్ద పోలీసులను ఉంచి, వారిని ఇంట్లో నుంచి బయటకు రానివ్వలేదు. గ్రామంలోని ముఖ్య కూడళ్లు, పారిశ్రామికవాడలోని వివాదాస్పద ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న తహసీల్దార్లు, సర్వేయర్లను రప్పించి.. ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ బాబ్జి పర్యవేక్షణలో పారిశ్రామికవాడలో సర్వే పనులు చేపట్టారు. 

ప్రొక్లెయిన్లు, బుల్‌డోజర్లు, ఇతర యంత్రాలను పెద్ద సంఖ్యలో తీసుకువచ్చి జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు కూడా మొదలు పెట్టారు. సాగుదారుల చేతుల్లో ఉన్న భూములను సైతం చదును చేశారు. ఆ వెంటనే ఏపీఐఐసీ ప్లాట్ల విభజన పనులు కూడా శరవేగంగా చేపట్టారు.

ప్రభుత్వ ముఖ్య నేత కన్ను
మల్లవల్లి పారిశ్రామికవాడలో రూ.కోట్ల విలువైన భూమిపై ప్రభుత్వంలోని ఓ ముఖ్య ప్రజాప్రతినిధి కన్ను పడినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో సాగుదారుల చేతిలో ఉన్న భూమితో పాటు గతంలో సామాజిక అవసరాలు, ఇళ్ల స్థలాల పంపిణికి కేటాయించిన భూమిని సైతం తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగింది. 

ఇందులో భాగంగా స్థానిక ప్రజాప్రతినిధిని రంగంలోకి దింపి, ఈ వ్యవహారం చక్కబెట్టేలా దిశా నిర్దేశం చేసిందని తెలుస్తోంది. వందల ఎకరాల భూమిని కారుచౌకగా కొట్టేసి, ఆపై పారిశ్రామిక వేత్తలకు అధిక ధరతో అప్పగించాలని వ్యూహం రచించింది. 

Best Web Hosting Provider In India 2024