Best Web Hosting Provider In India 2024
AP Mid Day Meal Scheme : జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం ప్రారంభం.. ఏ రోజు ఏం పెడతారు.. మెనూ ఇదే
AP Mid Day Meal Scheme : కొత్త ఏపీలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పండగ వాతావరణం నెలకొంది. మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం పునః ప్రారంభించారు. ఇంటర్మీడియట్ బోర్డు నుంచి కళాశాలలకు వచ్చిన ఆదేశాలతో.. మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రారంభించారు. దీని మెనూ ఇలా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. విజయవాడ పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని పునఃప్రారంభించారు. బాగా చదువుకుంటేనే మంచి ఉద్యోగం వస్తుందని.. మంచి ఉద్యోగం వస్తే కుటుంబాన్ని బాగా చూసుకోవచ్చని లోకేష్ విద్యార్థులకు సూచించారు. ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు.
పవన్ ట్వీట్..
‘జూనియర్ కళాశాల విద్యార్థులకు సైతం ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’ ద్వారా నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. సరైన ఆహారం ఉన్నప్పుడే విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టగలుగుతారనే ఉద్దేశంతో.. కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న ఆహారం ఇకపై కళాశాల విద్యార్థులకు సైతం అందనుంది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబును మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే ఈ పథకాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఈ రోజు ప్రారంభిస్తున్న విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌కు ప్రత్యేక ధన్యవాదాలు’ అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.
మెనూ ఇదే..
సోమవారం.. హాట్ పొంగల్, ఉడికించిన గుడ్డు/ కూరగాయల పలావ్, గుడ్డుకూర, వేరుశెనగ చిక్కీ
మంగళవారం.. పులిహోర, టమోటా పచ్చడి/దొండకాయ పచ్చడి, ఉడికించిన గుడ్డు, రాగిజావ
బుధవారం.. కూరగాయల అన్నం, బంగాళదుంప కుర్మా, ఉడికించిన గుడ్డు, వేరుశెనగ చిక్కీ
గురువారం.. సాంబార్ బాత్/లెమన్ రైస్, ఉడికించిన గుడ్డు, రాగిజావ
శుక్రవారం.. అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, వేరుశెనగ చిక్కీ
శనివారం.. ఆకుకూర అన్నం, పప్పుచారు, తీపి పొంగలి, రాగిజావ
వీరేం పాపం చేశారు..
ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో అమలు చేయడం లేదు. ఇక్కడ చదివేది పేద విద్యార్థులే. గత తెలుగుదేశం ప్రభుత్వం ప్రభుత్వ కళాశాలలతో పాటు.. ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అమలు చేసింది. ఈసారి ఎయిడెడ్ కాలేజీలను పక్కన పెట్టింది. ఈ కళాశాలల్లోనూ వేలాదిమంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ కళాశాలల్లో కూడా మధ్యాహ్న భోజనం పథకం అమలు చేసి ఉంటే.. పేద విద్యార్థులకు ప్రయోజనం ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
టాపిక్