Best Web Hosting Provider In India 2024
Warangal Crime News : ఆస్తి తగాదాలు…! సొంత అన్నపై తమ్ముడి హత్యాయత్నం
Warangal Crime News :ఆస్తి తగాదాలతో సొంత అన్నపై తమ్ముడి హత్యాయత్నం చేశాడు. ఈ ఘటన వరంగల్ నగరంలో జరిగింది. మెడ, గొంతుపై కత్తితో దాడి చేసే ప్రయత్నం చేయగా… గొంతు, దవడ భాగంలో కత్తి గాట్లు పడ్డాయి. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వరంగల్ నగరంలో మరో హత్యాయత్నం కలకలం రేపింది. కొద్దిరోజుల కిందట రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయి దారుణ హత్యతో ట్రై సిటీలో తీవ్ర సంచలనం చెలరేగగా.. ఆ తరువాత అడపా దడపా దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో అసలు వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఏం జరుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా శనివారం సాయంత్రం వరంగల్ ఎల్బీ నగర్ ప్రాంతంలో సొంత అన్నపైనే తమ్ముడు కత్తి దూసాడు.
ఆస్తి తగాదాల నేపథ్యంలో అన్నను చంపేందుకు కత్తితో దాడి చేయగా.. ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. వరంగల్ ఎల్ బీ నగర్ ప్రాంతానికి చెందిన ఐలోని పాపయ్య అనే వృద్ధుడికి ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉంది. అందులో ఐలోని చిరంజీవి(60) పెద్దవాడు కాగా, ఐలోని శంకర్ చిన్నవాడు. ఇదిలాఉంటే ఐలోని పాపయ్య గతంలో వరంగల్ ఎల్బీ నగర్ ప్రాంతంలో 90 గజాల స్థలం సంపాదించగా.. దానిని ముగ్గురు కొడుకులకు సమానంగా ఇచ్చేందుకు నిర్ణయించుకున్నాడు.
ఇందులో చిరంజీవి తన ఇద్దరు తమ్ముళ్లతో మాట్లాడుకుని, వారికి డబ్బులు చెల్లించి ఆ స్థలాన్ని తాను తీసుకునేందుకు పెద్ద మనుషుల సమక్షంలో తీర్మానం కూడా చేసుకున్నారు. ఈ మేరకు సంతకాలు కూడా చేసి, రూ.5వేలు భయానాగా కూడా ఇచ్చాడు. ఇంతలోనే ఏం జరిగిందో ఏమో కానీ పాపయ్య ఆ 90 గజాల స్థలాన్ని చిరంజీవి మినహా మిగతా ఇద్దరు కొడుకుల పేరున రిజిస్ట్రేషన్ చేశాడు. దీంతో కొద్ది రోజులుగా చిరంజీవి తన తండ్రి పాపయ్యను నిలదీస్తుండటంతో చిన్నవాడైన ఐలోని శంకర్ తరచూ వాగ్వాదానికి దిగుతున్నాడు.
ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఇదే విషయమై మాట్లాడేందుకు చిరంజీవి, తన కొడుకు శివ ఇద్దరూ కలిసి వరంగల్ చౌరస్తా ప్రాంతంలో పాపయ్య ఉండే ఇంటి వద్దకు వెళ్లారు. ఇద్దరూ కలిసి పాపయ్యతో మాట్లాడుతుండగా.. ఇంతలోనే ఐలోని శంకర్ కత్తితో దూసుకొచ్చాడు. తనతో తెచ్చుకున్న కత్తితో తన అన్న చిరంజీవిపై దాడికి దిగాడు. మెడ, గొంతుపై కత్తితో దాడి చేసే ప్రయత్నం చేయగా.. చిరంజీవి తప్పించుకునేందుకు ప్రయత్నం చేశాడు. దీంతో గొంతు, దవడ భాగంలో చిరంజీవికి కత్తి గాట్లు పడ్డాయి. తీవ్ర రక్త స్రావం జరగగా.. స్థానికులు శంకర్ ను పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇంతలోనే ఆయన అక్కడి నుంచి పరారయ్యాడు.
ఎంజీఎం ఆసుపత్రికి తరలింపు
ఆస్తి తగాదాల నేపథ్యంలో సొంత తమ్ముడి చేతిలో గాయపడిన చిరంజీవికి తీవ్ర రక్త స్రావం జరిగింది. దీంతో స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. అనంతరం అంబులెన్స్ సిబ్బంది అక్కడకు చేరుకుని ఐలోని చిరంజీవిని హుటాహుటిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఎమర్జెన్సీ వార్డులో ఆయనను అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు. గొంతు వద్ద కత్తి గాట్లు తీవ్రంగా పడటం, రక్త స్రావం కూడా ఎక్కువగానే జరగడంతో చిరంజీవి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా చిరంజీవి కుమారుడు శివ ఫిర్యాదు మేరకు ఇంతేజార్ గంజ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి),
సంబంధిత కథనం
టాపిక్