Best Web Hosting Provider In India 2024
HYDRA Prajavani : ఇక ప్రతి సోమవారం ‘హైడ్రా ప్రజావాణి’ – సందేహాలుంటే ఈ నెంబర్లను సంప్రదించండి
HYDRAA Prajavani Program : హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి సోమవారం ‘ప్రజావాణి’ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది. ఫిర్యాదుదారుల నుంచి నేరుగా దరఖాస్తులను స్వీకరించనుంది. ఏమైనా సందేహాలుంటే 040 – 29565758, 29560596 నంబర్లను సంప్రదించాలని ప్రకటన విడుదల చేసింది.
హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులు, నాలాల రక్షణే ప్రధాన ధ్యేయంగా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎస్సెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా)ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిదే. ఈ హైడ్రాకు విస్తృతాధికారాలు ఉన్నాయి. ఇటీవలనే వార్షిక నివేదిక కూడా విడుదలైంది. హైడ్రా ఇప్పటివరకు 8 చెరువులు, 12 పార్కులను కాపాడిందని పేర్కొంది. వందల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది.
ప్రతి సోమవారం ప్రజావాణి…
అక్రమ నిర్మాణాల విషయంలో దూకుడుగా ముందుకెళ్తున్న హైడ్రా… తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఫిర్యాదుదారుల నుంచి నేరుగా దరఖాస్తులను స్వీకరించనుంది. ఈ మేరకు హైడ్రా కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
ప్రతి సోమవారాన్ని( ప్రభుత్వ సెలవులు మినహాయించి) ఫిర్యాదుల స్వీకరణకు హైడ్రా కేటాయించింది. చెరువులు, ప్రభుత్వ స్థలాలు,నాలాలు, పార్కులు ఇలా ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు పరిరక్షణలో ప్రజలను భాగస్వామ్యం చేసే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హైడ్రా కమిషన్ రంగనాథ్ తెలిపారు. ప్రతి సోమవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు.
టైమింగ్స్ వివరాలివే…
ప్రజల నుంచి ఫిర్యాదులతో పాటు సలహాలను కూడా స్వీకరించడానికి ఈ కార్యక్రమం ఉంటుందని రంగనాథ్ వివరించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు, తిరిగి 3.00 గంటల నుంచి 5.30 గంటల వరకూ రాణిగంజ్‌లోని బుద్ధభవన్‌లో ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు.
ఫిర్యాదుకు సంబంధించిన అన్ని ఆధార పత్రాలతో పాటు పూర్తి వివరాలు తీసుకుని కార్యాయానికి రావాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు. కేవలం ఫిర్యాదులు మాత్రమే కాకుండా సలహాలు కూడా స్వీకరిస్తామని స్పష్టం చేశారు. ఏమైనా సందేహాలుంటే 040 – 29565758, 29560596 నంబర్లలో హైడ్రా కార్యాలయాన్ని సంప్రదించవచ్చని తాజా ప్రకటనలో వెల్లడించారు.
మాదాపూర్ లో అక్రమ నిర్మాణాల పరిశీలన:
మరోవైపు హైడ్రా కూల్చి వేతల పర్వం కొనసాగుతోంది. శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ విలేజీలోని అయ్యప్ప సొసైటీలో 684 గజాలలో అక్రమంగా నిర్మించిన భవనాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ శనివారం పరిశీలించారు.
జీహెచ్ ఎంసీ నోటీసులు, హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా.. సెల్లార్, గ్రౌండ్‌ఫ్లోర్‌తో పాటు 5 అంతస్తుల భవనాన్ని నిర్మించడంపై ఫిర్యాదులు అందాయి. దీంతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. హైడ్రా, రెవెన్యూ, జీహెచ్ ఎంసీ అధికారులతో కలసి అయ్యప్ప సొసైటీలోని వంద ఫీట్ల రోడ్డుకు ఆనుకుని ఉన్న కట్టడాన్ని పరిశీలించారు. అక్కడికక్కడే జీహెచ్ ఎంసీ చందానగర్ సర్కిల్ అధికారులు ఇచ్చిన షోకాజ్ నోటీసులతో పాటు హైకోర్టు ఉత్తర్వులను రంగనాథ్ పరిశీలించారు.
అక్రమ కట్టడమని హైకోర్టు నిర్ధారించాక కూడా కోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా భవనాన్ని నిర్మించడాన్ని రంగనాథ్ తీవ్రంగా పరిగణించారు. ఈ అక్రమ భవన నిర్మాణాన్ని కూల్చివేస్తున్నట్టు 14.2.24న షోకాజ్ నోటీసులను జీహెచ్ ఎంసీ జారీ చేసిందని… అలాగే 26.2.24న స్పీకింగ్ ఆర్డర్ కూడా ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ తర్వాత హైకోర్టు కూడా రిట్ పిటిషన్ నంబరు 10030 ఆఫ్ 2024 పై స్పందిస్తూ అక్రమ నిర్మాణమని నిర్ధారించడమే కాకుండా చర్యలు తీసుకోవాలని 19.4.24 తేదీన ఆదేశించిందని చెప్పారు.
హైకోర్టు ఆర్డర్ ను ఆధారంగా తీసుకుని 13.06.2024 తేదీన ఇదే భవనం అక్రమమని జీహెచ్ ఎంసీ కొంత భాగాన్ని కూల్చివేసిందని రంగనాథ్ వివరించారు. ఇవేవీ పట్టించుకోకుండా నిర్మాణాన్ని కొనసాగించారంటూ స్థానిక అధికారుల నుంచి హైడ్రాకు ఫిర్యాదులు అందాయని తెలిపారు.
కూల్చివేతలకు రంగం సిద్ధం…
మాదాపూర్‌లోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు హైడ్రా రంగం సిద్ధం చేసింది. లేకుండా నిర్మిస్తున్న భారీ భవనాన్ని కూల్చివేయనుంది. నిన్ననే హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా వచ్చి పరిశీలించటంతో… ఇవాళ హైడ్రా బుల్డోజర్లు అక్కడికి చేరుకొని నేలమట్టం చేయనున్నారు.
సంబంధిత కథనం
టాపిక్