Best Web Hosting Provider In India 2024
Atul Subhash case : అతుల్ సుభాష్ భార్యకు బెయిల్ మంజూరు- ఇతర నిందితులకు కూడా..!
Atul Subhash wife bail : బెంగళూరు టెక్కీ ఆత్మహత్య కేసులో భార్య నికితా సింఘానియా, ఆమె తల్లి నిషా, సోదరుడు అనురాగ్‌లకు బెంగళూరు సిటీ సివిల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మానసిక క్షోభ, వైవాహిక సమస్యలను వివరిస్తూ డెత్ నోట్ రాసిన అతుల్ సుభాష్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలపై వీరిని అరెస్టు చేశారు.
గతేడాది సంచలనం సృష్టించిన బెంగళూరు టెక్కీ అతుల్ సుభాష్ కేసులో కీలక అప్డేట్! నిందితులుగా ఉన్న అతుల్ సుభాష్ భార్య నికితా సింఘానియా, అతని అత్త నిషా సింఘానియా, అతని బావమరిది అనురాగ్ సింఘానియాలకు బెంగళూరు సిటీ సివిల్ కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది.
అతుల్ సుభాష్ కేసు..
బెంగళూరులోని ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న అతుల్ సుభాష్ (34) తన మానసిక క్షోభ, వైవాహిక సమస్యలు, తన భార్య, ఆమె బంధువులు, ఉత్తరప్రదేశ్‌కి చెందిన న్యాయమూర్తి వేధింపులను వివరిస్తూ 24 పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సూసైడ్ నోట్‌తో పాటు యూట్యూబ్ లైవ్ వీడియోలో అనేక విషయాలను వెల్లడించాడు.
అతుల్ సుభాష్ సోదరుడి ఫిర్యాదు మేరకు బెంగళూరు పోలీసులు నికిత, నిషా, అనురాగ్, సుశీల్ సింఘానియాలపై ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కేసు నమోదు చేశారు. అనంతరం ఈ కేసులో నికితా సింఘానియా, ఆమె తల్లి, సోదరుడిని పోలీసులు డిసెంబర్ 14న అరెస్టు చేశారు.
హరియాణాలోని గురుగ్రామ్‌లో నికితా సింఘానియాను అరెస్టు చేశారు. అదే సమయంలో అతుల్ సుభాష్ ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు ఆమె తల్లి నిషా సింఘానియా, సోదరుడు అనురాగ్ సింఘానియాను ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అదుపులోకి తీసుకున్నట్లు బెంగళూరు పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
డిసెంబర్లో వీరిని అరెస్టు చేసి బెంగళూరుకు తీసుకువచ్చి స్థానిక కోర్టులో హాజరుపరిచిన అనంతరం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
కాగా, 24 పేజీల సూసైడ్ నోట్‌ను ఫోరెన్సిక్స్‌కు పంపామని, అయితే దాన్ని ఇంకా పరిగణనలోకి తీసుకోలేదని బెంగళూరు టెక్కీ అతుల్ సుభాష్ కుటుంబం తరఫు న్యాయవాది వినయ్ సింగ్ తెలిపారు. అతని సూసైడ్ వీడియోను కూడా ఫోరెన్సిక్‌కు పంపించారని, చేతిరాతను కూడా పరిశీలిస్తున్నారని చెప్పారు. ఆర్డర్ షీట్ కోసం ఎదురు చూస్తున్నామని, తమ వాదన వాస్తవిక సమాచారంపై, వేధింపులపై ఆధారపడి ఉందని న్యాయవాది స్పష్టం చేశారు.
“మేము దానిని (బెయిల్ ఆర్డర్) సవాలు చేస్తాము. ఆర్డర్ షీట్ చూసి, విశ్లేషించిన తర్వాత కర్ణాటక హైకోర్టును ఆశ్రయించవచ్చు,” అని న్యాయవాది సింగ్ పేర్కొన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసులో నికితా సింఘానియా మేనమామ సుశీల్ సింఘానియాకు అలహాబాద్ హైకోర్టు డిసెంబర్లోనే ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
అతుల్ సుభాష్‌కి 2019లో వివాహం జరిగింది. వీరికి 2020లో కుమారుడు జన్మించాడు. కాగా అతుల్ సుభాష్ సూసైడ్ నోట్‌ను తనకు అనుబంధంగా ఉన్న ఓ స్వచ్ఛంద సంస్థ వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేయగా.. వివాహం జరిగినప్పటి నుంచి తాను ఎదుర్కొంటున్న వైవాహిక సమస్యలను వివరించాడు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link