Best Web Hosting Provider In India 2024
AP Lands Resurvey : ఏపీలో జనవరి 20 నుంచి భూముల రీసర్వే, త్వరలో 22ఏ భూములపై నిషేధం ఎత్తివేత
AP Lands Resurvey : ఏపీలో జనవరి 20 నుంచి భూముల రీసర్వే చేపట్టనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. త్వరలో 22ఏ భూములపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. సంక్రాంతి తర్వాత కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
AP Lands Resurvey : వైసీపీ ప్రభుత్వంలో రీసర్వే చేసిన గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తే లక్షా 80 వేల ఫిర్యాదులు వచ్చాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ముఖ్యంగా 22-ఎ జాబితాలో అక్రమంగా ప్రజల భూములను చేర్చారని ఆరోపించారు. అందుకే త్వరలో 22-ఎ భూములపై నిషేధాన్ని ఎత్తివేసి, ఈసారి పకడ్బందీ రీసర్వే చేపడుతుందని ప్రకటించారు.
జనవరి 20 నుంచి భూముల రీసర్వే
పేదలకు, అసలైన భూ యజమానులకు మేలు జరిగేలా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఏపీలో 22ఏ భూములపై నిషేధం ఎత్తివేస్తామన్నారు. గత ప్రభుత్వంలో 22-ఎ దుర్వినియోగం చేశారన్నారు. 22-ఎ జాబితా నుంచి 4.5 లక్షల ఎకరాలను తప్పించారన్నారు. 7 వేల ఎకరాలను అక్రమంగా రిజిస్టర్ చేశారని ఆరోపించారు. నాటి భూ అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకే 22-ఎ భూముల పై నిషేధం ఎత్తివేస్తామని ప్రకటించారు. జనవరి 20వ తేదీ నుంచి భూముల రీ సర్వే చేపట్టనున్నట్లు ప్రకటించారు. సంక్రాంతి తర్వాత కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
ఏపీలో 1.88 కోట్ల ఎకరాల భూములు 22ఏ నిషేధిత జాబితాలో ఉన్నాయని ఇటీవల మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. వీటిలో దేవదాయ, ప్రభుత్వ భూములు, ఇతర కేటగిరీ భూములు ఉన్నాయన్నారు. దేవదాయ, ప్రభుత్వ భూములు మినహా పేదలకు నివేశనా స్థలాలు, సాగు పట్టాలుగా ఇచ్చినవి దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ 22ఏలోనే ఉన్నాయన్నారు. దీంతో పేదలకు లబ్ధి కలిగించాలన్న ఉద్దేశంతో వాటిని 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. వైసీపీ హయాంలో పేదల భూములను కొట్టేయాలనే ఉద్దేశంతో అక్రమంగా కొందరి భూములను 22ఏలో చేర్చారన్నారు. 22ఏ కేటగిరీపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. రెవెన్యూ సదస్సులలో ముఖ్యంగా 32 రకాల అర్జీలు వస్తున్నాయని, ఆర్‌ఓఆర్‌కు సంబంధించి 1.01 లక్షల అర్జీలు, సర్వే వివాదాలపై 7 వేల అర్జీలు వచ్చాయన్నారు.
ఈ నెల 20 తేదీ వరకు రెవెన్యూ సదస్సులు జరుగుతాయని మంత్రి తెలిపారు. అప్పటి నుంచి 45 రోజుల లోపు ఈ సదస్సుల్లో వచ్చిన గ్రీవెన్స్ ను పరిష్కరిస్తామని చెప్పారు. ఈనెల 20 తేదీ నుంచి రీసర్వేను తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో మాదిరి కాకుండా ఈసారి చాలా పకడ్బందీగా రీ సర్వే నిర్వహిస్తామన్నారు. ప్రతి మండలంలో గ్రామాన్ని ఒక యూనిట్ గా తీసుకొని రీసర్వే చేస్తామని, ఇందులో అధికారులు, ప్రజా ప్రతినిధులు అందరూ పాల్గొంటారని చెప్పారు. ఎలాంటి హడావిడి లేకుండా ఎలాంటి తప్పులకు అవకాశం ఇవ్వకుండా రోజుకు 20 ఎకరాలు మాత్రమే ఒక టీమ్ రీ సర్వే చేస్తుందని చెప్పారు. రీ సర్వే జరిపిన గ్రామాల్లో సభలు నిర్వహిస్తే లక్షా 80 వేల ఫిర్యాదులు వచ్చాయని, వాటన్నింటినీ కూడా పరిష్కరించి వారికి కొత్త పాస్ పుస్తకాలు ఇస్తామని చెప్పారు.
మిగిలిన వారికి సంక్రాంతి పండుగ తర్వాత కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ పాస్ పుస్తకంపై రాజముద్రతోపాటు క్యూర్ కోడ్ ఉంటుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. అలాగే ఈనామ్, ఎస్టేట్ బూములను సెటిల్ చేసి పట్టాలు ఇవ్వాలని పలువురు కోరారు. ఫారెస్ట్, రెవెన్యూ భూముల మధ్య స్పష్టమైన సరిహద్దులను నిర్ణయించాలని కోరారు. పట్టణాల్లో ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు కట్టుకున్న సామాన్యులకు వెంటనే రెగ్యూలరైజ్ చేయాలని కోరారు.
సంబంధిత కథనం
టాపిక్