Best Web Hosting Provider In India 2024
Janasena Plenary: మార్చిలో పిఠాపురంలో జనసేన ప్లీనరీ.. బహిరంగ సభకు సన్నాహాలు..
Janasena Plenary: గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయంతో ఊపు మీదున్న జనసేన పార్టీ ఈ ఏడాది పార్టీ ప్లీనరీ ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రాతనిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజక వర్గంలో జనసేన ప్లీనరీ నిర్వహించబోతున్నారు.
Janasena Plenary: పార్టీ పెట్టిన తర్వాత 11వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న జనసేన పార్టీ ప్లీనరీని ఘనంగా నిర్వహించేందుకు సిద్దమవుతోంది. పార్టీ పురుడు పోసుకున్న పదేళ్ల తర్వాత గత ఏడాది ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్చిలో జరిగే ప్లీనరీని ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ భావిస్తోంది.
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించ తలపట్టిన ప్లీనరీ కోసం శాసన మండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్ ఆధ్వర్యంలో స్థల పరిశీలన చేపట్టారు.
మార్చి 12, 13, 14 తేదీలలో జరిగే ప్లీనరీకి రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలి రానున్న నేపథ్యంలో కార్యక్రమ నిర్వహణ, సౌకర్యాల కల్పనకు అనువుగా ఉండే విధంగా ప్రాంగణాన్ని సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశించడంతో సభకు వచ్చే పార్టీ శ్రేణులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆదివారం పిఠాపురం నియోజకవర్గం పరిధిలో పలు స్థలాలను పరిశీలించారు. ఎమ్మెల్సీ హరిప్రసాద్‌తో పాటు కార్యక్రమాల నిర్వహణ విభాగం కన్వీనర్ కళ్యాణం శివశ్రీనివాస్, పిఠాపురం ఇంఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, పార్టీ నేతలు వై శ్రీనివాస్ తదితర నాయకులు ప్లీనరీ నిర్వహణ కోసం పలు స్థలాలను పరిశీలించారు.
సంకు రాత్రి ఫౌండేషన్‌కు జనసేన మద్దతు
కాకినాడ జిల్లాలో సంకురాత్రి ఫౌండేషన్ కిరణ్ కంటి ఆసుపత్రిని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ బృందం సందర్శించింది. ఆదివారం ఉదయం కాకినాడ సమీపంలోని ఆసుపత్రిని పరిశీలించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు పద్మశ్రీ సంకురాత్రి చంద్రశేఖర్‌తో సమావేశమై సంకురాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజలకు అందిస్తున్న సేవలను, కిరణ్ కంటి ఆసుపత్రి ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు.
ఇటీవల చంద్రశేఖర్ మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్‌ను కలిసి సంకురాత్రి ఫౌండేషన్ ద్వారా చేపడుతున్న ప్రజోపయోగ కార్యక్రమాలు, సేవలను వివవరించారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. సేవా కార్యక్రమాలు మరింత విస్తృతపరిచేందుకు పవన్ కళ్యాణ్ సహాయసహకారాలు కావాలని కోరారు.
ఈ నేపథ్యంలో పార్టీ నుంచి ఓ బృందాన్ని సంకురాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ కిరణ్ ఆసుపత్రికి పంపారు. ఈ బృందం చంద్రశేఖర్ గారితో సమావేశమై పలు అంశాలపై చర్చించింది. ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాలకు జనసేన పార్టీ మద్దతు ఉంటుందని శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆపరేషన్ థియేటర్ ను అత్యున్నత సాంకేతిక సంపత్తితో ఆధునీకరించినట్లు తెలిపిన చంద్రశేఖర్ , వీలయితే ఆపరేషన్ థియేటర్ ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ప్రారంభించే అవకాశం కల్పించాలని కోరారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్తామని పిడుగు హరిప్రసాద్ తెలియచేశారు. ఫౌండేషన్ చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలకు జనసేన మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.
టాపిక్