Best Web Hosting Provider In India 2024
Chhattisgarh journalist murder : సంచలనం సృష్టించిన జర్నలిస్ట్ హత్య కేసు నిందితుడు అరెస్ట్
Chhattisgarh journalist murder case : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఛత్తీస్‌గఢ్ జర్నలిస్ట్ హత్య కేసు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొందరు నిందితులు ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నారు.
జర్నలిస్ట్ ముఖేష్ చంద్రాకర్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన సురేష్ చంద్రాకర్‌ను ఛత్తీస్‌గఢ్ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం తెల్లవారుజామున అతడిని హైదరాబాద్‌లో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
“ముఖేష్ చంద్రాకర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు.. స్థానిక కాంట్రాక్టర్ సురేష్ చంద్రాకర్ని సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో సిట్ అధికారులు అరెస్టు చేశారు. నిందితుడిని విచారిస్తున్నాం,” అని బీజాపూర్ పోలీసులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
జర్నలిస్ట్ హత్య కేసుతో సంబంధం ఉన్న సురేష్ చంద్రాకర్ సోదరుడు రితేష్ చంద్రాకర్, సూపర్వైజర్ మహేంద్ర రామ్తేకే, దినేష్ చంద్రకర్‌లను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.
జర్నలిస్ట్ ముఖేష్ చంద్రాకర్ హత్య కేసు వివరాలు..
ముఖేష్ చంద్రాకర్ ఒక ప్రముఖ వార్తాసంస్థతో పాటు ఇతర న్యూస్ ఛానెళ్లలో స్థానిక రిపోర్టర్‌గా పనిచేసేవారు. ‘బస్తర్ జంక్షన్’ అనే యూట్యూబ్ ఛానల్‌ని కూడా నడిపేవారు. దీనికి 1,59,000 మందికి పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. 2021 ఏప్రిల్‌లో కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ మన్హాస్‌ని మావోయిస్టుల చెర నుంచి విడుదల చేయడంలో ముఖేష్ చంద్రాకర్ కీలక పాత్ర పోషించారు.
కాగా జనవరి 1న అదృశ్యమైన ముఖేష్ చంద్రాకర్ (33) మృతదేహం జనవరి 3న చటాన్ పారా ప్రాంతంలోని కాంట్రాక్టర్ సురేష్ చంద్రాకర్ ఇంటి ఆవరణలో కొత్తగా మూసివేసిన సెప్టిక్ ట్యాంకులో లభ్యమైంది. మృతుడి తల, వీపు, పొట్ట, ఛాతీపై బలమైన గాయాలున్నాయని పోలీసులు తెలిపారు.
ముఖేష్ కనిపించకుండా పోయిన 24 గంటల తర్వాత జనవరి 2న రాత్రి 7.30 గంటలకు అతని సోదరుడు యుకేష్ చంద్రాకర్.. కొత్వాలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభమైంది.
ఈ కేసు తదుపరి దర్యాప్తు కోసం బీజాపూర్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో పోలీసులు శనివారం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు.
కాగా బీజాపూర్‌లో రోడ్డు నిర్మాణ పనుల్లో జరిగిన అవినీతిని ఎత్తిచూపుతూ సదరు వార్తా సంస్థలో ఇటీవల వచ్చిన వార్తాకథనమే ఛత్తీస్‌గఢ్ జర్నలిస్ట్ హత్యకు కారణమై ఉండొచ్చని తెలుస్తోంది. ఇదే విషయంపై ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ సైతం అనుమానం వ్యక్తం చేశారు.
డిసెంబర్ 25న ప్రసారమైన ఈ నివేదిక ఆధారంగా పీడబ్ల్యూడీ దర్యాప్తు ప్రారంభించింది.
దర్యాప్తు ప్రకారం.. సురేష్ చంద్రాకర్ పనిలో జోక్యం చేసుకుంటున్నాడన్న విషయంపై అతని సోదరుడు రితేష్ చంద్రాకర్కి ముఖేష్‌కి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం హత్య జరిగి ఉండొచ్చు.
రాజకీయ దుమారం..!
మరోవైపు ఛత్తీస్‌గఢ్ జర్నలిస్ట్ హత్య సంచలనంగా మారడంతో ఆ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం రేగింది. ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ.. ప్రధాన నిందితుడు సురేష్ చంద్రాకర్ని కాంగ్రెస్ నేతగా, ఆఫీస్ బేరర్‌గా గుర్తించడంతో ఈ కేసు రాజకీయ మలుపు తిరిగింది! అయితే ఈ వాదనను ప్రదేశ్ కాంగ్రెస్ కమ్యూనికేషన్ విభాగం అధ్యక్షుడు సుశీల్ ఆనంద్ శుక్లా తిప్పికొట్టారు. సురేష్ చంద్రాకర్ ఇటీవల బీజేపీలో చేరినట్టు, పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు జీ వెంకట్ ఆయనకు స్వాగతం పలికినట్టు ఆరోపించారు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link