Best Web Hosting Provider In India 2024
Hyderabad RRR : రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం పర్యావరణంపై ప్రభావం చూపుతుందా.. 11 ముఖ్యమైన అంశాలు
Hyderabad RRR : తెలంగాణలో రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగాన్ని నిర్మించేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. దీని నిర్మాణంతో.. తెలంగాణ మరింత అభివృద్ధి చెందనుంది. అయితే.. అభివృద్ధి తోపాటు నష్టాలు కూడా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పర్యావరణంపై ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు.
రోడ్ల నిర్మాణంతో కనెక్టివిటీ పెరిగి.. అభివృద్ధికి అవకాశాలు విస్తృతం అవుతాయి. ఇది అందరూ ఒప్పుకునే అంశమే. అందుకు ఉదాహరణ ఓఆర్ఆర్. తాజాగా తెలంగాణలో రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కూడా అడుగులు పడుతున్నాయి. దీని ద్వారా మరింత అభివృద్ధి జరగనుంది. అయితే.. ఇలాంటి భారీ ప్రాజెక్టుల నిర్మాణం పర్యావరణంపై ప్రభావం చూపుతాయని మేథావులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అడవులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు పర్యావరణంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఓసారి చూద్దాం.
11 ముఖ్యమైన అంశాలు..
1.రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగం నిర్మాణం కారణంగా.. దాదాపు 56 వేల వృక్షాలు నేలకూలబోతున్నాయనే అంచనాలు ఉన్నాయి.
2.రోడ్డు నిర్మాణం కోసం భారీ సంఖ్యలో వృక్షాలను తొలగించాల్సి రావడం.. పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఉత్తర భాగం రోడ్డు అలైన్‌మెంటు పరిధిలో ఉన్న కారణంగా.. తొలగించేందుకు అటవీ శాఖ కూడా అనుమతించింది.
3.రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగాన్ని నిర్మించే 162 కి.మీ. పరిధిలో.. మూడు ప్రాంతాల్లో అటవీ భూములు ఉన్నాయి. అడవి గుండా రోడ్డు నిర్మిస్తే వన్యప్రాణుల సంచారానికి ఇబ్బందిగా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
4.ఈ నేపథ్యంలో అటవీ భూముల్లో ఏదో ఒక చివరి నుంచి అలైన్‌మెంటు సాగేలా కన్సల్టెన్సీ సంస్థ దృష్టి పెట్టింది. రోడ్డుకు ఓవైపు 95 శాతం అటవీ భాగం ఉంటే, మరోవైపు 5 శాతం వరకు మాత్రమే ఇతర భూమి ఉండేలా అలైన్‌మెంటును రూపొందించినట్టు తెలిసింది.
5.ముఖ్యంగా యాదాద్రి, గజ్వేల్, నర్సాపూర్ ప్రాంతాల్లో అటవీ భూములున్నాయి. మెదక్ జిల్లా పరిధిలో 35.5882 హెక్టార్లు, సిద్దిపేట జిల్లా పరిధిలో 28.2544 హెక్టార్లు, యాదాద్రి జిల్లా పరిధిలో 8.511 హెక్టార్లలో అటవీ భాగం అలైన్‌మెంటు పరిధిలోకి వచ్చింది.
6.ఈ ప్రాంతాల్లో 44 వేల వృక్షాలను తొలగించాల్సి ఉంటుందని అధికారులు లెక్క తేల్చారు. ఇక అటవీ భూముల వెలుపల ఉండే సాధారణ భూముల్లోని మరో 12 వేల వృక్షాలను తొలగించాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
7.మొత్తంగా రిజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం పరిధిలో.. దాదాపు 56 వేల వృక్షాలను తొలగించబోతున్నారు. ఇది పర్యావరణానికి పెద్దదెబ్బ అనే అభిప్రాయాలు ఉన్నాయి.
8.ఈ నేపథ్యంలో భవిష్యత్తులో వాటి లోటును భర్తీ చేయాలన్న ఉద్దేశంతో.. కోల్పోయిన చెట్లకు బదులుగా 3.30 లక్షల మొక్కలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఇందుకోసం మహబూబాబాద్ జిల్లాలో భూమిని ఎంపిక చేసినట్టు తెలిసింది.
9.మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి, నీలంపల్లి, గంగారం మండలంలోని చింతల్‌గూడ గ్రామాల్లో మొక్కతలను పెంచడానికి భూమిని గుర్తించారు. ఈ మూడు గ్రామాల పరిధిలో 3,29,452 చెట్లు పెరిగేలా త్వరలో మొక్కలు నాటనున్నారని అధికారులు చెబుతున్నారు.
10.రీజినల్ రింగ్ రోడ్డు నిర్మించే మార్గంలోని అటవీ ప్రాంతాల్లో.. చాలా రకాల జంతువులు ఉన్నాయని గుర్తించారు. వీటికి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోనున్నారు. జంతువులు ఒకవైపు నుంచి రోడ్డు దాటి మరోవైపు వెళ్లేలా.. ఎకో బ్రిడ్జీలు నిర్మించనున్నారు.
11.జంతువుల సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వాహనాల శబ్దాలు వాటిని ఇబ్బంది పెట్టకుండా.. రోడ్డుకు రెండు వైపులా నాయిస్ బారియర్స్ ఏర్పాటు చేసే అంశం పరిశీలనలో ఉందని అధికారులు చెబుతున్నారు.
టాపిక్