Best Web Hosting Provider In India 2024
HMPV: హెచ్ఎంపీవీ వైరస్ ఇండియాలోకి ఎంట్రీ, పిల్లలపైనే ఈ వైరస్ ప్రతాపం దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే
కరోనా చైనాలోనే పుట్టి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసింది. ఇప్పుడు మరొక ప్రాణాంతక వైరస్ చైనాలో పుట్టింది. ఇది ఇతర దేశాలకు చేరే అవకాశం ఎక్కువగానే ఉంది. దీని లక్షణాలు ఎలా ఉంటాయో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.
కరోనా మహమ్మారి సృష్టించిన అల్లకల్లోలాన్నీ ఎప్పటికీ మర్చిపోలేము. ఐదేళ్ల వరకు ఇప్పటికీ కరోనా కేసులు బయటపడుతూనే ఉన్నాయి. కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య కూడా లక్షల్లోనే ఉంది. ఇప్పుడు చైనాలో మరొక అలాంటి ప్రాణాంతక వైరస్ పుట్టింది. దాని పేరే హ్యూమన్ మోటానిమో వైరస్. దీన్ని హెచ్ఎంపివి (HMPV) అని పిలుస్తారు. ఈ కొత్త వైరస్ కు చెందిన కేసులు ఉత్తర చైనాలో అధికంగా నమోదవుతున్నాయి. ఈ వైరస్ సోకిన వారిలో కూడా కోవిడ్ 19 లక్షణాలే కనిపించడం అందరిని ఆందోళనకు గురిచేస్తుంది. ఇప్పుడు మలేషియాకు ఈ వైరస్ చేరుకుంది. తాజాగా మన దేశంలో కూడా ఒక చిన్నారిలో హెచ్ఎంపీవీ లక్షణాలు బయటపడ్డాయి. బెంగుళూరులోని ఎనిమిది నెలల చిన్నారికి ఈ వైరస్ సోకినట్టు అనుమానిస్తున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చైనాలో పుట్టిన ఈ వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అన్ని దేశాలను హెచ్చరించింది. సోషల్ మీడియాలో చైనాలో ఈ వైరస్ బారిన పడి ఆస్పత్రులు చుట్టూ తిరుగుతున్న వారి వీడియోలు వైరల్ గా మారాయి. ఫ్లూ వంటి లక్షణాలు ఈ రోగుల్లోనూ కనిపిస్తున్నాయి.
తొలిసారి చైనాలో డిసెంబర్ మూడో వారంలో శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు చైనా ప్రభుత్వం గుర్తించింది. వారిలో హ్యూమన్ మెటానిమో వైరస్, రైనో వైరస్ కేసులు అధికంగా ఉన్నట్టు గుర్తించింది. ముఖ్యంగా 14 లోపు వయసున్న చిన్నారుల్లో ఈ వైరస్ అధికంగా ఉన్నట్టు కనుగొన్నారు. దీంతో చైనా సరిహద్దు దేశాల్లో ఆందోళన పెరిగిపోయింది. చైనా నుంచి కరోనా వైరస్ అన్ని దేశాలకు ప్రయాణించి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఇంకా ఆ జ్ఞాపకాల నుంచి బయటికి రాకముందే ఇప్పుడు చైనాలో మరొక వైరస్ పుట్టడం ఆరోగ్య వ్యవస్థను భయపడుతోంది.
HMPV వైరస్ లక్షణాలు
దాదాపు కరోనా వైరస్‌లో కనిపించే లక్షణాలు అయిన జ్వరం, దగ్గు, ముక్కు దిబ్బడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటివి ఈ హెచ్ఎంపీవీలో తలెత్తుతాయి. ఇది తీవ్రంగా మారి బ్రాంకైటిస్, నిమోనియా వంటి వాటి బారిన కూడా పడతారు. ఈ ఇన్ఫెక్షన్ స్వల్పకాలం ఉండవచ్చు, లేదా దీర్ఘకాలం ఉండవచ్చు. ఇది కూడా ఒక మనిషి నుంచి ఒక మనిషికి చాలా సులువుగా సోకుతుంది. దగ్గు, ముక్కు ద్వారా, లాలాజలం ద్వారా కణాలు గాలిలో ప్రయాణించి ఇతరులకు చేరుకుంటాయి. షేక్ హ్యాండ్ ఇవ్వడం, కౌగిలించుకోవడం, ఒకరినొకరు తాకినప్పుడు…ఇది మనిషి నుండి ఇంకో మనిషికి సులువుగా చేరుతాయి. ముఖం, ముక్కు, కన్ను, నోటి ద్వారా ఈ వైరస్ శరీరంలో చేరుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మళ్లీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం వచ్చింది. ఎవరీ షేక్ హ్యాండ్ ఇవ్వడం మానేయాలి. మాస్క్ పెట్టుకోవడం మొదలుపెట్టాలి.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
టాపిక్