Best Web Hosting Provider In India 2024
Rajahmundry : రైళ్ల షెడ్యూల్ మార్పులతో ప్రయాణికుల ఇక్కట్లు.. 3 గంటలకు పైగా నిలిచిపోయిన షిర్డీ ఎక్స్‌ప్రెస్
Rajahmundry : రాష్ట్రంలో రైళ్ల షెడ్యూల్ మార్పులతో ప్రయాణికులు ఇక్కట్లకు గురవుతున్నారు. సమాచారం తెలియకపోవడంతో పాత షెడ్యూల్ ప్రకారం రైల్వే స్టేషన్లకు చేరుకుంటున్నారు. అప్పటికే రైలు వెళ్లిపోవడం, లేకపోతే రైలు ఆలస్యంగా ఉండటంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది.
ఇటీవల సౌత్ సెంట్రల్ రైల్వే 94 రైళ్ల ప్రయాణ సమయం మార్చింది. జనవరి 1 నుంచి రైళ్లు రాకపోకలు నిర్వహించే వేళల్లో మార్పులు అమలులోకి వచ్చాయి. ఈ షెడ్యూల్ మార్పులో రైళ్లు బయలుదేరే సమయం, రైల్వే స్టేషన్‌లలో ఆగే సమయాలు ఉన్నాయి. అయితే.. ఈ సమాచారం క్షేత్రస్థాయిలో ప్రయాణికుల దృష్టికి పోలేదు. దీంతో ప్రయాణికులు గత పాత షెడ్యూల్ ప్రకారమే రైల్వే స్టేషన్లకు చేరుకుంటున్నారు. అప్పటికే రైలు వెళ్లిపోవడమో, లేకపో ఆలస్యంగా రావడమో జరుగుతోంది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
మార్పు కారణంగా..
తూర్పుగోదావరి జిల్ల రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో గందరగోళం నెలకొంది. రైలు షెడ్యూల్‌లో మార్పు కారణంగా ప్రయాణికుల్లో గందరగోళం నెలకొనడంతో రైలునే ఆపేయాల్సి వచ్చింది. సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్ రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో దాదాపు 3 గంటలకు పైగా నిలిపివేశారు. దీంతో రైల్వే స్టేషన్‌లో ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది.
షెడ్యూల్ ప్రకారం..
సౌత్ సెంట్రల్ రైల్వే రైళ్ల షెడ్యూల్‌లో మార్పులో భాగంగా.. కాకినాడ పోర్టు- సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్‌లో మార్పులు చేసింది. మారిన షెడ్యూల్ ప్రకారం.. సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్ సోమవారం ఉదయం 5 గంటలకే కాకినాడ నుంచి రైలు బయలుదేరింది. ఈ రైలు గతంలో ఉదయం 6 గంటలకు బయలుదేరేది.
మార్పులు తెలియక..
ఈ రైలు షెడ్యూల్ మార్చడంతో కాకినాడ పోర్టు, సామర్లకోట స్టేషన్లలో రైలు ఎక్కాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొంత మంది ప్రయాణికులు ఆ సమయానికి రైల్వే స్టేషన్‌కు రాకపోవడంతో రైలు ఎక్కలేకపోయారు. రైలు ఎక్కలేకపోయిన ప్రయాణికుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు.. రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్ రైలును నిలిపివేశారు.
ప్రయాణికులు వచ్చేవరకు..
కాకినాడ, సామర్లకోటలో ఉన్న ప్రయాణికులను శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌లో రాజమండ్రికి తీసుకెళ్లారు. ప్రయాణికులు రాజమండ్రి చేరుకుని అప్పుడు సాయినగర్ షిర్డీ రైలు ఎక్కారు. ఆ తరువాత రైలు రాజమండ్రి నుంచి కదిలింది. ఈ తతంగం అంతా అవ్వడానికి దాదాపు మూడు గంటల సమయం పట్టింది. రైలు షెడ్యూల్ మార్పు విషయంలో జరిగిన గందరగోళంతోనే దీనికి కారణం అయింది. రైళ్ల షెడ్యూల్ మార్పుపై ముందుగానే సమాచారం ఇచ్చామని రైల్వే అధికారులు చెబుతున్నారు. మార్పులను ప్రయాణికులు గమనించాలని అధికారులు సూచిస్తున్నారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)
టాపిక్