Best Web Hosting Provider In India 2024
Sankranthi Kodi Pandalu : కోడి పందేలకు బరులు సిద్ధం.. ఎవరొస్తారో రండి చూద్దాం.. జోరుగా ఏర్పాట్లు!
Sankranthi Kodi Pandalu : సంక్రాంతి పండగ వస్తోంది. కోడి పందేలకు వేళైంది. దీంతో నిర్వాహకులు బరులు సిద్ధం చేస్తున్నారు. పోలీస్ శాఖ నుంచి హెచ్చరికలు ఉన్నా.. నేతల అండతో నిర్వాహకులు జోరుగా ఏర్పాట్లు చేస్తున్నారు. కేవలం పండగ నాలుగు రోజుల్లోనే కోట్లాది రూపాయలు కూడబెట్టుకునే ప్లాన్ చేస్తున్నారు.
రాష్ట్రంలో సంక్రాంతి పండగ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది కోడి పందేలు. గతంలో కొన్ని ప్రాంతాలకే పరిమితం అయిన ఈ పందేల కల్చర్.. ఇప్పుడు చాలా జిల్లాలకు పాకింది. ఒకప్పుడు సరదాగా సాగిన కోడి పందేలు.. ఇప్పుడు మంచి బిజినెస్ అయ్యిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకే చాలామంది కోళ్లను పెంచడం, వాటిని విక్రయించడం, బరులు నిర్వహించడం ద్వారా కోట్లాది రూపాయలు కూడబెడుతున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి.
డబ్బులు వసూలు..
నిర్వాహకులు కోళ్ల పందెం కట్టినందుకు కొంత, గెలిచిన వారి నుంచి కొంత వాటా తీసుకుంటారు. అంతేకాకుండా బరుల వద్ద సైకిల్, టూవీలర్ పార్కింగ్ నుంచి మద్యం, ఇతర దుకాణదారుల వరకు పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేస్తారు. దీంతో పందేల పేరుతో సామాన్యుల జేబులు గుల్ల చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
కోట్లు కూడబెట్టే అవకాశం..
అతి తక్కువ రోజుల్లో కోట్లు రూపాయలు కూడబెట్టుకునే అవకాశం ఉండటంతో.. వివిధ జిల్లాల్లో ఈ సంస్కృతి పెరుగుతోంది. పండగ సంప్రదాయం పేరుతో పందేలు నిర్వహిస్తుండటంతో.. ఆపేవారు ఉండరని నిర్వాహకులు భావిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఇప్పటి నుంచే బరుల ఏర్పాట్లు ప్రారంభించారు. మరోవైపు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి.
పందెం కాయడానికి..
కోడి పందేలను చూడటానికి, పందేలు కాయడానికి ఏపీలోని ఇతర జిల్లాలతో పాటు.. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి సినీ నటులు, బడా వ్యాపారులు వస్తారు. కేవలం పండగ రోజుల్లోనే కోట్ల రూపాయలు చేతులు మారనున్నాయనే టాక్ ఉంది. ఈ ఏడాది.. 12 నుంచి 15 వరకు నాలుగు రోజులు కోడి పందేల నిర్వహించడానికి ఏర్పాట్లు చకాచకా చేస్తున్నారు.
పొలాలను చదును చేసి..
పంట పొలాలను చదును చేసి.. చుట్టూ కంచె వేస్తున్నారు. అక్కడే టెంట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. వాహనాల కోసం మట్టి రోడ్లు వేస్తున్నారు. కోడి పందేలకు వచ్చే వారి కోసం ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. బిర్యానీ, భోజన హోటళ్లు, బెల్ట్ షాపులు ఉండేలా చూసుకుంటున్నారు. వీటిని ఏర్పాటు చేసుకోవాలనుకునే వారి నుంచి కూడా నిర్వాహకులు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు.
ఇతర జిల్లాలకూ..
గతంలో ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పందేలు ఉండేవి. ఇప్పుడు ఇతర జిల్లాల్లోనూ పందేల నిర్వహణకు బరులు సిద్ధం చేస్తున్నారు. దీంతో పందెం కోళ్లకు బాగా డిమాండ్ పెరిగింది. కేవలం సంక్రాంతి కోసమే ప్రత్యేకంగా కోడి పుంజులను పెంచేవారు పెరిగారు. ఒక్కో పుంజు ధర రూ.25 వేల నుంచి రూ.2 లక్షల వరకు ఉందని పెంపకందారులు చెబుతున్నారు.
పోలీసులు సైలెంట్..!
కోడి పందేలపై గతంలో పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకునేవారు. భోగి పండగకు ముందు వరకు కోడి పందేల నిర్వహణకు వీలు లేదని పోలీసులు స్పష్టం చేశారు. కోళ్లకు కత్తులు కట్టేవారిని బైండోవర్లు చేశారు. కానీ.. కొందరు నేతలు, పెద్దల నుంచి ఒత్తిడి రావడంతో.. పోలీసులు సైలెంట్ అయ్యారనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఈసారి ఏపీలో సంక్రాంతి వేరే లెవల్ ఉంటుందనే టాక్ నడుస్తోంది.
టాపిక్