Best Web Hosting Provider In India 2024
Game Changer Movie: గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ కాకుండా ఆపాలంటూ డిమాండ్.. ఎందుకు?
Game Changer Movie: గేమ్ ఛేంజర్ సినిమా తమిళనాడులో రిలీజ్ కాకుండా ఆపాలని లైకా ప్రొడక్షన్స్ డిమాండ్ చేసింది. దీనిపై ప్రొడ్యూజర్ కౌన్సిల్‍ను సంప్రదించింది. ఎందుకో ఇక్కడ చూడండి.
మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం జనవరి 10వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. పొటిలికల్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీలో ప్రేక్షకుల ముందుకు రానుంది. శంకర్ దర్శకుడు కావడం, చరణ్‍కు పాన్ ఇండియా రేంజ్‍లో క్రేజ్ ఉండడంతో తమిళనాడులోనూ ఈ మూవీ మంచి వసూళ్లను సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి. తమిళంలోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. అయితే, తమిళనాడలో ఈ మూవీ రిలీజ్ ఆపాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఆ వివరాలు ఇవే..
ఎందుకంటే..
గేమ్ ఛేంజర్ సినిమాను తమిళనాడులో రిలీజ్ కాకుండా చర్యలు తీసుకోవాలని తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూజర్ కౌన్సిల్‍ను లైకా ప్రొడక్షన్స్ కోరింది. ఇండియన్ 3 చిత్రాన్ని డైరెక్టర్ శంకర్ పూర్తి చేసే వరకు.. గేమ్ ఛేంజర్ రిలీజ్‍ను నిలిపివేయాలని డిమాండ్ చేసింది. లోకనాయకుడు కమల్ హాసన్‍తో లైకా ప్రొడక్షన్స్ పతాకంపై ఇండియన్ 3 చిత్రం కూడా శంకర్ లైనప్‍లో ఉంది. ఇండియన్ 2 దారుణ పరాజయం చెందడం, గేమ్ ఛేంజర్ ఉండటంతో ఈ మూవీని శంకర్ పక్కన పెట్టేశారు. దీంతో ఇండియన్ 3 పూర్తి చేయాలంటూ సమయం చూసి ముందుకు వచ్చింది లైకా. గేమ్ ఛేంజర్ మూవీని టార్గెట్ చేసింది.
రిలీజ్‍కు ఇబ్బంది ఉండదట!
లైకా ప్రొడక్షన్స్ అడ్డుపడినా.. తమిళనాడులో గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్‍కు ఇబ్బందులు ఏర్పడవని తెలుస్తోంది. మూవీ టీమ్ కూడా ఇదే చెబుతోంది. విడుదలకు ఎలాంటి అడ్డంకులు ఉండవని అంటోంది. లైకా ప్రొడక్షన్స్ చేస్తున్న వాదన లీగల్‍గా కూడా నిలిచే అవకాశాలు లేవని సినీ వర్గాలు అంటున్నాయి. దీంతో జనవరి 10వ తేదీన తమిళనాడులోనూ గేమ్ ఛేంజర్ పూర్తిస్థాయిలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
గేమ్ ఛేంజర్ మూవీని అడ్డుకునేందుకు లైకా ప్రొడక్షన్స్ ప్రయత్నించడంపై అక్కడి ఎగ్జిబిటర్లు అసంతృప్తిగా ఉన్నట్టు ఇండస్ట్రీ టాక్. ఇప్పటికే ఆ బ్యానర్‌లో పొంగల్ (సంక్రాంతి)కు రావాల్సిన విదాముయర్చి వాయిదా పడింది. దీంతో స్టార్ హీరోల చిత్రాలు పండుగకు బరిలో లేవు. తమిళనాడులోనూ గేమ్ ఛేంజరే పొంగల్‍కు ప్రధానమైన మూవీగా ఉంది. దీంతో ఈ చిత్రాన్ని అడ్డుకోవడం సరికాదని కూడా ఎగ్జిబిటర్లు అంటున్నారట. మొత్తంగా గేమ్ ఛేంజర్ మూవీ అనుకున్న విధంగానే విడుదలవడం ఖాయంగా కనిపిస్తోంది.
చెన్నై ఈవెంట్‍కు విజయ్
గేమ్ ఛేంజర్ సినిమా తమిళ వెర్షన్ కోసం చెన్నైలో ఈవెంట్ నిర్వహించేందుకు మూవీ టీమ్ సిద్ధమవుతోంది. ఈ ఈవెంట్‍కు తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారనే రూమర్లు ఉన్నాయి. ఈ విషయంపై త్వరలోనే మూవీ టీమ్ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
గేమ్ ఛేంజర్ సినిమాను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‍రాజు, శిరీష్ నిర్మించారు. భారీ బడ్జెట్‍తో రూపొందించారు. ఈ మూవీలో రామ్‍చరణ్‍తో పాటు కియారా అడ్వానీ, అంజలి, ఎస్‍జే సూర్య, శ్రీకాంత్ ముఖ్యమైన రోల్స్ చేశారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు.
సంబంధిత కథనం