Best Web Hosting Provider In India 2024
Tollywood 2025: ఈ ఏడాది విపరీతమైన ఆసక్తి ఉన్న 10 తెలుగు చిత్రాలు.. బాలయ్య, పవన్ డబుల్ ధమాకా.. ప్రభాస్ నయా జానర్
Tollywood 2025: ఈ ఏడాది తెలుగులో చాలా ఇంట్రెస్టింగ్ చిత్రాలు రానున్నాయి. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అలా ఈ ఏడాది అత్యంత ఆసక్తి ఉన్న టాప్-10 చిత్రాలు ఏవో ఇక్కడ చూడండి.
గతేడాది 2024 టాలీవుడ్‍లో హనుమాన్ నుంచి పుష్ప 2 వరకు చాలా బ్లాక్‍బస్టర్ అయ్యాయి. కల్కి, దేవర, టిల్లు స్క్వేర్ ఇలా చాలా చిత్రాలు మంచి హిట్స్ కొట్టాయి. అలాగే కొన్ని సినిమాలు ఘోరంగా బోల్తా కొట్టాయి. ఇక కొత్త ఏడాది 2025లోనూ తెలుగులో చాలా ఇంట్రెస్టింగ్ చిత్రాలు రానున్నాయి. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కొన్ని చిత్రాలు రిలీజ్ కానున్నాయి. వీటిపై భారీ అంచనాలు ఉన్నాయి. బాక్సాఫీస్ షేక్ చేస్తాయనే ఆశలు నెలకొన్నాయి. వాటిలో ముఖ్యమైన 10 చిత్రాలు ఏవో ఇక్కడ చూడండి.
గేమ్ ఛేంజర్
గేమ్ ఛేంజర్ మూవీతో ఈ ఏడాది బాక్సాఫీస్ ఖాతాను టాలీవుడ్ మొదలుపెట్టనుంది. మెగాపవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటించిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన విడుదల కానుంది. స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వరుస పరాజయాలతో ఉన్న శంకర్‌కు ఈ సినిమా సక్సెస్ చాలా కీలకం. ఆర్ఆర్ఆర్ తర్వాత పాన్ ఇండియా రేంజ్‍లో క్రేజ్ నిరూపించుకునేందుకు చరణ్‍కు కూడా గేమ్ ఛేంజర్ మంచి అవకాశంగా ఉంది. నిర్మాత దిల్‍రాజు కూడా గతేడాది ఫ్యామిలీ స్టార్ చిత్రంతో ఎదురుదెబ్బ తిన్నారు. అలాగే, తన పతాకంలో 50వ చిత్రం కావడంతో సుమారు రూ.300కోట్ల భారీ బడ్జెట్‍తో ఈ చిత్రాన్ని నిర్మించారు. మొత్తంగా గేమ్ ఛేంజర్ మూవీ హైప్ విపరీతంగా ఉంది. బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతుందనే ఆశలు ఉన్నాయి.
బాలయ్య డబుల్ ధమాకా.. ఆ మూవీపైనే
నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా డాకూ మహరాజ్, అఖండ 2 చిత్రాలు ఈ ఏడాదిలోనే రిలీజ్ కానున్నాయి. బాబీ దర్శకత్వం వహించిన డాకు మహారాజ్ సంక్రాంతికి జనవరి 12న విడుదల కానుంది. అయితే, అఖండ 2పై భారీ అంచనాలు ఉన్నాయి. బోయపాటి దర్శకత్వంలో అఖండ ఓ రేంజ్ బ్లాక్‍బస్టర్ అయింది. బాలయ్య క్రేజ్‍ను మరో స్థాయికి తీసుకెళ్లింది. అఖండ 2తో తొలిసారి పాన్ ఇండియా రేంజ్ రిలీజ్‍కు బాలయ్య వెళ్లనున్నారు. దీంతో ఈ చిత్రంపై ఆసక్తి ఎక్కువగా నెలకొంది.
హరి హర వీరమల్లు ఉన్నా.. ఓజీపైనే..
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా ఉన్న హరి హర వీరమల్లు, ఓజీ చిత్రాలు 2025లో రిలీజ్ కావడం దాదాపు ఖాయమే. హరి హర వీరమల్లు ఐదేళ్ల నుంచి సాగుతోంది. డైరెక్టర్ క్రిష్ తప్పుకొని తాజాగా జ్యోతి కృష్ణ దర్శకత్వం తీసుకున్నారు. మార్చి 28న ఈ పీరియడ్ యాక్షన్ మూవీని రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీపై కూడా హైప్ బాగానే ఉంది. అయితే, అంతకు మించి ఓజీ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ గ్యాంగ్‍స్టర్ యాక్షన్ చిత్రం ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‍లో రిలీజ్ అయ్యే ఓజీ బాక్సాఫీస్‍ను షేక్ చేయడం పక్కా అని చెప్పవచ్చు. అత్యధికంగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఓజీ ముందు వరుసలో ఉంటుంది.
ది రాజా సాబ్
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ది రాజా సాబ్ చిత్రం ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ కానుంది. ప్రభాస్ తొలిసారి హారర్ కామెడీ జానర్ మూవీ చేస్తుండటంతో ఈ చిత్రంపై ఆసక్తి విపరీతంగా ఉంది. వింటేజ్ ప్రభాస్‍ను డైరెక్టర్ మారుతీ ఈ మూవీలో చూపిస్తారనే అంచనాలు ఉన్నాయి. హారర్ రొమాంటిక్ కామెడీగా రానున్న ది రాజాసాబ్ కోసం పాన్ ఇండియా రేంజ్‍లో ఎదురుచూపులు విపరీతంగా ఉన్నాయి.
వీడీ12
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కొన్నేళ్లుగా వరుస పరాజయాలు చూస్తున్నారు. గతేడాది ఫ్యామిలీ స్టార్ మూవీతో అల్ట్రా డిజాస్టర్ ఎదురైంది. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో హైవోల్టేజ్ యాక్షన్ మూవీ (వీడీ12) చేస్తున్నారు విజయ్. ఈ చిత్రం ఆయన కెరీర్‌కు అత్యంత ముఖ్యమైనది. ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. ఈ మూవీ టైటిల్, రిలీజ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు.
ఘాటి
స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్న మూవీ ఘాటి. ఇటీవలే ఈ చిత్రం నుంచి టీజర్ వచ్చింది. కత్తితో ఓ వ్యక్తిని నరికి.. తలను చేతిలో పట్టుకొని అనుష్క వెళుతున్నట్టుగా ఇంటెన్సిటీతో టీజర్ ఉంది. దీంతో ఈ మూవీ ఎలా ఉండబోతోందనే ఆసక్తి ఎక్కువగా ఉంది. స్వీటీ అనుష్క ఇలాంటి రస్టిక్ పాత్రలో చేస్తుండటం ఇంట్రెస్టింగ్‍గా అనిపిస్తోంది.
విశ్వంభర
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర చిత్రంపై కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. అంజి మూవీ తర్వాత చాలా ఏళ్లకు సోషియో ఫ్యాంటసీ జానర్ చిత్రాన్ని చిరూ చేస్తుండడమే ఇందుకు కారణం. ఈ మూవీకి బింబిసార ఫేమ్ విశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీ త్వరలో ఖరారు కానుంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయింది.
తండేల్
హీరో నాగచైతన్య కూడా వరుస పరాజయాలను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం చందూ మొండేటీ దర్శకత్వంలో తండేల్ చిత్రం చేస్తున్నారు. యథార్థ ఘటనల ఆధారంగా రూపొందిస్తున్న ఈ మూవీలో శ్రీకాకుళం మత్స్యకారుడి పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్‍గా నటిస్తున్నారు. తండేల్ మూవీపై కూడా అంచనాలతో పాటు ఆసక్తి కూడా ఎక్కువగానే ఉంది. ఫిబ్రవరి 7న ఈ మూవీ రిలీజ్ కానుంది.
కుబేర
స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న కుబేర చిత్రం ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. తమిళ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్నా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్లు, టీజర్, గ్లింప్స్ వీడియోలు చూస్తుంటే ఈ చిత్రం డబ్బు చుట్టూ తిరిగేలా కనిపిస్తోంది. ఈ మూవీతో శేఖర్ కమ్ముల.. ఏదైనా ఫిలాసఫీ చెబుతారా అనేది ఆసక్తికరంగా ఉంది. కుబేర మూవీపై బజ్ ఎక్కువగా ఉంది.
మిరాయ్
యంగ్ హీరో తేజ సజ్జా గతేడాది హనుమాన్ మూవీతో సెన్సేషనల్ హిట్ కొట్టారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న మిరాయ్ మూవీపై కూడా ఆసక్తి నెలకొంది. పురాతన గ్రంధాలు, యోధులు అంటూ ఇప్పటికే వచ్చిన టీజర్ క్యూరియాసిటీ పెంచింది. ఈ మూవీకి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ 18న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు మూవీ టీమ్ ప్రకటించింది.
వీటిపై కూడా..
అడివి శేష్ హీరోగా నటిస్తున్న సీక్వెల్ మూవీ గూఢచారి 2పై కూడా చాలా హైప్ ఉంది. నేచులర్ స్టార్ నాని హీరోగా రానున్న హిట్ 3, ది ప్యారడైజ్ చిత్రాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాయిధరమ్ తేజ్ హీరోగా రానున్న సంబరాల యేటిగట్టు మూవీపై ఇటీవల టీజర్‌తో అంచనాలు పెరిగాయి.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్.. హృతిక్ రోషన్‍తో కలిసి నటిస్తున్న వార్ 2 మూవీ ఈ ఏడాదే రానుంది. అయితే, ఈ చిత్రం బాలీవుడ్ నుంచి విడుదల కానుంది. ఈ మూవీతోనే బాలీవుడ్‍లోకి ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొడుతుందనే హైప్ ఉంది.
సంబంధిత కథనం