Best Web Hosting Provider In India 2024
Roti Pachadi: నోరు చప్పగా అనిపించినప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ రోటి పచ్చడి ఇలా చేసుకొని తిన్నారంటే రుచి అదిరిపోతుంది
Roti Pachadi: అప్పుడప్పుడు జ్వరం వల్ల, జలుబు వల్ల నోరు చప్పబడినట్టు అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇక్కడ ఇచ్చిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పచ్చడి చేసుకొని చూడండి. మీకు ఎంతో నచ్చుతుంది.
తెలుగువారికి స్పైసీగా ఉండే పచ్చళ్ళు అంటే ఎంతో ఇష్టం. నోరు చప్పబడినప్పుడు ఈ స్పైసీ పచ్చళ్ళు రుచిగా అనిపిస్తాయి. ఇవి తింటే ప్రాణం లేచి వచ్చినట్టు అనిపిస్తుంది. మీకు కూడా జలుబు వల్ల లేదా దగ్గు వల్ల నోరు చప్పగా అనిపిస్తే ఇక్కడ మేము చెప్పినట్టు ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ రోటీ పచ్చడి చేసుకొని తినండి. దీన్ని రోట్లో దంచుకుని తింటే రుచి అదిరిపోతుంది. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ రోటి పచ్చడి ఎలా చేయాలో తెలుసుకోండి.
ఉల్లిపాయ పచ్చిమిర్చి రోటి పచ్చడి రెసిపీకి కావలసిన పదార్థాలు
ఉల్లిపాయలు – రెండు
చింతపండు – ఉసిరికాయ సైజులో
పచ్చిమిర్చి – పదిహేను
నూనె – సరిపడినంత
జీలకర్ర – రెండు స్పూన్లు
ఉప్పు – రుచికి సరిపడా
మినప్పప్పు – అర స్పూను
పచ్చిశనగపప్పు – అర స్పూను
ఆవాలు – అర స్పూను
ఎండుమిర్చి – రెండు
కరివేపాకులు – గుప్పెడు
పసుపు – పావు స్పూను
వెల్లుల్లి రెబ్బలు – ఆరు
ఉల్లిపాయ పచ్చిమిర్చి రోటి పచ్చడి రెసిపీ
1. తాజా పచ్చిమిర్చిని ఈ రోటి పచ్చడి కోసం తీసుకోవాలి.
2. రెండు మీడియం సైజు ఉల్లిపాయలను తీసి పెట్టుకోవాలి.
3. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. ఆ నూనెలో పచ్చిమిర్చిని జీలకర్రను వేసి వేయించాలి.
4. ఇప్పుడు రోట్లో ఈ పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసి బాగా దంచుకోవాలి.
5. అలాగే ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కోసి వాటిని కూడా వేసి దంచుకోవాలి.
6. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి.
7. ఈ మిశ్రమంలోనే చింతపండును కూడా వేసి బాగా దంచుకోవాలి.
8. ఈ మొత్తం మిశ్రమాన్ని తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి.
9. ఇప్పుడు దీనికి తాలింపును పెట్టేందుకు స్టవ్ మీద చిన్న కళాయి పెట్టాలి.
10. నూనె వేసి పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకులు, వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా వేయించాలి.
11. చివరలో పావు స్పూను పసుపును కూడా వేసి బాగా కలుపుకోవాలి.
12. ఇప్పుడు ఈ మిశ్రమంలో రోట్లో దంచుకున్న పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి.
13. అంతే టేస్టీ ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ రోటి పచ్చడి రెడీ అయినట్టే.
14. ఇది స్పైసీగా చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే మర్చిపోలేరు.
ఇప్పుడంటే మిక్సీలు వచ్చేసాయి… ఒకప్పుడు కేవలం రోట్లో దంచుకునే పద్ధతే ఉండేది. రోటి పచ్చడికి ఉండే రుచి ఇంతా అంతా కాదు. మిక్సీలో చేసిన పచ్చడి కన్నా రోటి పచ్చడి అదిరిపోతుంది. అందుకే ఇక్కడ మేము రోటి పచ్చడి రెసిపీ ఇచ్చాము. ఉల్లిపాయలు పచ్చిమిర్చి రెండు కూడా మన ఆరోగ్యానికి మేలు చేసేవే. మీకు జ్వరంగా అనిపించినా, జలుబుతో ఉన్నప్పుడు ఈ పచ్చడి చేసుకొని తినేందుకు ప్రయత్నించండి. కేవలం పావుగంటలో ఇది రెడీ అయిపోతుంది. పచ్చిమిర్చి మరీ కారంగా ఉన్నాయనుకుంటే వాటి సంఖ్యను తగ్గించుకోవచ్చు. కొన్ని పచ్చిమిర్చి కారంగా ఉండవు అలాంటివి ఎక్కువ వేసుకోవాలి.
సంబంధిత కథనం
టాపిక్