Best Web Hosting Provider In India 2024
Pushpa 2 Collection: పుష్ప 2 సరికొత్త చరిత్ర.. బాహుబలి 2 రికార్డు బ్రేక్.. ఇండియాలో అత్యధిక వసూళ్లు
Pushpa 2 Collection: పుష్ప 2 మూవీ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఇన్నాళ్లూ బాహుబలి 2 పేరిట ఉన్న రికార్డును తిరగరాసింది. అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1831 కోట్లు వసూలు చేసింది.
Pushpa 2 Collection: పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా థియేటర్లలో రిలీజై 32 రోజులు అయింది. ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా రూ.1831 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. వీటిలో ఇండియా వసూళ్లే రూ.1438 కోట్లు కావడం విశేషం. ఈ దెబ్బతో ప్రభాస్ నటించిన బాహుబలి 2 రికార్డు మరుగునపడింది. ఈ విషయాన్ని పుష్ప 2 మేకర్స్ సోమవారం (జనవరి 6) తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా వెల్లడించారు.
“పుష్ప 2 ది రూల్ ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిట్. ఇండియాలో అత్యధిక కలెక్షన్ల మూవీగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 32 రోజుల్లో ఈ వైల్డ్ ఫైర్ బ్లాక్ బస్టర్ రూ.1831 కోట్ల గ్రాస్ వసూలు చేసింది” అని మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది. దీని ద్వారా 8 ఏళ్లుగా ప్రభాస్ బాహుబలి 2 పేరిట ఉన్న రికార్డు బ్రేకయినట్లయింది. Sacnilk ప్రకారం 32 రోజుల్లో పుష్ప 2 మూవీ రూ.1438 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
బాహుబలి 2 మూవీ రూ.1416.9 కోట్లతో ఇప్పటి వరకూ ఉన్న రికార్డు కనుమరుగైంది. ఇక బాహుబలి 2 ప్రపంచవ్యాప్తంగా రూ.1810 కోట్లు వసూలు చేసింది. ఇండియాలో అత్యధిక వసూళ్ల మూవీ అయిన ఆమిర్ ఖాన్ దంగల్.. ఇండియాలో కంటే మూడు రెట్లు ఎక్కువ విదేశాల్లోనే సంపాదించింది. ఇండియాలో ఆ సినిమాకు కేవలం రూ.535 కోట్లే వచ్చాయి.
పుష్ప 2.. దంగల్ రికార్డు బ్రేక్ చేస్తుందా?
పుష్ప 2 ఇప్పటి వరకూ ఒక్కో సినిమా రికార్డు బ్రేక్ చేస్తూ వెళ్తోంది. ఇక ఇప్పుడు ఆ మూవీ ముందు నిలిచింది దంగల్ మాత్రమే. ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.2050 కోట్లు వసూలు చేసింది. ఇప్పటి వరకూ ఇండియన్ సినిమా చరిత్రలో రూ.2000 కోట్ల మార్క్ అందుకున్న ఏకైక మూవీ అదే.
పుష్ప 2 ఆ రికార్డు బ్రేక్ చేయాలంటే ఇంకా రూ.200 కోట్లకుపైనే వసూలు చేయాల్సి ఉంది. ప్రస్తుతం మూవీ వసూళ్లు చాలా వరకు పడిపోయాయి. మరికొన్ని రోజుల్లో సంక్రాంతి సినిమాలు రానుండటంతో ఇక పుష్ప 2 జోరు పూర్తిగా తగ్గిపోనుంది. ఈ నెలలోనే ఈ మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి.