Best Web Hosting Provider In India 2024
Srikakulam Crime : కూల్‌డ్రింగ్స్‌లో మత్తు మందు కలిపి బాలికపై అత్యాచారం, గర్భం దాల్చడంతో వెలుగులోకి
Srikakulam Crime : శ్రీకాకుళం జిల్లా దారుణం చోటుచేసుకుంది. తొమ్మిదో తరగతి విద్యార్థినికి మాయమాటలు చెప్పి, కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. బాలిక గర్భం దాల్చడంతో…తనకు రాజకీయ పలుకుబడి ఉందని బెదిరిస్తున్నాడని బాధితులు వాపోతున్నారు.
Srikakulam Crime : శ్రీకాకుళం జిల్లాలో ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. బాలికను ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి యువకుడు లొంగదీసుకున్నాడు. మత్తు మందు కలిపిన కూల్‌డ్రింక్స్ ఇచ్చి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా ఈ విషయం ఎవరికైనా చెబితే కేసులు పెట్టిస్తానంటూ బెదిరింపులకు దిగాడు. బాలిక గర్భం దాల్చడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణం పరిధిలోని ఒక వీధిలో చోటు చేసుకుంది. అదే వీధికి చెందిన కోటిపల్లి రాజు (23), తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థినికి మాయమాటలు చెప్పి గర్భవతి చేసిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాలిక తల్లి ఆయాగా, తండ్రి ఓ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. వారు పనికి వెళ్లే సమయంలో రాజు బాలికను ప్రేమ పేరుతో వెంటపడేవాడు. అలా మాయమాటలు చెప్పి ఆ బాలికను లొంగదీసుకున్నాడు. కొంత కాలంగా బాలికకు కూల్‌డ్రింక్స్ మత్తు మందు కలిపి ఆమెకు ఇచ్చేవాడు. ఆమె మత్తులోకి జారిన తరువాత ఆమెపై అఘాయిత్యానికి పాల్పడేవాడు.
దీంతో బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం మీ అమ్మానాన్నలకు చెబితే వారిపై కేసులు పెట్టిస్తానని, తనకు రాజకీయ పలుకుబడి ఉందని బాలికను బెదిరించేవాడు. దీంతో బాలిక తల్లిదండ్రులకు తనపై జరిగిన అఘాయిత్యాన్ని చెప్పలేదు. అయితే బాలిక శరీరం, ప్రవర్తనలో మార్పును గమనించిన తల్లిదండ్రులు ఆమెను నిలదీశారు. దీంతో అసలు విషయం బయటపడింది. బాలిక తల్లి ఆదివారం ఆమదాలవలస పోలీసులను ఆశ్రయించింది.
తన కుమార్తెపై జరిగిన అఘాయిత్యాన్ని పోలీసులకు తెలిపి, ఫిర్యాదు చేసింది. బాలిక తల్లి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించేసరికి నిందితుడు రాజు పరారయ్యాడు. పరారీలో ఉన్న నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు అమదాలవలస ఎస్ఐ ఎస్.బాలరాజు తెలిపారు. ఈ కేసును శ్రీకాకుళం డీఎస్పీ హీహెచ్ వివేకానంద దర్యాప్తు చేస్తానని పేర్కొన్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు.
నిందితుడిని అదుపులోకి తీసుకుని చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. తనకు రాజకీయ అండదండలు ఉన్నాయని, తనను ఎవరూ ఏమీ చేయలేరని నిందితుడు తమతో అన్నాడని బాధిత కుటుంబం పేర్కొంది. కనుక నిందితుడిపై చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కూడా రంగంలోకి దిగి నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టారు.
ప్రతి రోజూ రాష్ట్రంలో ఏదో ఒక మూలన చిన్నారులపైన, మహిళలపై అత్యాచార ఘటనలు నిత్యకృత్యం అయ్యాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని మహిళ సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. బాలికలు, మహిళలపై అత్యాచారాలను అరికట్టాలని, అందుకు పకడ్బందీగా విధానాల రూపకల్పన చేయాలని కోరుతున్నారు. ప్రజల్లో అవగాహన పెంచటంతో పాటు కఠినమైన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం
టాపిక్