Best Web Hosting Provider In India 2024
Telugu TV Shows TRP Ratings: తెలుగులో టాప్ టీవీ షో ఇదే.. వచ్చీ రావడంతోనే బెస్ట్ టీఆర్పీ రేటింగ్.. ఎక్కడ చూడాలంటే?
Telugu TV Shows TRP Ratings: తెలుగు టీవీ షోలకు సంబంధించి 52వ వారం టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. స్టార్ మాలో బిగ్ బాస్ ప్లేస్ లో వచ్చిన ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 లాంచింగ్ ఎపిసోడే టాప్ లో నిలవడం విశేషం. టాప్ 5లో ఇంకా ఏ షోలు ఉన్నాయో చూడండి.
Telugu TV Shows TRP Ratings: స్టార్ మా ఛానెల్ అటు సీరియల్స్ లో, ఇటు షోలలో ఇతర తెలుగు ఛానెల్స్ కు అందనంత ఎత్తులో ఉంటోంది. టీఆర్పీ రేటింగ్స్ లో ఆ ఛానెల్లో వచ్చే సీరియల్స్, షోలన్నీ తిరుగులేని రేటింగ్స్ తో దూసుకెళ్తున్నాయి. తాజాగా స్టార్ మా ఛానెల్లో మొదలైన ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 లాంచింగ్ ఎపిసోడే దుమ్ము రేపింది. 52వ వారానికి సంబంధించిన రేటింగ్స్ లో ఈ షోనే టాప్ లో నిలవడం విశేషం.
ఇస్మార్ట్ జోడీ టీఆర్పీ రేటింగ్
స్టార్ మా ఛానెల్లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ముగియగానే దాని స్థానంలో ఈ ఇస్మార్ట్ జోడీ మూడో సీజన్ మొదలైంది. గతేడాది డిసెంబర్ 21న తొలి ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది. ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ఈ షో వస్తోంది. అయితే తొలి ఎపిసోడే మంచి రెస్పాన్స్ సంపాదించింది. ఓంకార్ హోస్ట్ చేస్తున్న ఈ షోకి అర్బన్, రూరల్ కలిపి 5.23 రేటింగ్ నమోదు కావడం విశేషం.
ఇక కేవలం అర్బన్ చూసుకుంటే ఇది ఏకంగా 6.33గా ఉంది. అంతకుముందు వచ్చిన బిగ్ బాస్ వీకెండ్ షో కంటే ఇది ఎక్కువే. తొలి ఎపిసోడ్ కే ఈ స్థాయి రేటింగ్ నమోదైందంటే.. రానున్న రోజుల్లో ఈ షో ఏం చేస్తుందో చూడాలి. సెలబ్రిటీ జోడీలతో సరదాగా గేమ్స్ ఆడిస్తూ, వాళ్ల మధ్య అనుబంధాన్ని చూపిస్తూ సాగిపోయే షో ఇది.
తాజా సీజన్ లో రాకింగ్ రాకేష్, సుజాత జోడీ.. ఆదిరెడ్డి, కవిత జోడీ.. అమర్, తేజు జోడీలతోపాటు మరికొందరు కూడా పాల్గొంటున్నారు. ఈ షో లాంచింగ్ ఎపిసోడ్ సరదాగా సాగిపోయింది. దీనికి ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో తాజా రేటింగ్స్ చూస్తేనే స్పష్టమవుతోంది.
టాప్ 5లో ఉన్న మిగతా షోలు ఇవే
52వ వారానికి రిలీజైన టీఆర్పీ రేటింగ్స్ లో ఇస్మార్ట్ జోడీ తర్వాత స్టార్ మాలోనే వచ్చే ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఉంది. ఈ షోకి 3.79 రేటింగ్ నమోదైంది. మూడో స్థానంలో ఈటీవీలో వచ్చే శ్రీదేవి డ్రామా కంపెనీ 3.67 రేటింగ్ తో నిలిచింది. ఇక ఆ తర్వాత జీ తెలుగులో వస్తున్న సరిగమప 3.02, ఈటీవీలో వచ్చే జబర్దస్త్ 2.38, ఢీ షో 2.26, సుమ అడ్డా 1.40, పాడుతా తీయగా 1.38 రేటింగ్స్ సాధించి తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
స్టార్ మా ఛానెల్ టీవీ సీరియల్స్ కూడా చాలా నెలలుగా టీఆర్పీ రేటింగ్స్ విషయంలో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. టాప్ 10లో మొదటి ఆరు స్థానాల్లో ఆ ఛానెల్లో వచ్చే సీరియల్సే ఉన్నాయి. ఇక ఇప్పుడు టీవీ షోల విషయంలోనూ ఈటీవీకి గట్టి పోటీ ఇస్తోంది. టాప్ 1 లేదా 2లలో స్టార్ మా ఛానెల్ షోలే ఉంటూ వస్తున్నాయి.