Best Web Hosting Provider In India 2024
Formula E race Case : ఫార్ములా ఈ రేస్ కేసులో మరో ట్విస్ట్.. కేటీఆర్ కంటే ముందే సుప్రీంకోర్టుకు రేవంత్ సర్కారు!
Formula E race Case : ఫార్ములా ఈ రేస్ కేసు పంచాయితీ సుప్రీంకోర్టుకు చేరింది. కేటీఆర్ కంటే ముందే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో రేవంత్ సర్కార్ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. దీంతో కేటీఆర్ అరెస్టు తప్పదనే ఊహాగానాలు మరింత బలపడ్డాయి.
ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి.. తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టులో కెవియట్ దాఖలు చేసింది. కేటీఆర్ సుప్రీంను ఆశ్రయిస్తే తమ వాదన కూడా వినాలని కెవియట్ వేసింది. క్వాష్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేయడంతో.. సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో కేటీఆర్ ఉన్నారనే ప్రచారం జరిగింది. దీంతో ప్రభుత్వం ముందుగానే కెవియట్ దాఖలు చేసింది. దీంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది.
ఏసీబీ కేసు..
ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంపై తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసింది. అయితే.. ఈ కేసును కొట్టేయాలంటూ కేటీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ.. తెలంగాణ హైకోర్టు క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసింది. ప్రభుత్వ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. అరెస్ట్ చేయొద్దంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులును ఎత్తివేసింది. ఏసీబీ దర్యాప్తులో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
మంతనాలు..
ఈ నేపథ్యంలో బంజారాహిల్స్ నందినగర్ నివాసంలో కేటీఆర్, బీఆర్ఎస్ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టేయడంతో.. ఇప్పుడు ఏం చేయాలని మంతనాలు జరిపారు. కొందరు నేతలు సుప్రీంకోర్టుకు వెళ్లాలని అభిప్రాయపడగా.. మరికొందరు ఏసీబీ విచారణను ఎందుర్కొంటే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో.. బీఆర్ఎస్ లీగర్ టీమ్ కసరత్తు ప్రారంభించింది. కేటీఆర్ అరెస్టు కాకుండా ఉన్న మార్గాలను అన్వేషిస్తోందని తెలుస్తోంది.
కేసు ఏంటీ..
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం రూ.55 కోట్లు విదేశీ కంపెనీలకు చెల్లించారు. అప్పట్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే.. హెచ్ఎండీఏ ఈ నిధులను విదేశీ సంస్థలకు చెల్లించిందనే ఆరోపణలు ఉన్నాయి. అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు. విదేశీ సంస్థలకు నిధుల చెల్లింపుతో కేటీఆర్‌కు సంబంధం ఉందని ప్రభుత్వం అనుమానించింది. దీనికి సంబంధించి గవర్నర్‌కు లేఖ రాసింది. అదే సమయంలో మున్సిపల్ శాఖ ఏసీబీకి ఫిర్యాదు చేసింది.
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా..
రంగంలోకి దిగిన ఏసీబీ.. విచారణ ప్రారంభించింది. బ్యాంక్ లావాదేవీల వివరాలు సేకరించింది. హెచ్ఎండీఏ నుంచి బదిలీ అయిన నిధులు.. ఏ ఖాతాలోకి వెళ్లాయనేది గుర్తించింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలోనే నిధులు బదిలీ అయినట్టు ఏసీబీ తేల్చింది. ఈసీ నుంచి అనుమతులు తీసుకోకుండానే నిబంధనలు అతిక్రమించారని గుర్తించింది.
మొత్తం రూ.54.89 కోట్లు..
2023 అక్టోబర్ నెలలో రెండు తేదీల్లో హెచ్‌ఎండీఏ బోర్డు అకౌంట్ నుంచి రూ.45.71 కోట్లు లండన్‌లోని ఫార్ములా ఈ ఆపరేషన్స్‌కు బదిలీ చేశారు. ఇందుకు ఆర్బీఐ రూల్స్ పాటించలేదు. దీంతో హెచ్‌ఎండీఏ రూ.8 కోట్లను ఐటీ శాఖకు పెనాల్టీగా చెల్లించాల్సి వచ్చింది. మొత్తం రూ.54.89 కోట్లు మున్సిపల్ నిధులను అప్పటి మంత్రి కేటీఆర్ దుర్వినియోగం చేశారని ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌లో స్పష్టం చేసింది. ఈ ఆరోపణలను బీఆర్ఎస్ ఖండించింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచడానికే కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ తీసుకొచ్చారని వ్యాఖ్యానించింది.
టాపిక్