Best Web Hosting Provider In India 2024
Tirumala Vaikunta Dwara Darshan: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు-టికెట్లు, వసతి, ప్రత్యేక దర్శనాలపై పూర్తి వివరాలు
Tirumala Vaikunta Dwara Darshan : జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు ఏడు లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలిపారు. పది రోజుల పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
Tirumala Vaikunta Dwara Darshan : సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించడమే తమ అత్యంత ప్రాధాన్యత అని టీటీడీ ఈవో జె శ్యామలరావు పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో అడిషనల్ ఈవోతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈవో మాట్లాడారు. వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై వివరించారు. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు ఏడు లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసిందని తెలిపారు.
- జనవరి 10 నుంచి 19 వరకు 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారం భక్తుల కోసం తెరిచి ఉంటుంది.
- జనవరి 10న కైంకర్యాల తర్వాత, ప్రోటోకాల్ దర్శనం ఉదయం 4.30 గంటలకు ప్రారంభమవుతుంది. తరువాత 8 గంటలకు సర్వ దర్శనం ప్రారంభం అవుతుంది.
- వైకుంఠ ఏకాదశి రోజున(జనవరి 10) ఉదయం 9 నుంచి 11 గంటల వరకు మలయప్ప స్వామి బంగారు రథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులను అనుగ్రహించనున్నారు.
- అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వాహన మండపంలో మలయప్ప స్వామి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
- జనవరి 11న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 5.30 గంటల నుంచి 6.30 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తారు.
- జనవరి 9వ తేదీ ఉదయం 5 గంటల నుంచి తిరుపతిలోని 8 కేంద్రాల్లో ఏర్పాటు చేసిన 90 కౌంటర్లు, తిరుమలలో ఏర్పాటు చేసిన ఒక కేంద్రంలో 4 కౌంటర్లలో ఎస్‌ఎస్‌డి టోకెన్లు జారీ చేయనున్నారు.
జనవరి 10, 11, 12 తేదీల్లో భక్తులకు 1.20 లక్షల టోకెన్లు జారీ చేసేందుకు ఈ కింద కేంద్రాలు ఏర్పాటు చేశారు.
1. ఇందిరా మైదాన్.
2. రామచంద్ర పుష్కరిణి.
3. శ్రీనివాసం కాంప్లెక్స్.
4. విష్ణు నివాసం కాంప్లెక్స్.
5. భూదేవి కాంప్లెక్స్.
6. రామానాయుడు ఉన్నత పాఠశాల, భైరాగిపట్టెడ.
7. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, MR పల్లి.
8. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తిరుపతిలోని జీవకోన
9. తిరుమల వాసుల కోసం బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్
జనవరి 13-19 వరకు శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్‌లో మాత్రమే అదే రోజు దర్శనానికి రోజువారీ ప్రాతిపదికన టోకెన్లు జారీ చేస్తారు. పది రోజుల వైకుంఠ ద్వార దర్శనం కోసం ఇప్పటికే 1.40 లక్షల ఎస్ఈడీ టిక్కెట్లు, 19,500 శ్రీవాణి టిక్కెట్లు ఆన్‌లైన్‌లో విడుదలయ్యాయి.
పది రోజుల పాటు ఈ దర్శనాలు రద్దు
ప్రోటోకాల్ వీఐపీలు మినహా, వీఐపీ బ్రేక్ దర్శనం, సీనియర్ సిటిజన్లు, శారీరక వికలాంగులు, శిశువులు ఉన్న తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐలు వంటి ఇతర ప్రత్యేక దర్శనాలు ఈ పది రోజులలో రద్దు చేశారు. తిరుమలలో పరిమిత సంఖ్యలో వసతి అందుబాటులో ఉన్నందున, దర్శన టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే వారి టోకెన్లపై పేర్కొన్న తేదీ, సమయంలో క్యూ లోకి అనుమతిస్తారు. జనవరి 9న తిరుపతిలో ఎస్ఎస్డీ టోకెన్లు జారీ చేస్తారు.
10 రోజుల పాటు వసతి గదుల ఆన్ లైన్ బుకింగ్ రద్దు
జనవరి 19 వరకు శ్రీవారి మెట్టు కౌంటర్లు మూసి ఉంటాయని టీటీడీ ఈవో జె.శ్యామలరావు తెలిపారు. ఈ పది రోజుల్లో సిఫారసు లేఖలు స్వీకరించరన్నారు. పది రోజుల పాటు తిరుమలలో వసతి గదుల ఆన్‌లైన్ బుకింగ్ రద్దు చేసినట్లు పేర్కొన్నారు. సాధారణ భక్తులకు సీఆర్వోలో వసతి కేటాయిస్తారని తెలిపారు.
12 వేల వాహనాలకు పార్కింగ్
జనవరి 8 నుంచి 11 వరకు 4 రోజుల పాటు తిరుమలలో ఎంబీసీ, ఏఆర్పీ, టీబీసీ, కాటేజ్ డోనర్ స్కీమ్ కేటాయింపు కౌంటర్ల మూసివేయనున్నారు. తిరుమలలో దాదాపు 12 వేల వాహనాలకు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయనున్నారు. ఎంబీసీ, ఔటర్ రింగ్ రోడ్, RBGH ఏరియా, పరకామణి భవన్ సమీపంలో పార్కింగ్ స్థలాల ఏర్పాటు చేయనున్నారు. భక్తుల సౌకర్యార్థం టికెట్లపై ఎంట్రీ పాయింట్, దిగే పాయింట్, పార్కింగ్ పాయింట్, పికప్ పాయింట్ వివరాలను ముద్రించారు.
వైకుంఠ ద్వార దర్శనాల భద్రతా ఏర్పాట్లపై తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ.. యాత్రికుల భద్రత కోసం తిరుపతిలో 1200 మంది, తిరుమలలో 1800 మంది పోలీసులతో కలిపి దాదాపు 3000 మంది పోలీసులను మోహరించినట్లు తెలిపారు. తిరుపతి, తిరుమలలోని అన్ని సర్వ దర్శన టోకెన్ల జారీ కేంద్రాల వద్ద టీటీడీ సమన్వయంతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. తిరుమలలో ట్రాఫిక్ రద్దీని నివారించడానికి నిర్ణీత తేదీ, సమయాన్ని అనుసరించి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలని అభ్యర్థించారు.
సంబంధిత కథనం
టాపిక్