Best Web Hosting Provider In India 2024
Exam Fear: మీ పిల్లలు పరీక్షలు అనగానే భయపడిపోతుంటారా? వారికి సహాయం చేయాలనుకుంటే ఈ చిట్కాలను పాటించండి
Exam Fear: పరీక్షలు అనగానే పిల్లలలో ఒక భయం మొదలవుతుంది. ఆందోళనలో పడి వారి మెదడు పనితీరు దెబ్బతింటుంది. దీన్ని పొగొట్టి వారు చక్కగా పరీక్షలు రాసేందుకు తల్లిదండ్రులుగాా మీరు సహాయం చేయాలనుకుంటే ఈ చిట్కాలు మీ కోసమే. వీటిని పాటించారంటే మీ పిల్లలను పరీక్షలకు బాగా సిద్ధం చేయచ్చు.
పరీక్ష అనగానే పిల్లలు చాలా కంగారు పడతారు, వారిలో తెలియని భయం, ఆందోళన పెరుగుతాయి. అదే సమయంలో మంచి మార్కులు తెచ్చుకోవాలని తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం కూడా వారిపై ఒత్తిడి తీసుకురావడంతో చాలా మంది పిల్లలు ఎగ్జామ్ ఫోబియాకు గురవుతున్నారు. ఇది వారి మానసిక స్థితిలో మార్పులను తీసుకొస్తుంది. చదువు మీద దృష్టి పెట్టనివ్వకుండా, అన్నింటిని మరచిపోయేలా చేస్తుంది. పరీక్షల భయంతో వారి ప్రయత్నాలు, సన్నద్ధత అన్నీ దెబ్బతినే అవకాశాలున్నాయి.
మీ పిల్లలు కూడా పరీక్షలు అనగానే భయపడుతుంటే, వారిలో తెలియని మార్పు కనిపిస్తుంటే.. తల్లిదండ్రులుగా మీరు వారికి సహాయం చేయాల్సి ఉంటుంది. పరీక్షలు దగ్గరపడుతుండగానే వారిపై దృష్టి పెట్టి వారిలోని భయాన్ని, ఆందోళనను పోగొట్టే బాధ్యత మీపైనే ఉంటుంది. వారి కోసం సానుకూల వాతావరణాన్ని సృష్టించాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు తలచుకుంటే వారిలోని భయాన్ని చదువుపై ఆసక్తిగా మార్చవచ్చని మానసిక నిపుణులు చెబుతున్నారు. పరీక్షల కోసం మీ పిల్లలను చక్కగా సిద్దం అయ్యేందుకు మీరు సహాయపడాలనుకుంటే ఈ చిట్కాలు మీ కోసమే.
1) ఒత్తిడి పెంచొద్దు:
పరీక్షలు అనగానే కొంతమంది తల్లిదండ్రులు పిల్లల కన్నా ఎక్కువ టెన్షన్ పడుతుంటారు. పరీక్షలు దగ్గర పడ్డాయి, చదవాలి, రాయాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి వంటి మాటలు పదే పదే అంటుంటారు. వాస్తవానికి ఇది తల్లిదండ్రులు చేసే చాలా పెద్ద పొరపాటు. పిల్లలు మంచి మార్కులు తెచ్చుకోవాలంటే వారిపై ఎక్కువ ఒత్తిడి పెట్టకూడదు. పదే పదే వారికి పరీక్షలను గుర్తు చేస్తూ ప్రశ్నలు అడగకూడదు. ఇలా చేయడం వారి మనస్సును ప్రభావితం చేస్తుంది. వారిలో భయాన్ని పెంచుతుంది. అటువంటి పరిస్థితిలో పిల్లవాడు ఒత్తిడికి గురవుతాడు.
2) సమస్యలను వినండి:
పరీక్షల ఒత్తిడి కారణంగా పిల్లలు తరచుగా వారి స్నేహితులను కలిసేందుకు బయటికి వెళ్లరు. ఇంట్లో ఎక్కువ సమయం గడుపుతారు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల సమస్యలు వినాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. మీరు వారి సమస్యలను ఓపికగా వినడం వారికి మంచి అనుభూతిని కలుగుతుంది. వారి సమస్యలు విన్న తరువాత మీరు వారికి కొన్ని సలహాలు ఇవ్వవచ్చు. ఫలితంగా వారిలో సానుకూల దృక్పథం ఏర్పడి ఒత్తిడి స్థాయి తగ్గుతుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏంటంటే.. మీ సలహాలు వారికే నచ్చితే వారే పాటిస్తారు అంతేకానీ వాటిని మీరు బలవంతంగా వారిపై రుద్దడం తప్పు.
3) అభ్యసన వాతావరణాన్ని సృష్టించండి:
పిల్లలలో పరీక్షల భయం పొగొట్టాలంటే వారి కోసం మీరు చక్కటి అభ్యసన వాతావరణం సృష్టించడం చాలా ముఖ్యం. చాలా మంది పిల్లలకు ప్రిపరేషన్ మొదలుపెట్టిన కొద్ది నిమిషాల్లోనే పిల్లలకు బోర్ కొడుతుంది. ఇలా బోర్ కొట్టినప్పుడు వారు పరధ్యానంలోకి వెళ్లడం చాలా సహజం. అలా వారు డైవర్ట్ అయే వేరే విషయంలోకి మళ్లకుండా ఉండేందుకు చదువుకునే ప్రాంతంలో స్మార్ట్ఫోన్లు, వీడియో గేమ్స్, ఇతర వస్తువులు లేకుండా చూసుకోండి. అలాగే, గదిలో తగినంత వెలుతురు, గాలి ఉండేలా చూసుకొండి. వారి కోసం సౌకర్యవంతమైన కుర్చీని ఎంచుకుని ఇవ్వండి.
4) లక్ష్యాలను నిర్దేశించుకోమని చెప్పండి:
తల్లిదండ్రులు పిల్లలకు చదువు కోసం లక్ష్యాలను నిర్దేశించడంలో సహాయపడాలి. చివరి నిమిషంలో కంగారు పడకుండా ముందుగానే ప్రిపేర్ అయ్యేలా వారిని ప్రోత్సహించాలి. రివిజన్ చేసుకునే సమయంలో అత్యంత క్లిష్టమైన సబ్జెక్టు లేదా టాపిక్ ను చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి వాటిని ఎక్కువగా చదవమని చెప్పండి. క్లిష్టమైనవి ముందుగా నేర్చుకోవడం వల్ల వారిలో నమ్మకం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. పరీక్షల మీద భయం తగ్గి ఆసక్తి పెరుగుతుంది.
5) టైమ్ టేబుల్ సెట్ చేయండి:
పిల్లల బలాలు, బలహీనతలను దృష్టిలో ఉంచుకుని ప్రతి అంశానికి టైమ్ స్లాట్ సెట్ చేసుకుని చదువుకునేలా చేయండి. టైమ్ టేబుల్ సెట్ చేయడం వల్ల చివరి సమయాల్లో హడావిడి తగ్గుతుంది. భయం, ఆందోళన తగ్గి ఫోకస్ పెరుగుతుంది. లేకుండా పరీక్షలకు వెళతారు.
వైద్యుడిని సంప్రదించండి:
ఇవన్నీ చేసిన తర్వాత కూడా పిల్లలు పరీక్షలంటే చాలా భయపడుతుంటే.. మానసికంగా వారు బలహీనంగా ఉన్నాకని అర్థం. కనుక మీరు వెంటనే మానసిక వైద్య నిపుణులను సంప్రదించి పిల్లలకు కౌన్సిలింగ్, చికిత్స వంటివి చేయించడం మంచిది.