Best Web Hosting Provider In India 2024
Nandigam Suresh Bail : వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బెయిల్ నిరాకరణ.. తాము జోక్యం చేసుకోలేమన్న సుప్రీం
Nandigam Suresh Bail : నందిగం సురేష్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టులో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. మరియమ్మ హత్య కేసులో బెయిల్ మంజూరు చేయడానికి సుప్రీం నిరాకరించింది. బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సూచించింది.
మరియమ్మ హత్య కేసులో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు హైకోర్టు బెయిల్ నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం విచారించింది. ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు.
ఒత్తిడి తెచ్చారు..
ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పుడు నందిగం సురేష్ తనపై ఎటువంటి నేర చరిత్ర లేదని పేర్కొన్నారని, అప్పటికే ఆయనపై ఐదు కేసులు ఉన్నాయని సిద్ధార్థ లూత్రా కోర్టు వివరించారు. దర్యాప్తును, సాక్షులను ప్రభావితం చేశారని, 36 మందితో ఉన్న ఎఫ్ఐఆర్‌లో ఆయన పేరు లేకుండా ఒత్తిడి తెచ్చారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
లూత్రా లాజిక్..
కేసు నమోదు అయినప్పుడు ఆయన ఎంపీగా ఉన్నారని, ఆయన పార్టీ అధికారంలో ఉండటంతో మూడేళ్లుగా దర్యాప్తులో పురోగతి లేదని లూత్రా ధర్మాసనానికి వివరించారు. ట్రయిల్ కోర్టు ఈ అంశాలను పరిగణనలో తీసుకుని, దర్యాప్తు లోపభూయిష్టంగా ఉందని పేర్కొని, బెయిల్ నిరాకరించిందని తెలిపారు. బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లారని, హైకోర్టు కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేసి, బెయిల్ తిరస్కరించిందనట్టు నివేదించారు సిద్ధార్థ లూత్రా.
దాచడం ఎందుకు..
నందిగం సురేష్ తరపున సీనియర్ న్యాయవాది మహేష్ జఠ్మలానీ వాదనలు వినిపించారు. బెయిల్ మంజూరుకు నేర చరిత్రతో సంబంధం లేదని అన్నారు. అందుకు 2012, 2024ల్లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను ఉదాహరించారు. ధర్మాసనం జోక్యం చేసుకుని నేర చరిత్ర ఉందా? లేదా? అనేది సమస్య కాదని.. నేర చరిత్రను దాచిపెట్టడమే ప్రధానమైన అంశమని పేర్కొంది.
జఠ్మలాని వాదనలు..
ప్రస్తుత కేసులో నేర పాత్రను పరిశీలించాలని, అంతేతప్ప పూర్వ నేర చరిత్రకు సంబంధం లేదని జఠ్మలాని కోర్టుకు వివరించారు. మొదట అసలు నందిగం సురేష్‌కు వ్యతిరేకంగా ఒక్క సాక్షం కూడా లేదని.. రెండోసారి విచారణ జరిపినప్పుడు ఐదుగురు సాక్ష్యం ఇచ్చారని చెప్పారు. వీరంత ఒకేలా సాక్ష్యం ఇవ్వడం చూస్తే.. కావాలనే నందిగం సురేష్‌కు వ్యతిరేకంగా ఏదో జరిగిందనే అనుమానం కలిగిందన్నారు. పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో.. తాము జోక్యం చేసుకోలేమని.. ట్రయల్ కోర్టుకు వెళ్లాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది.
కేసు ఏంటీ..
2020లో తుళ్లూరు మండలం వెలగపూడికి చెందిన ఎస్సీ మహిళ మరియమ్మపై.. మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుచరులు దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆమెకు వస్తున్న పెన్షన్‌ను నిలిపివేశారని, ఇళ్లు ఇస్తామని ఇవ్వలేదని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరియమ్మ దూషించింది. దీంతో సురేష్ అనుచరులు ఆమె ఇంటిపై దాడి చేశారనే అభియోగాలు ఉన్నాయి. ఆమెను కొందరు హతమార్చారు. ఈ విషయంపై అప్పట్లో మరియమ్మ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు పట్టించుకోలేదు. దీంతో దర్యాప్తు ముందుకు కదల్లేదు.
లోకేష్ ఆదేశాలతో..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మరియమ్మ కుమారుడు.. మంత్రి నారా లోకేష్‌ను కలిసి తమకు న్యాయం చేయాలని కోరాడు. మరియమ్మ మృతి గురించి వివరాలను, పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును లోకేష్‌కు వివరించారు. మంత్రి లోకేష్ సూచనలతో కేసు దర్యాప్తు ప్రారంభమైంది. ఈ కేసులో నందిగం సురేష్‌ను అరెస్టు చేశారు. బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయిస్తే, అందుకు కోర్టు తిరస్కరించింది. దీంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మంగళవారం విచారణ జరిపిన సుప్రీం కోర్టు ధర్మాసనం.. నందిగం సురేష్‌కు బెయిల్ నిరాకరించింది.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)
టాపిక్